వికార్ 'టెర్రర్' | vikaruddin childhood fantasies, feelings | Sakshi
Sakshi News home page

వికార్ 'టెర్రర్'

Published Wed, Apr 8 2015 2:01 AM | Last Updated on Sat, Sep 2 2017 11:59 PM

వికార్ 'టెర్రర్'

వికార్ 'టెర్రర్'

బయట ఉన్నా.. జైలులో ఉన్నా ఉగ్ర పోకడలే 
చిన్నతనం నుంచే విపరీత భావాలు, విద్వేషభరితం

 
డీజేఎస్‌లో శిక్షణ.. ఉగ్రవాదంవైపు అడుగులు

ఆయుధాలు, పేలుడు పదార్థాల
తయారీలో నైపుణ్యం.. సిమి, ఐఎం, ఐఎస్‌ఐ,
హుజీ, ఎల్‌ఈటీతో సంబంధాలు
మక్కా పేలుళ్ల తర్వాత  టీజీఐ పేరుతో
సొంత సైన్యం.. పోలీసులపై ప్రతీకార దాడులు, ముగ్గురు పోలీసుల హత్య

 
హైదరాబాద్: వికార్ అహ్మద్ అలియాస్ వికారుద్దీన్ హైదరాబాద్ నగరంలో ‘టై’ పుట్టించాడు. బీకాం(కంప్యూటర్స్) మధ్యలోనే ఆపేసిన వికార్.. పవిత్ర యుద్ధం పేరిట ఆయుధాలు, పేలుడు పదార్థాల తయారీలో నైపుణ్యం సాధించాడు. ధ్వంస రచనలో దిట్టగా పేరొందాడు. ప్లాస్టిక్ సర్జరీతో ముఖాన్నే మార్చుకున్నాడు. మారు వేషాలతో తిరుగుతూ పోలీసులనే బురిడీ కొట్టించాడు. పోలీసులను మట్టుబెడతానని సవాల్ విసిరాడు. చివరకు పోలీసుల చేతుల్లోనే హతమయ్యాడు.

శుక్రవారం సెంటిమెంట్‌తో దాడులు..

హైదరాబాద్‌లోని ఓల్డ్‌మలక్‌పేటకు చెందిన వికార్ చిన్నతనంలోనే వివాదాస్పద దర్స్‌గా జిహాదీ-ఎ-షహదత్(డీజేఎస్) సంస్థలో చేరి విపరీత భావాలను పెంపొందించుకున్నాడు. విద్యార్థి దశలోనే నిషేధిత ఇస్లామిక్ స్టూడెంట్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా(సిమి)తో అనుబంధం పెంచుకున్నాడు. డీజేఎస్, సిమీ కార్యకలాపాల్లో పాల్గొంటూ నరనరాన విద్వేషాన్ని నింపుకొన్నాడు. వివిధ రాష్ట్రాల్లో క్రియాశీలంగా పనిచేస్తున్న లష్కరే తొయిబా(ఎల్‌ఈటీ), ఇండియన్ ముజాహిదీన్(ఐఎం), హర్కతుల్ జీహాద్ ఇస్లాం(హుజీ) సభ్యులతో సైతం పరిచయాలు పెంచుకున్నాడు. 2007 మే 18న మక్కా మసీదులో శుక్రవారం ప్రార్థన సమయంలో జరిగిన బాంబు పేలుళ్లు, అనంతరం పోలీసులు జరిపిన కాల్పులు వికార్‌లో ప్రతీకారేచ్ఛను పెంచాయి. అప్పటి నుంచి ఏటా మే 18న పోలీసులపై దాడులు చేయడం ప్రారంభించాడు. మక్కా పేలుళ్ల తర్వాత 2007 జూలైలో అజ్ఞాతంలోకి వెళ్లిన వికార్.. నగరానికి చెందిన డాక్టర్ హనీఫ్ సహాయంతో అహ్మదాబాద్‌కు మకాం మార్చాడు. పోలీసులపై ప్రతీకారం తీర్చుకోడానికి తెహ్రిక్ గల్బా-ఏ-ఇస్లాం(టీజేఐ) అనే పేరుతో సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తాజా ఎన్‌కౌంటర్‌లో హతమైన నలుగురు ఉగ్రవాదులు సైతం ఈ సంస్థ సభ్యులే. సంస్థ కార్యాకలాపాలకు కావాల్సిన డబ్బు కోసం ఈ ముఠాతో కలిసి దోపిడీలకు పాల్పడేవాడు.

ఇదే క్రమంలో అహ్మాదాబాద్‌లోని ఓ బ్యాంకు దోపిడీ సమయంలో అడ్డువచ్చిన కానిస్టేబుల్ వినయ్‌కుమార్‌ను హతమార్చాడు. వికార్ పెట్రేగిపోతుండడంతో నిఘా పెట్టిన కౌంటర్ ఇంటెలిజెన్స్‌కు గతంలో ఓసారి చిక్కినట్లు చిక్కి తప్పించుకున్నాడు. 2008 డిసెంబర్ 3న సంతోష్‌నగర్ వద్దఅతడిని కానిస్టేబుళ్లు గురురామరాజు, జాఫర్ అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా వారిపై కాల్పులు జరిపి తప్పించుకున్నాడు. మక్కా పేలుళ్లకు సరిగ్గా రెండేళ్లు గడిచిన సందర్భంగా 2009 మే 18న ఫలక్‌నుమా పోలీసు స్టేషన్ సమీపంలో పోలీస్ పికెట్‌పై కాల్పులు జరిపి బాలస్వామి అనే హోంగార్డును హతమార్చాడు. సరిగ్గా ఏడాది తర్వాత 2010 మే 14న పాతబస్తీలోని ఖిల్వత్ న్యూ రోడ్డు వద్ద పోలీసు పికెట్‌పై కాల్పులు జరిపి రమేశ్ అనే కానిస్టేబుల్‌ను హతమార్చాడు. పోలీసులపై దాడి తర్వాత ఘటనా స్థలంలో టీజేఐ పేరుతో కరపత్రాలు, సీడీలు వదిలేవాడు. శుక్రవారమే దాడులు జరిపేవాడు. ‘ఈ కాల్పులు జరిపింది మేమే. మక్కా మసీదు పేలుళ్ల అనంతరం కాల్పులకు ఆదేశించిన అధికారి, కాల్పులు జరిపిన పోలీసులకు మరణ శిక్ష విధించాలి. అప్పటి వరకు ప్రతీకారం తీర్చుకుంటూనే ఉంటాం. భూమ్మీద అల్లా రాజ్యం స్థాపించడమే టీజేఐ ఉద్దేశం’ అని కరపత్రాల్లో పోలీసులకే హెచ్చరికలు జారీ చేశాడు.
 
ధ్వంస రచనలో దిట్ట..

వ్యూహరచనలో దిట్టగా పేరొందిన వకార్ సిమి, డీజేఎస్ బలోపేతం కోసం ఓ యాక్షన్ ప్లాన్‌ను రూపొందించాడు. బాంబు పేలుళ్లు, దాడులు జరిపి పోలీసులకు చిక్కకుండా తప్పించుకోడానికి అమలు చేయాల్సిన వ్యూహాలను అందులో పొందుపర్చాడు. ఈ యాక్షన్ ప్లాన్ హార్డ్ డిస్క్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో వివరాలు బయటపడ్డాయి. అజ్ఞాతంలో ఉన్న సమయంలో పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు పాటించాల్సిన జాగ్రత్తలపై ఇజ్రాయిల్ నిఘా సంస్థ ‘మొస్సాద్’ వెబ్‌సైట్ నుంచి కావాల్సిన సమాచారాన్ని సేకరించాడు. అనేక పేర్లతో సంచరించేవాడు. పోలీస్ రికార్డుల్లో వికారుద్దీన్ అహ్మద్, అలీఖాన్, ఫరీద్, బాబా, యాసీన్, నసీర్, అమీర్‌రాజా, రిజ్వాన్ వంటి పేర్లు నమోదయ్యాయి. సెల్‌ఫోన్ కూడా వాడే వాడు కాదు. ఎవరూ గుర్తు పట్టకుండా తరుచుగా ఆహార్యాన్ని మార్చుకునేవాడు. ఈ క్రమంలో అహ్మదాబాద్‌లో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని ముఖాన్నే మార్చుకున్నాడు. ఒకానొక దశలో వికార్ ఎలా ఉంటాడని పోలీసులకు సైతం అంతు చిక్కని ప్రశ్నగా మారింది. తరుచుగా నివాసం మారుస్తూ మూడేళ్లకుపైగా నగర పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. ఈ క్రమంలోనే 2010లో సికింద్రాబాద్‌లోని మహమ్మద్‌గూడలో ఓ అద్దె ఇంటికి మకాం మార్చాడు. అదే ఏడాది జూలై 14న పోలీసులకు వికార్, అతడి ముఠా సభ్యులు చిక్కారు.
 
జైలులోనూ ఉగ్ర పోకడలే..
 
అరెస్టయిన తర్వాత వికారుద్దీన్ ముఠాను చర్లపల్లి జైలుకు తరలించారు. ఉగ్ర పోకడలు మానని వికారుద్దీన్ జైలు అధికారులు, సిబ్బందిని బెదిరిస్తూ వారిపై దాడులకు పాల్పడ్డాడు. జైలు భోజనంలో బిర్యానీ పెట్టాలని గొడవపడేవాడు. ఓసారి అతడి సెల్ తనిఖీకి వెళ్లిన సిబ్బంది హనుమాన్ ప్రసాద్, శ్రీనివాస్‌రెడ్డి, గోపిరెడ్డిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. ఈ ఘటన జరిగిన వారం తర్వాత 2011 ఫిబ్రవరి 16న వికార్ ముఠాను వరంగల్ సెంట్రల్ జైల్‌కు తరలించారు.
 
మహ్మద్ జకీర్(యూటీ-1002): హైదరాబాద్ వారాసిగూడలో నివసించే మహ్మద్ జకీర్‌పై పలు సెక్షన్లు, ఆయుధాల చట్టాల కింద కేసులున్నాయి. హైదరాబాద్‌లోని ఏడో అదనపు సెషన్స్ జడ్జి, రెండో అదనపు మెట్రో పాలిటన్ సెషన్స్ కోర్టులో విచారణ జరుగుతోంది.
 ఇజార్‌ఖాన్ (యూటీ-1066): ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలోని అమీనాబాద్ ప్రాంత నివాసి. వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఐపీసీ, అన్ ఫెయిత్‌ఫుల్ యాక్టివిటీస్ (ప్రివెన్షన్) యాక్ట్-1967, ఆయుధాల చట్టాల ప్రకారం ఇతనిపై కేసులున్నాయి. వీటికి సంబంధించి హైదరాబాద్ రెండు, ఏడు, పదహారో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టుల్లో విచారణకు హాజరవుతున్నాడు.  

మహ్మద్ అంజద్(32): రియాసత్‌నగర్‌లోని మోయిన్‌బాగ్‌లో నివాసముండేవాడు. ఇంటర్ చదువుకున్నాడు. ముగ్గురు అన్నదమ్ముల్లో ఇంటికి పెద్దవాడు. ఐ.ఎస్.సదన్ వద్ద జరిగిన కాల్పుల సమయంలో వికారుద్దీన్ గ్యాంగ్‌లో ఉన్నందుకు అరెస్టయ్యాడు. ఐదేళ్ల నుంచి కుటుంబ సభ్యులతో సంబంధాలు తెంచుకున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement