సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లాలో ఇద్దరు సిమి ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌తో ఈ సంస్థ కార్యకలాపాలు మరోసారి సర్వత్రా చర్చనీయమయ్యాయి. స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఎంఐ) పేరుతో ఇస్లాం మతవ్యాప్తే లక్ష్యంగా కొందరు యువకులు ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ కేంద్రంగా 1977లో ఈ సంస్థను నెలకొల్పారు. భారత్‌ను ఇస్లాం దేశంగా మార్చాలనే సంకల్పంతో దేశంపైనే జిహాద్(పవిత్ర యుద్ధం) ప్రకటించింది సిమి! హింసాత్మక కార్యకలాపాల ద్వారా లక్ష్యసాధనకు ఉగ్రవాదాన్నే మార్గంగా ఎంచుకుంది. యూపీకి చెందిన ప్రొఫెసర్ మహమ్మద్ అహ్మదుల్లా సిద్ధిఖీ దీని వ్యవస్థాపకుడు.
మొదట్లో జమాతే ఇస్లామే హింద్ విద్యార్థి విభాగంగా ఆవిర్భవించిన సిమి.. 1981లో ఆ సంస్థతో సంబంధాలు తెంచుకుంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నేరం కింద 14 ఏళ్ల కిందటే ఈ సంస్థను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. దేశంలో పలు విధ్వంసక చర్యల్లో సిమి పేరు వినిపించింది. అహ్మదాబాద్‌లో వరుస బాంబు పేలుళ్లు, కాన్పూరు మత ఘర్షణల్లో సిమి ఉగ్రవాదుల ప్రమేయం బట్టబయలైంది. 2001లో ఈ సంస్థను నిషేధించాక మధ్యప్రదేశ్ నుంచి గుట్టుగా తమ కార్యకలాపాలను విస్తరించింది. నిషేధం తర్వాత ఆ రాష్ట్రంలోనే పోలీసులు దాదాపు 180 మంది మిలిటెంట్లను అరెస్టు చేయడమే సిమి విస్తరించిన తీరుకు అద్దం పడుతోంది.
పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్‌లోని పలు ఉగ్రవాద సంస్థలతో ఈ సంస్థకు సంబంధాలున్నాయి. పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐతోనూ లింకులున్నట్లు పోలీసులు తేల్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ సిమి చాపకింద నీరులా విస్తరించింది. సిమి తమ కార్యకలాపాలకు అవసరమయ్యే నిధుల సమీకరణకు ‘మాల్ ఏ ఘనీమత్’ పేరుతో యాక్షన్ టీమ్‌ను ఏర్పాటు చేసుకుంది. నల్గొండ జిల్లాలో చనిపోయిన ఉగ్రవాదులు ఈ టీమ్‌లోని సభ్యులే. అందుకే వరుసగా బ్యాంకు దోపిడీ, నగల దోపిడీలపైనే ఈ ముఠా దృష్టి సారించింది.
ఎక్కడిదీ సిమి?
Published Mon, Apr 6 2015 2:04 AM | Last Updated on Sat, Sep 2 2017 11:54 PM
Advertisement