
మూడోసారి చైర్మన్‌గా నియమితులైన కరణం ఉమామహేశ్వర్‌రావు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ పట్టణ వాసి కరణం ఉమామహేశ్వర్ రావుకి కేంద్ర విద్యా శాఖ కీలక బాధ్యతలు అప్పగించింది. జాతీయ స్థాయి విద్యా సంస్థలైన ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీ, జీఎఫ్‌టీఐ, ఇతర విద్యా సంస్థల్లో సీట్ల భర్తీకి సంబంధించిన కీలక బాధ్యతలు నిర్వహించే సెంట్రల్ సీట్ అలకేషన్ బోర్డు (సీశాబ్) చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కాగా, ఆయన ఈ బాధ్యతలు చేపట్టడం వరుసగా మూడోసారి కావడం విశేషం.
నల్లగొండ పట్టణంలోని రామగిరికి చెందిన ఉమామహేశ్వర్‌రావు పదో తరగతి వరకు నల్లగొండలోని సెయింట్ ఆల్ఫోన్సస్ హైస్కూల్‌లో విద్యను అభ్యసించారు. ఇంటర్ హైదరాబాద్‌లోని నృపతుంగ జూనియర్ కళాశాలలో, బీటెక్ కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో చదివారు. బెనారస్ హిందూ యూనివర్సిటీ (ఐఐటీ బెనారస్)లో ఎంటెక్ పూర్తి చేశారు. 1989లో ఖరగ్‌పూర్ ఐఐటీలో పీహెచ్‌డీ పూర్తిచేశారు.
సీశాబ్ ఆధ్వర్యంలోనే సీట్ల భర్తీ
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీ, గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇనిస్టిట్యూషన్స్ (జీఎఫ్‌టీఐ) తదితర విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ముఖ్యంగా ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీ, జీఎఫ్‌టీఐ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో కొనసాగే ఇతర విద్యాసంస్థల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి 6, 7 విడతల్లో సీశాబ్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment