‘సిమి’ ఉగ్రవాదులపై రివార్డు
సాక్షి, హైదరాబాద్: స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) ఉగ్రవాదులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) రివార్డు ప్రకటించింది. గతేడాది ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నూర్‌లో జరిగిన పేలుడుకు సంబంధించి మొత్తం నలుగురు సిమి ఉగ్రవాదులపై శుక్రవారం రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది. వీరి ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాల్సిందిగా కోరింది. రాష్ట్రంలోని చొప్పదండిలోని బ్యాంకు దోపిడీ, చెన్నై రైల్వేస్టేషన్, బెంగళూరు చర్చి స్ట్రీట్ బ్లాస్ట్‌లతో వీరు నిందితులు.
మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు నుంచి అబు ఫైజల్, ఎజాజుద్దీన్ మహ్మద్, జాకీర్ హుస్సేన్, మహబూబ్, అస్లం అయూబ్ ఖాన్, అంజద్ రంజాన్ ఖాన్, అబిద్‌లు 2013 అక్టోబర్‌లో పారిపోయారు. అబు ఫైజల్, అబిద్‌లు పోలీసులకు చిక్కారు. మిగిలిన వారు సూర్యాపేటలో పోలీసులపై కాల్పులకు తెగబడి అందులో ఇద్దరు ఉగ్రవాదులు మరణించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో పోలీసుల ఎదురు కాల్పుల్లో అర్వపల్లిలో ఎజాజ్, అస్లం మరణించగా మిగిలిన ముగ్గురి కోసం పోలీసులు వెదుకుతున్నారు. మహ్మద్ సాలఖ్, మహబూబ్ తల్లి నజ్మాజీకి వీరితో సంబంధాలున్నాయని అధికారులు గుర్తించారు.
కాగా, మహారాష్ట్రలోని పుణేలో జరిగిన బాంబు పేలుడుతో పాటు మరికొన్ని కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న మహబూబ్, అంజాద్, జాకీర్‌పై యాంటీ టైస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు గత నెలలో రూ.10 లక్షల చొప్పున రివార్డు ప్రకటించారు. తాజాగా ఎన్‌ఐఏ ప్రకటించిన మొత్తంతో కలిపి వీరిపై ఉన్న రివార్డు మొత్తం రూ.70 లక్షలకు చేరింది. దేశ వ్యాప్తంగా ఉగ్ర పంజా విసురుతున్న వీరు ఏపీ, తెలంగాణలో ఆశ్రయం పొందే వీలు లేకపోలేదని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. పాత వస్త్రాలు అమ్మే వారిగా వీరు చెలామణీ అవుతారని పేర్కొన్నాయి.