Student Islamic Movement of India
-
‘సిమి’ ఉగ్రవాదులపై రివార్డు
సాక్షి, హైదరాబాద్: స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) ఉగ్రవాదులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రివార్డు ప్రకటించింది. గతేడాది ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నూర్లో జరిగిన పేలుడుకు సంబంధించి మొత్తం నలుగురు సిమి ఉగ్రవాదులపై శుక్రవారం రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది. వీరి ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాల్సిందిగా కోరింది. రాష్ట్రంలోని చొప్పదండిలోని బ్యాంకు దోపిడీ, చెన్నై రైల్వేస్టేషన్, బెంగళూరు చర్చి స్ట్రీట్ బ్లాస్ట్‌లతో వీరు నిందితులు. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు నుంచి అబు ఫైజల్, ఎజాజుద్దీన్ మహ్మద్, జాకీర్ హుస్సేన్, మహబూబ్, అస్లం అయూబ్ ఖాన్, అంజద్ రంజాన్ ఖాన్, అబిద్‌లు 2013 అక్టోబర్‌లో పారిపోయారు. అబు ఫైజల్, అబిద్‌లు పోలీసులకు చిక్కారు. మిగిలిన వారు సూర్యాపేటలో పోలీసులపై కాల్పులకు తెగబడి అందులో ఇద్దరు ఉగ్రవాదులు మరణించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో పోలీసుల ఎదురు కాల్పుల్లో అర్వపల్లిలో ఎజాజ్, అస్లం మరణించగా మిగిలిన ముగ్గురి కోసం పోలీసులు వెదుకుతున్నారు. మహ్మద్ సాలఖ్, మహబూబ్ తల్లి నజ్మాజీకి వీరితో సంబంధాలున్నాయని అధికారులు గుర్తించారు. కాగా, మహారాష్ట్రలోని పుణేలో జరిగిన బాంబు పేలుడుతో పాటు మరికొన్ని కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న మహబూబ్, అంజాద్, జాకీర్‌పై యాంటీ టైస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు గత నెలలో రూ.10 లక్షల చొప్పున రివార్డు ప్రకటించారు. తాజాగా ఎన్ఐఏ ప్రకటించిన మొత్తంతో కలిపి వీరిపై ఉన్న రివార్డు మొత్తం రూ.70 లక్షలకు చేరింది. దేశ వ్యాప్తంగా ఉగ్ర పంజా విసురుతున్న వీరు ఏపీ, తెలంగాణలో ఆశ్రయం పొందే వీలు లేకపోలేదని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. పాత వస్త్రాలు అమ్మే వారిగా వీరు చెలామణీ అవుతారని పేర్కొన్నాయి. -
వికార్ 'టెర్రర్'
బయట ఉన్నా.. జైలులో ఉన్నా ఉగ్ర పోకడలే చిన్నతనం నుంచే విపరీత భావాలు, విద్వేషభరితం డీజేఎస్‌లో శిక్షణ.. ఉగ్రవాదంవైపు అడుగులు ► ఆయుధాలు, పేలుడు పదార్థాల ► తయారీలో నైపుణ్యం.. సిమి, ఐఎం, ఐఎస్ఐ, ► హుజీ, ఎల్ఈటీతో సంబంధాలు ► మక్కా పేలుళ్ల తర్వాత టీజీఐ పేరుతో ► సొంత సైన్యం.. పోలీసులపై ప్రతీకార దాడులు, ముగ్గురు పోలీసుల హత్య హైదరాబాద్: వికార్ అహ్మద్ అలియాస్ వికారుద్దీన్ హైదరాబాద్ నగరంలో ‘టై’ పుట్టించాడు. బీకాం(కంప్యూటర్స్) మధ్యలోనే ఆపేసిన వికార్.. పవిత్ర యుద్ధం పేరిట ఆయుధాలు, పేలుడు పదార్థాల తయారీలో నైపుణ్యం సాధించాడు. ధ్వంస రచనలో దిట్టగా పేరొందాడు. ప్లాస్టిక్ సర్జరీతో ముఖాన్నే మార్చుకున్నాడు. మారు వేషాలతో తిరుగుతూ పోలీసులనే బురిడీ కొట్టించాడు. పోలీసులను మట్టుబెడతానని సవాల్ విసిరాడు. చివరకు పోలీసుల చేతుల్లోనే హతమయ్యాడు. శుక్రవారం సెంటిమెంట్‌తో దాడులు.. హైదరాబాద్‌లోని ఓల్డ్‌మలక్‌పేటకు చెందిన వికార్ చిన్నతనంలోనే వివాదాస్పద దర్స్గా జిహాదీ-ఎ-షహదత్(డీజేఎస్) సంస్థలో చేరి విపరీత భావాలను పెంపొందించుకున్నాడు. విద్యార్థి దశలోనే నిషేధిత ఇస్లామిక్ స్టూడెంట్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా(సిమి)తో అనుబంధం పెంచుకున్నాడు. డీజేఎస్, సిమీ కార్యకలాపాల్లో పాల్గొంటూ నరనరాన విద్వేషాన్ని నింపుకొన్నాడు. వివిధ రాష్ట్రాల్లో క్రియాశీలంగా పనిచేస్తున్న లష్కరే తొయిబా(ఎల్ఈటీ), ఇండియన్ ముజాహిదీన్(ఐఎం), హర్కతుల్ జీహాద్ ఇస్లాం(హుజీ) సభ్యులతో సైతం పరిచయాలు పెంచుకున్నాడు. 2007 మే 18న మక్కా మసీదులో శుక్రవారం ప్రార్థన సమయంలో జరిగిన బాంబు పేలుళ్లు, అనంతరం పోలీసులు జరిపిన కాల్పులు వికార్లో ప్రతీకారేచ్ఛను పెంచాయి. అప్పటి నుంచి ఏటా మే 18న పోలీసులపై దాడులు చేయడం ప్రారంభించాడు. మక్కా పేలుళ్ల తర్వాత 2007 జూలైలో అజ్ఞాతంలోకి వెళ్లిన వికార్.. నగరానికి చెందిన డాక్టర్ హనీఫ్ సహాయంతో అహ్మదాబాద్‌కు మకాం మార్చాడు. పోలీసులపై ప్రతీకారం తీర్చుకోడానికి తెహ్రిక్ గల్బా-ఏ-ఇస్లాం(టీజేఐ) అనే పేరుతో సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తాజా ఎన్కౌంటర్లో హతమైన నలుగురు ఉగ్రవాదులు సైతం ఈ సంస్థ సభ్యులే. సంస్థ కార్యాకలాపాలకు కావాల్సిన డబ్బు కోసం ఈ ముఠాతో కలిసి దోపిడీలకు పాల్పడేవాడు. ఇదే క్రమంలో అహ్మాదాబాద్‌లోని ఓ బ్యాంకు దోపిడీ సమయంలో అడ్డువచ్చిన కానిస్టేబుల్ వినయ్‌కుమార్‌ను హతమార్చాడు. వికార్ పెట్రేగిపోతుండడంతో నిఘా పెట్టిన కౌంటర్ ఇంటెలిజెన్స్‌కు గతంలో ఓసారి చిక్కినట్లు చిక్కి తప్పించుకున్నాడు. 2008 డిసెంబర్ 3న సంతోష్‌నగర్ వద్దఅతడిని కానిస్టేబుళ్లు గురురామరాజు, జాఫర్ అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా వారిపై కాల్పులు జరిపి తప్పించుకున్నాడు. మక్కా పేలుళ్లకు సరిగ్గా రెండేళ్లు గడిచిన సందర్భంగా 2009 మే 18న ఫలక్‌నుమా పోలీసు స్టేషన్ సమీపంలో పోలీస్ పికెట్‌పై కాల్పులు జరిపి బాలస్వామి అనే హోంగార్డును హతమార్చాడు. సరిగ్గా ఏడాది తర్వాత 2010 మే 14న పాతబస్తీలోని ఖిల్వత్ న్యూ రోడ్డు వద్ద పోలీసు పికెట్‌పై కాల్పులు జరిపి రమేశ్ అనే కానిస్టేబుల్‌ను హతమార్చాడు. పోలీసులపై దాడి తర్వాత ఘటనా స్థలంలో టీజేఐ పేరుతో కరపత్రాలు, సీడీలు వదిలేవాడు. శుక్రవారమే దాడులు జరిపేవాడు. ‘ఈ కాల్పులు జరిపింది మేమే. మక్కా మసీదు పేలుళ్ల అనంతరం కాల్పులకు ఆదేశించిన అధికారి, కాల్పులు జరిపిన పోలీసులకు మరణ శిక్ష విధించాలి. అప్పటి వరకు ప్రతీకారం తీర్చుకుంటూనే ఉంటాం. భూమ్మీద అల్లా రాజ్యం స్థాపించడమే టీజేఐ ఉద్దేశం’ అని కరపత్రాల్లో పోలీసులకే హెచ్చరికలు జారీ చేశాడు. ధ్వంస రచనలో దిట్ట.. వ్యూహరచనలో దిట్టగా పేరొందిన వకార్ సిమి, డీజేఎస్ బలోపేతం కోసం ఓ యాక్షన్ ప్లాన్‌ను రూపొందించాడు. బాంబు పేలుళ్లు, దాడులు జరిపి పోలీసులకు చిక్కకుండా తప్పించుకోడానికి అమలు చేయాల్సిన వ్యూహాలను అందులో పొందుపర్చాడు. ఈ యాక్షన్ ప్లాన్ హార్డ్ డిస్క్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో వివరాలు బయటపడ్డాయి. అజ్ఞాతంలో ఉన్న సమయంలో పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు పాటించాల్సిన జాగ్రత్తలపై ఇజ్రాయిల్ నిఘా సంస్థ ‘మొస్సాద్’ వెబ్సైట్ నుంచి కావాల్సిన సమాచారాన్ని సేకరించాడు. అనేక పేర్లతో సంచరించేవాడు. పోలీస్ రికార్డుల్లో వికారుద్దీన్ అహ్మద్, అలీఖాన్, ఫరీద్, బాబా, యాసీన్, నసీర్, అమీర్‌రాజా, రిజ్వాన్ వంటి పేర్లు నమోదయ్యాయి. సెల్‌ఫోన్ కూడా వాడే వాడు కాదు. ఎవరూ గుర్తు పట్టకుండా తరుచుగా ఆహార్యాన్ని మార్చుకునేవాడు. ఈ క్రమంలో అహ్మదాబాద్‌లో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని ముఖాన్నే మార్చుకున్నాడు. ఒకానొక దశలో వికార్ ఎలా ఉంటాడని పోలీసులకు సైతం అంతు చిక్కని ప్రశ్నగా మారింది. తరుచుగా నివాసం మారుస్తూ మూడేళ్లకుపైగా నగర పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. ఈ క్రమంలోనే 2010లో సికింద్రాబాద్‌లోని మహమ్మద్‌గూడలో ఓ అద్దె ఇంటికి మకాం మార్చాడు. అదే ఏడాది జూలై 14న పోలీసులకు వికార్, అతడి ముఠా సభ్యులు చిక్కారు. జైలులోనూ ఉగ్ర పోకడలే.. అరెస్టయిన తర్వాత వికారుద్దీన్ ముఠాను చర్లపల్లి జైలుకు తరలించారు. ఉగ్ర పోకడలు మానని వికారుద్దీన్ జైలు అధికారులు, సిబ్బందిని బెదిరిస్తూ వారిపై దాడులకు పాల్పడ్డాడు. జైలు భోజనంలో బిర్యానీ పెట్టాలని గొడవపడేవాడు. ఓసారి అతడి సెల్ తనిఖీకి వెళ్లిన సిబ్బంది హనుమాన్ ప్రసాద్, శ్రీనివాస్‌రెడ్డి, గోపిరెడ్డిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. ఈ ఘటన జరిగిన వారం తర్వాత 2011 ఫిబ్రవరి 16న వికార్ ముఠాను వరంగల్ సెంట్రల్ జైల్‌కు తరలించారు. మహ్మద్ జకీర్(యూటీ-1002): హైదరాబాద్ వారాసిగూడలో నివసించే మహ్మద్ జకీర్‌పై పలు సెక్షన్లు, ఆయుధాల చట్టాల కింద కేసులున్నాయి. హైదరాబాద్‌లోని ఏడో అదనపు సెషన్స్ జడ్జి, రెండో అదనపు మెట్రో పాలిటన్ సెషన్స్ కోర్టులో విచారణ జరుగుతోంది. ఇజార్‌ఖాన్ (యూటీ-1066): ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలోని అమీనాబాద్ ప్రాంత నివాసి. వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఐపీసీ, అన్ ఫెయిత్ఫుల్ యాక్టివిటీస్ (ప్రివెన్షన్) యాక్ట్-1967, ఆయుధాల చట్టాల ప్రకారం ఇతనిపై కేసులున్నాయి. వీటికి సంబంధించి హైదరాబాద్ రెండు, ఏడు, పదహారో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టుల్లో విచారణకు హాజరవుతున్నాడు. మహ్మద్ అంజద్(32): రియాసత్‌నగర్‌లోని మోయిన్‌బాగ్‌లో నివాసముండేవాడు. ఇంటర్ చదువుకున్నాడు. ముగ్గురు అన్నదమ్ముల్లో ఇంటికి పెద్దవాడు. ఐ.ఎస్.సదన్ వద్ద జరిగిన కాల్పుల సమయంలో వికారుద్దీన్ గ్యాంగ్‌లో ఉన్నందుకు అరెస్టయ్యాడు. ఐదేళ్ల నుంచి కుటుంబ సభ్యులతో సంబంధాలు తెంచుకున్నాడు. -
ఎక్కడిదీ సిమి?
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లాలో ఇద్దరు సిమి ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌తో ఈ సంస్థ కార్యకలాపాలు మరోసారి సర్వత్రా చర్చనీయమయ్యాయి. స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఎంఐ) పేరుతో ఇస్లాం మతవ్యాప్తే లక్ష్యంగా కొందరు యువకులు ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ కేంద్రంగా 1977లో ఈ సంస్థను నెలకొల్పారు. భారత్‌ను ఇస్లాం దేశంగా మార్చాలనే సంకల్పంతో దేశంపైనే జిహాద్(పవిత్ర యుద్ధం) ప్రకటించింది సిమి! హింసాత్మక కార్యకలాపాల ద్వారా లక్ష్యసాధనకు ఉగ్రవాదాన్నే మార్గంగా ఎంచుకుంది. యూపీకి చెందిన ప్రొఫెసర్ మహమ్మద్ అహ్మదుల్లా సిద్ధిఖీ దీని వ్యవస్థాపకుడు. మొదట్లో జమాతే ఇస్లామే హింద్ విద్యార్థి విభాగంగా ఆవిర్భవించిన సిమి.. 1981లో ఆ సంస్థతో సంబంధాలు తెంచుకుంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నేరం కింద 14 ఏళ్ల కిందటే ఈ సంస్థను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. దేశంలో పలు విధ్వంసక చర్యల్లో సిమి పేరు వినిపించింది. అహ్మదాబాద్‌లో వరుస బాంబు పేలుళ్లు, కాన్పూరు మత ఘర్షణల్లో సిమి ఉగ్రవాదుల ప్రమేయం బట్టబయలైంది. 2001లో ఈ సంస్థను నిషేధించాక మధ్యప్రదేశ్ నుంచి గుట్టుగా తమ కార్యకలాపాలను విస్తరించింది. నిషేధం తర్వాత ఆ రాష్ట్రంలోనే పోలీసులు దాదాపు 180 మంది మిలిటెంట్లను అరెస్టు చేయడమే సిమి విస్తరించిన తీరుకు అద్దం పడుతోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్‌లోని పలు ఉగ్రవాద సంస్థలతో ఈ సంస్థకు సంబంధాలున్నాయి. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐతోనూ లింకులున్నట్లు పోలీసులు తేల్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ సిమి చాపకింద నీరులా విస్తరించింది. సిమి తమ కార్యకలాపాలకు అవసరమయ్యే నిధుల సమీకరణకు ‘మాల్ ఏ ఘనీమత్’ పేరుతో యాక్షన్ టీమ్‌ను ఏర్పాటు చేసుకుంది. నల్గొండ జిల్లాలో చనిపోయిన ఉగ్రవాదులు ఈ టీమ్‌లోని సభ్యులే. అందుకే వరుసగా బ్యాంకు దోపిడీ, నగల దోపిడీలపైనే ఈ ముఠా దృష్టి సారించింది. -
బెజవాడ ఉగ్రజాడ
నగరం ఉగ్రవాదుల షెల్టర్ జోన్‌గా మారిందా..? అవుననే అంటున్న నల్గొండ ఎన్కౌంటర్ భయపెడుతున్న గత అనుభవాలు పోలీసులు అప్రమత్తం నగరం ఉగ్రవాద కార్యకలాపాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందా..? అంతర్జాతీయ తీవ్రవాద సంస్థలకు చెందిన ముఠాలు నగరంలోనే ఆశ్రయం పొందుతున్నాయా..? తాజా పరిణామాలను పరిశీలిస్తే నిజమే అనిపిస్తుంది. నల్గొండ జిల్లాలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందిన ఇద్దరు సిమీ సభ్యులు విజయవాడ వైపు వచ్చే బస్సు ఎక్కినట్టు సమాచారం రావడం భయాందోళన కలిగించే అంశం. ఈ నేపథ్యంలో నగరంలో ఉగ్రవాదుల కదలికలపై గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు అప్రమత్తమయ్యారు. విజయవాడ సిటీ : నల్గొండ జిల్లాలో శనివారం జరిగిన సిమీ (స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా) సభ్యుల ఎన్‌కౌంటర్‌తో నగర పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో నగరంలో గతంలో ఇస్లామిక్ ఉగ్రవాదులు ఆశ్రయం పొందిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు భద్రతను పటిష్టం చేశారు. నల్గొండ జిల్లా మోత్కూరు మండలం జానకి పురం శివారులో శనివారం పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో మృతిచెందిన అస్లాం, జకీర్‌లు విజయవాడ వైపు వచ్చే బస్సు ఎక్కినట్టు వెలుగుచూడటం ఈ అప్రమత్తతకు కారణంగా తెలుస్తోంది. బ్యాంకులు సహా పెద్దపెద్ద సంస్థలను కొల్లగొట్టగా వచ్చిన సొమ్ముతో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే ముఠా సభ్యులను మధ్యప్రదేశ్ పోలీసులు గతంలో అరెస్టు చేశారు. ఖాండ్వా జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న ఈ ముఠాలోని ఆరుగురు తప్పించుకు తిరుగుతున్నారు. నల్గొండ ఎన్కౌంటర్లో చనిపోయిన అస్లాం, జకీర్ వారేనని పోలీసులు చెబుతున్నారు. గత అనుభవాలు భయానకం నగరం ఉగ్రవాదులకు షెల్టర్ జోన్‌గా మారిందనడంలో ఎటువంటి సందేహం లేదు. గత అనుభవాలను ఒకసారి పరిశీలిస్తే.. వేర్వేరు కేసుల్లో నిందితులైన ఇస్లామిక్ ఉగ్రవాదులు నగరంలో గతంలో ఆశ్రయం తీసుకున్నారు. కోయంబత్తూరు బాంబు పేలుళ్ల కేసులో నిందితులైన ఆల్-ఉమా ఉగ్రవాదులు భవానీపురం హౌసింగ్ బోర్డు కాలనీలో కొద్ది రోజులు నివాసం ఉన్నారు. వీరిక్కడ ఆశ్రయం పొందేందుకు కొందరు స్థానికులే సహకరించారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. కోయంబత్తూరు పోలీసులు వీరిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా, పరారై రాజమండ్రిలో పట్టుబడ్డారు. కోయంబత్తూరు సిట్ పోలీసులకు చిక్కకుండా వీరు పరారవ్వడం వెనుక కొందరు పోలీసు అధికారుల హస్తం ఉందని కూడా అప్పట్లో విమర్శలు వచ్చాయి. కరీంనగర్ జిల్లా జగిత్యాల ఎన్కౌంటర్లో మృతిచెందిన ఐఎస్ఐ ఉగ్రవాది అజంఘోరి కొద్దిరోజులు మన నగరంలోనే ఆశ్రయం తీసుకున్నట్టు వెలుగుచూసింది. ఎన్కౌంటర్ తర్వాత అక్కడి పోలీసులు స్వాధీనం చేసుకున్న అజంఘోరి డైరీ ఆధారంగానే నగరానికి చెందిన కోటంరాజు లక్ష్మీనారాయణ అలియాస్ పంతులు హత్య జరిగింది. పంతులు ప్రత్యర్థులు ఐఎస్ఐ ఉగ్రవాది అజంఘోరికి ఇక్కడ పది రోజులు ఆశ్రయం ఇచ్చారు. నూజివీడు కేంద్రంగా దేశంలోని ప్రార్థనా మందిరాల్లో బాంబు పేలుళ్లకు పాల్పడిన దీన్దార్-అంజుమన్ సభ్యులు కూడా నగరంలో ఉన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే వీరు కృష్ణలంక రామాలయంలో బాంబులు పెట్టి పేలుళ్లకు కారణమయ్యారు. పోలీసులు ఈ సంస్థ సభ్యులను గుర్తించి అరెస్టు చేశారు. పోలీసులు అలర్ట్ పై ఘటనలన్నింటినీ పరిశీలించిన నగర పోలీస్ యంత్రాంగం ఉగ్రవాదుల విషయమై అప్రమత్తమైంది. కొందరు స్థానిక యువకులకు సిమీ సహా ఇతర నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే సమాచారం మేరకు నిఘాను పటిష్టం చేశారు. గతంలో వచ్చిన ఆరోపణలపై కొందరు యువకులను అదుపులోకి తీసుకుని విచారణ కూడా జరిపారు. రాజధాని ప్రాంతం కావడంతో ఉగ్రవాదులు దృష్టిసారించేందుకు అవకాశం ఉందనే నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అనుమానిత ప్రాంతాల్లో రహస్య సోదాలు జరుపు తున్నారు. ఆయా ప్రాంతాల్లోని అనుమానిత వ్యక్తుల కదలికలపై దృష్టిసారించారు.