బెజవాడ ఉగ్రజాడ | city turned into terrorist Shelter zone ? | Sakshi
Sakshi News home page

బెజవాడ ఉగ్రజాడ

Published Sun, Apr 5 2015 1:09 AM | Last Updated on Tue, Oct 16 2018 8:50 PM

బెజవాడ ఉగ్రజాడ - Sakshi

బెజవాడ ఉగ్రజాడ

నగరం ఉగ్రవాదుల షెల్టర్ జోన్‌గా మారిందా..?
అవుననే అంటున్న నల్గొండ ఎన్‌కౌంటర్
భయపెడుతున్న గత అనుభవాలు  
పోలీసులు అప్రమత్తం
 

 నగరం ఉగ్రవాద కార్యకలాపాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందా..? అంతర్జాతీయ తీవ్రవాద సంస్థలకు చెందిన ముఠాలు నగరంలోనే ఆశ్రయం పొందుతున్నాయా..? తాజా పరిణామాలను పరిశీలిస్తే నిజమే అనిపిస్తుంది. నల్గొండ జిల్లాలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన ఇద్దరు సిమీ సభ్యులు విజయవాడ వైపు వచ్చే బస్సు ఎక్కినట్టు సమాచారం రావడం భయాందోళన కలిగించే అంశం. ఈ నేపథ్యంలో నగరంలో ఉగ్రవాదుల  కదలికలపై గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు అప్రమత్తమయ్యారు.
 
విజయవాడ సిటీ : నల్గొండ జిల్లాలో శనివారం జరిగిన సిమీ (స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా) సభ్యుల ఎన్‌కౌంటర్‌తో నగర పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో నగరంలో గతంలో ఇస్లామిక్ ఉగ్రవాదులు ఆశ్రయం పొందిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు భద్రతను పటిష్టం చేశారు. నల్గొండ జిల్లా మోత్కూరు మండలం జానకి       పురం శివారులో శనివారం పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన అస్లాం, జకీర్‌లు విజయవాడ వైపు వచ్చే బస్సు ఎక్కినట్టు వెలుగుచూడటం ఈ అప్రమత్తతకు కారణంగా తెలుస్తోంది. బ్యాంకులు సహా పెద్దపెద్ద సంస్థలను కొల్లగొట్టగా  వచ్చిన సొమ్ముతో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే ముఠా సభ్యులను మధ్యప్రదేశ్ పోలీసులు గతంలో అరెస్టు చేశారు. ఖాండ్వా జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న ఈ ముఠాలోని ఆరుగురు తప్పించుకు తిరుగుతున్నారు. నల్గొండ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన అస్లాం, జకీర్ వారేనని పోలీసులు చెబుతున్నారు.

గత అనుభవాలు భయానకం

నగరం ఉగ్రవాదులకు షెల్టర్ జోన్‌గా మారిందనడంలో ఎటువంటి సందేహం లేదు. గత అనుభవాలను ఒకసారి పరిశీలిస్తే.. వేర్వేరు కేసుల్లో నిందితులైన ఇస్లామిక్ ఉగ్రవాదులు నగరంలో గతంలో ఆశ్రయం తీసుకున్నారు. కోయంబత్తూరు బాంబు పేలుళ్ల కేసులో నిందితులైన ఆల్-ఉమా ఉగ్రవాదులు భవానీపురం హౌసింగ్ బోర్డు కాలనీలో కొద్ది రోజులు నివాసం ఉన్నారు. వీరిక్కడ ఆశ్రయం పొందేందుకు కొందరు స్థానికులే సహకరించారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. కోయంబత్తూరు పోలీసులు వీరిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా, పరారై రాజమండ్రిలో పట్టుబడ్డారు. కోయంబత్తూరు సిట్ పోలీసులకు చిక్కకుండా వీరు పరారవ్వడం వెనుక కొందరు పోలీసు అధికారుల హస్తం ఉందని కూడా అప్పట్లో విమర్శలు వచ్చాయి. కరీంనగర్ జిల్లా జగిత్యాల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన ఐఎస్‌ఐ ఉగ్రవాది అజంఘోరి కొద్దిరోజులు మన నగరంలోనే ఆశ్రయం తీసుకున్నట్టు వెలుగుచూసింది. ఎన్‌కౌంటర్ తర్వాత అక్కడి పోలీసులు స్వాధీనం చేసుకున్న అజంఘోరి డైరీ ఆధారంగానే నగరానికి చెందిన కోటంరాజు లక్ష్మీనారాయణ అలియాస్ పంతులు హత్య జరిగింది. పంతులు ప్రత్యర్థులు ఐఎస్‌ఐ ఉగ్రవాది అజంఘోరికి ఇక్కడ పది రోజులు ఆశ్రయం ఇచ్చారు. నూజివీడు కేంద్రంగా దేశంలోని ప్రార్థనా మందిరాల్లో బాంబు పేలుళ్లకు పాల్పడిన దీన్‌దార్-అంజుమన్ సభ్యులు కూడా నగరంలో ఉన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే వీరు కృష్ణలంక రామాలయంలో బాంబులు పెట్టి పేలుళ్లకు కారణమయ్యారు. పోలీసులు ఈ సంస్థ సభ్యులను గుర్తించి అరెస్టు చేశారు.
 
పోలీసులు అలర్ట్

పై ఘటనలన్నింటినీ పరిశీలించిన నగర పోలీస్ యంత్రాంగం ఉగ్రవాదుల విషయమై అప్రమత్తమైంది. కొందరు స్థానిక యువకులకు సిమీ సహా ఇతర నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే సమాచారం మేరకు నిఘాను పటిష్టం చేశారు. గతంలో వచ్చిన ఆరోపణలపై కొందరు యువకులను అదుపులోకి తీసుకుని విచారణ కూడా జరిపారు. రాజధాని ప్రాంతం కావడంతో ఉగ్రవాదులు దృష్టిసారించేందుకు అవకాశం ఉందనే నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అనుమానిత ప్రాంతాల్లో రహస్య సోదాలు జరుపు తున్నారు. ఆయా ప్రాంతాల్లోని అనుమానిత వ్యక్తుల కదలికలపై దృష్టిసారించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement