jihad
-
Hizb-ut-Tahrir: హిజ్బ్–ఉత్–తహ్రీర్‌పై కేంద్రం నిషేధం
న్యూఢిల్లీ: జిహాద్, ఉగ్ర కార్యకలాపాలతో ఇస్లామిక్ రాజ్య స్థాపనే లక్ష్యంగా పనిచేస్తున్న హిజ్బ్–ఉత్–తహ్రీర్(హెచ్‌యూటీ)పై నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. 1953లో జెరుసలేంలో ప్రారంభమైన ఈ సంస్థ, దేశంలో దారితప్పిన యువతను చేరదీసి వారిలో ఉగ్ర భావజాలాన్ని నూరిపోస్తోందని కేంద్ర హోం శాఖ గురువారం విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. వివిధ సామాజిక మాధ్యమ వేదికలు, రహస్య యాప్‌లు, ప్రత్యేక సమావేశాల ద్వారా యువతను ఇది గ్రూపులో చేర్చుకుంటోందని తెలిపింది. వారిని జిహాద్, ఉగ్రవాద కార్యకలాపాలవైపు మళ్లించి ప్రజాస్వామ్యయుతంగా నడుస్తున్న ప్రభుత్వాలను కూలదోయడమే లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో హింసాత్మక చర్యలకు పాల్పడిన హిజ్బ్–ఉత్– తహ్రీర్ భద్రతకు ముప్పుగా పరిణమించిందని హోం శాఖ వెల్లడించింది. అందుకే చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం–1967 కింద ఈ సంస్థపై నిషేధం విధిస్తున్నట్లు ఆ నోటిఫికేషన్లో ప్రకటించింది. -
టాప్ లీడర్లను కోల్పోయిన హెజ్బొల్లా.. ఇజ్రాయెల్ సంబరాలు
లెబనాన్‌లో అత్యంత బలంగా ఉన్న హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపునకు ఇజ్రాయెల్ దాడుల్లో కోలుకోలేని దెబ్బ తగిలింది. వారం రోజుల్లోనే ఏడుగురు అగ్రనాయకులను కోల్పోయింది. లెబనాన్ చేష్టలుడిగిపోయింది. మరోవైపు కచ్చితత్వంలో లక్ష్యాలను చేధించిన ఇజ్రాయెల్ అధికారులు తమ నిఘా వ్యవస్థ పనితీరును, సైనిక పాటవాన్ని చూసి సంబరాల్లో మునిగిపోయారు. పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు అలముకున్నాయి. లెబనాన్‌లో బలీయ మిలటరీ, రాజకీయ శక్తిగా ఉన్న హెజ్బొల్లా శరాఘాతాల నుంచి తేరుకోవడానికి ప్రయత్నిస్తోంది. అధినేత హసన్ నస్రల్లా సహా హెజ్బొల్లాను స్థాపించిన 1980 నుంచి కీలక సభ్యులుగా ఉన్న పలువురిని వారం రోజుల్లో కోల్పోయింది. నస్రల్లా మినహా మిగతావారు బయటి ప్రపంచానికి అంతగా పరిచయం లేని వ్యక్తులే అయినప్పటికీ.. హెజ్బొల్లాలో వారి పాత్ర కీలకం. వీరిలో ఎవరేమిటో చూద్దాం.. – సాక్షి, నేషనల్ డెస్క్నబిల్ కౌక్ కౌక్ శనివారం వైమానిక క్షిపణి దాడిలో మరణించారు. హెజ్బొల్లా సెంట్రల్ కౌన్సిల్ ఉప నాయకుడు. హెజ్బొల్లాను స్థాపించిన తొలినాళ్లలో 1980లలో దాంట్లో చేరారు. 1995–2010 మధ్య హెజ్బొల్లా దక్షిణ లెబనాన్ మిలటరీ కమాండర్‌గా పనిచేశారు. మీడియాతో తరచూ మాట్లాడేవారు. మద్దతుదారులను ఉద్దేశించి ఉపన్యసించే వారు. హెజ్బొల్లా మిలిటెంట్ల అంత్యక్రియల సందర్భంగా భావోద్వేగ ప్రసంగాలు చేసేవారు. నస్రల్లాకు వారుసుల్లో ఒకరిగా కౌక్‌ను పరిగణించేవారు. ఇబ్రహీం అకీల్ హెజ్బొల్లా అగ్రశ్రేణి కమాండర్. మెరికల్లాంటి రాడ్వాన్ ఫోర్సెస్‌కు నాయకుడు. రాడ్వాన్ ఫోర్సెస్‌ను తమ సరిహద్దుల్లోంచి వెనక్కినెట్టాలని ఇజ్రాయెల్ చాన్నాళ్లుగా ప్రయత్నిస్తోంది. అత్యున్నత సైనిక మండలి ‘జిహాద్ కౌన్సిల్’లో అకీల్ సభ్యుడు. ఏన్నో ఏళ్లుగా అమెరికా వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నాడు. 1983లో బీరుట్‌లోని అమెరికా రాయబార కార్యాలయంలో పేలుళ్లలో అకీల్ పాత్ర ఉందని అమెరికా హోంశాఖ పేర్కొంది. అమెరికన్లు, జర్మన్లను బందీలుగా పట్టుకోవడంలో ముఖ్య భూమిక పోషించాడని తెలిపింది.హసన్ నస్రల్లా 1992 నుంచి హెజ్బొల్లా నాయకుడిగా ఉన్నారు. ఇజ్రాయెల్‌లో పలు యుద్ధాల్లో హెజ్బొల్లాకు సారథ్యం వహించారు. లెబనాన్‌లో హెజ్బొల్లాను ప్రబల రాజకీయ, సైనికశక్తి తీర్చిదిద్దారు. పశ్చిమాసియాలో పలు ప్రాంతీయ సంఘర్షణల్లో పాలుపంచుకుంటూనే రాజకీయ శక్తి ఎదిగింది. పారామిలటరీ దళంగా రూపుదిద్దుకుంది. 2011లో సిరియా తిరుగుబాటు కాస్తా అంతర్యుద్ధంగా మారింది. సిరియా అధ్యక్షుడు బషర్ అసాద్‌ను అధికారంలో ఉంచడంలో హెజ్బొల్లా కీలకపాత్ర పోషించింది. ఇరాక్, యెమెన్లలోనూ (ఇరాన్ అండదండలున్న) సాయుధ తిరుగుబాటు గ్రూపులు తమ శక్తిసామర్థ్యాలను మెరుగుపర్చుకోవడానికి నస్రల్లా సారథ్యంలోని హెజ్బొల్లా సాయపడింది. లెబానాన్‌లో నస్రల్లాను ఆరాధించేవారు, విరోధించేవారు సమపాళ్లలో ఉంటారు. 2000 సంవత్సరంలో దక్షిణ లెబానాన్‌కు ఇజ్రాయెల్ నుంచి విముక్తి కల్పించిన హీరోగా మద్దతుదారులు నస్రల్లాను కీర్తిస్తారు. గుట్టలుగా ఆయుధాలను పోగేసుకొని.. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శకులు అంటారు. టెహరాన్ ఎజెండాకు అనుగుణంగా హెజ్బొల్లా పనిచేస్తోందని వారి ఆరోపణ. అలీ కరాకీ దక్షిణాది వ్యవహారాలకు బాధ్యుడు. హమాస్‌కు మద్దతు, ఇజ్రాయెల్‌పై పోరులో దక్షిణాది దళాలకు నాయకత్వం వహించాడు. హెజ్బొల్లా నాయకత్వంలో ముఖ్యుడుని అమెరికా అలీ కరాకీని అభివర్ణించింది. ఇతని గురించి బయటి ప్రపంచానికి తెలిసింది తక్కువే. ఇజ్రాయెల్ బాంబుదాడుల్లో నస్రల్లాతో పాటు చనిపోయాడు. ఇబ్రహీం కొబైసీ హెజ్బొల్లా క్షిపణి యూనిట్‌కు నాయకుడు. 2000 సంవత్సరంలో ఉత్తర సరిహద్దుల్లో ముగ్గురు ఇజ్రాయెల్ సైనికులను కిడ్నాప్ చేసి హతమార్చడం కొబైసీ పథకరచనే అని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. నాలుగేళ్ల తర్వాత యుద్ధఖైదీల మారి్పడి కిందట ఈ ముగ్గురు సైనికుల మృతదేహాలను హెజ్బొల్లా ఇజ్రాయెల్‌కు అప్పగించింది. మొహమ్మద్ సురౌర్ హెజ్బొల్లా డ్రోన్ విభాగం చీఫ్. ఇజ్రాయెల్‌తో గాజాపై విరుచుకుపడ్డాక.. ప్రస్తుత యుద్ధంలో తొలిసారిగా హెజ్బొల్లా దాడులకు డ్రోన్లకు వాడింది. సురౌర్ నేతృత్వంలో ఇజ్రాయెల్ లోపలి భూభాగాల్లోకి వెళ్లి.. పేలిపోయే విధంగా డ్రోన్లను వాడారు. అలాగే గూడచర్యానికి కూడా హెజ్బొల్లా డ్రోన్లను వినియోగించింది. ఇజ్రాయెల్ ప్రధానంగా హెజ్బొల్లా ప్రయోగించే రాకెట్లు, క్షిపణులపై దృష్టి పెట్టగా.. డ్రోన్ల ద్వారా ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలను చేధించి హెజ్బొల్లా దాడులు చేసింది. అహ్మద్ వెహ్బే రాడ్వాన్ ఫోర్సెస్ కమాండర్. రెండు దశాబ్దాల కింద ఈ దళాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి దీన్ని ఉన్నతశ్రేణి దళంగా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించారు. బీరుట్ దక్షిణ శివారులో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో అకీల్‌తో పాటు వెహ్బే కూడా మరణించాడు. వీరు తలదాచుకున్న భవనం పూర్తిగా నేలమట్టమైంది. మిగిలింది వీరే.. అగ్రనాయకత్వంలో అతికొద్ది మంది మిగిలి ఉన్నారు. నస్రల్లా తర్వాతి స్థానంలో ఉన్నది నయీం కస్సెమ్. అత్యంత సీనియర్. 1991 నుంచి హెజ్బొల్లాకు డిప్యూటీ లీడర్‌గా ఉన్నారు. హషీం సైఫిద్దీన్ హెజ్బొల్లా సెంట్రల్ కౌన్సిల్ అధిపతి. నస్రల్లాకు సోదరుడైన హషీం హెజ్బొల్లా సారథ్య బాధ్యతలు చేపడతారని భావిస్తున్నారు. బతికి ఉన్న అగ్రనేతల్లో మరో ఇద్దరు.. తలాల్ హమీహే, అబూ అలీ రెదాలు. వీరిందరిపై ఇజ్రాయెల్ ఇప్పుడు గురిపెట్టింది. -
లండన్ నడిబొడ్డున జిహాద్ నినాదాలు.. రిషి సునాక్ ఆగ్రహం
లండన్: లండన్ నడిబొడ్డున జిహాద్ నినాదాలపై ప్రధాని రిషి సునాక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది యూదులతో పాటు ప్రజాస్వామ్య విలువలకు ముప్పులా పరిణమిస్తుందని అన్నారు. లండన్‌లో ఇలాంటి నినాదాలను సహించబోమని చెప్పారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో పాలస్తీనియన్లకు మద్దతుగా లండన్, బర్మింగ్‌హామ్, కార్డిఫ్, బెల్ఫాస్ట్ సహా ఇతర నగరాల్లో భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. ఇందులో కొందరు ఆందోళనకారులు జిహాద్ నినాదాలు కూడా చేశారు. 'ఈ శనివారం జరిపిన నిరసనల్లో వీధుల్లో ద్వేషాన్ని చూశాము. జిహాద్ పిలుపులు యూదు సమాజానికి మాత్రమే కాదు, మన ప్రజాస్వామ్య విలువలకు కూడా ముప్పు. మన దేశంలో యూదు వ్యతిరేకతను ఎప్పటికీ సహించము. తీవ్రవాదాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని చర్యలను పోలీసులు తీసుకోవాలని ఆదేశిస్తున్నాం.' అని రిషి సునాక్ అన్నారు. గ్రేటర్ లండన్ ప్రాంతంలో పాలస్తీనియన్లకు మద్దతుగా నిరసనలు చేలరేగగా.. ద్వేషపూరిత నినాదాలు వెలుగుచూశాయని పోలీసులు తెలిపారు. ఆందోళనలు అదుపుతప్పాయని చెప్పారు. ఈ ఘటనల్లో ఐదుగురు పోలీసులు కూడా గాయపడ్డారని వెల్లడించారు. జిహాద్ అంటూ నినాదాలు చేస్తున్న ఓ వ్యక్తి వీడియోను కూడా షేర్ చేశారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో రిషి సునాక్ ఇజ్రాయెల్ పట్ల నిలబడిన విషయం తెలిసిందే. హమాస్ ఉగ్రవాద సంస్థ ఆగడాలను నిలిపివేయాని పిలుపునిచ్చారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంలో తాము తోడుగా ఉంటామని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ఇండోనేషియా రాయబారిగా ఇండో-అమెరికన్.. బైడెన్ కీలక నిర్ణయం -
పాక్‌లో జిహాద్ పేరుతో నిధులు సేకరించొద్దు
లాహోర్: పాకిస్తాన్లో జిహాద్ పేరుతో నిధులను సేకరించేందుకు ప్రజలను ప్రేరేపించొద్దని, అలా ఎవరు చేసినా అది రాజద్రోహం కిందికి వస్తుందని లాహోర్ హైకోర్టు స్పష్టం చేసింది. ఏదైనా యుద్ధాన్ని ప్రకటిస్తే అందుకు అవసరమైన డబ్బులు సేకరించడం దేశానికి సంబంధించిన పని అని వెల్లడించింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ కోసం నిధులు సేకరించినందుకు దోషులుగా తేలి ఐదేళ్లు శిక్ష పడిన ఇద్దరు ఉగ్రవాదుల అప్పీళ్లను తోసిపుచ్చుతూ ఇటీవల తీర్పు నిచ్చింది. ‘తెహ్రీకీ తాలిబాన్ నిషేధిత సంస్థ. దేశానికి ఎంతో నష్టం చేసింది. దేశ ముఖ్య నాయకులు లక్ష్యంగా పని చేసింది. దేశంలో ఉగ్రవాదం పెంచడానికి ప్రయత్నింది. ఆర్థికంగా మద్దతు లేనిదే ఇదంతా సాధ్యం కాదు’ అని వ్యాఖ్యానించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు డబ్బులు అందించారంటూ ఈ నెలలో అరెస్టయిన ఇద్దరు తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాదులకు యాంటీ టెర్రరిస్టు కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. -
భారత్‌పై ఐసిస్ కుట్ర బట్టబయలు
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్ర సంస్థ ఐసిస్ కుట్రపూరిత ప్రణాళిక మరోసారి బట్టబయలైంది. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయుధాలు చేబూని జీహాద్ చేపట్టాలని ఐసిస్ తన డిజిటల్ మ్యాగజైన్లో ఓ వర్గాన్ని రెచ్చగొడుతోందని ఓ జాతీయ వెబ్సైట్ పేర్కొంది. జాతి భద్రతకు ముప్పుగా ముంచుకొచ్చిన మ్యాగజైన్‌పై భద్రతా వర్గాలు ఆరా తీస్తున్నాయి. సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగించాలని పిలుపు ఇచ్చిన ఐసిస్ డిజిటల్ మ్యాగజైన్ ఈ పోరాటానికి మద్దతుగా తాము నిలబడతామని హామీ ఇచ్చింది. రహస్య టెలిగ్రాం చానెల్స్, వెబ్ మీడియా ద్వారా ‘వాయిస్ ఆఫ్ ఇండియా’ పేరిట ఐసిస్ డిజటల్ మ్యాగజైన్ దేశ ప్రజల్లో విద్వేష భావాన్ని నూరిపోస్తోందని ఆ కథనం పేర్కొంది. బాబ్రీమసీదు విధ్వంసానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఓ వర్గాన్ని ఈ మ్యాగజైన్ రెచ్చగొడుతోందని స్పష్టం చేసింది. సీఏఏపై తప్పుడు ప్రచారానికి పాల్పడుతూ కోర్టుల నిర్ణయాలకు కట్టబడిఉండరాదని ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని పేర్కొంది. చదవండి : ఐసిస్ అడ్డాగా ఐటీ రాజధాని..! -
యూపీఎస్సీ జిహాద్ : ఎవరిపై కుట్ర?
సాక్షి, న్యూఢిల్లీ : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటుతున్నప్పటికి ఓ వర్గంపై మరో వర్గం బురదజల్లే ప్రయత్నాలు మాత్రం మానడంలేదు. భారత్ లౌకిక దేశమని నేతలంతా గర్వంగా రాజకీయ ప్రకటనలు చేస్తున్నా.. మైనార్టీ వర్గాలపై మాత్రం ఏదో ఒక విధంగా వివక్ష చూపుతూనే ఉన్నారు కొందరు. ఇటీవల ఓ మీడియా ప్రసారం చేసిన ఓ కథనమే దీనికి నిదర్శనం. సమాజంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన మీడియా ఓ వర్గాన్ని కించపరుస్తూ కథనాలు టెలికాస్ట్ చేయడం సరైనది కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం మెట్టికాయలు వేయడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. దేశ రాజధాని ప్రాంతం కేంద్రంగా విధులు నిర్వర్తిస్తున్న టెలివిజన్ సంస్థ సుదర్శన్ టీవీ. ఇటీవల ఈ టీవీలో ఓ ఎపిసోడ్ ప్రసారమైంది. ‘యూపీఎస్సీ జిహాద్’ పేరిట ఆ సంస్థ ప్రసారం చేసిన కార్యక్రమం తీవ్ర వివాదాస్పదమైంది. దేశంలో మైనార్టీలుగా ఉన్న ముస్లింలు కేంద్ర సంస్థల్లోకి పెద్ద ఎత్తున రిక్రూట్ అవుతున్నారు అనేది ఆ కార్యక్రమం సారాంశం. దేశ జనాభాలో కేవలం 13 నుంచి 15 శాతం ఉన్న ముస్లింలు పెద్ద సంఖ్యలో కేంద్ర సంస్థల్లోకి ప్రవేశిస్తున్నారని, దీని వెనుక ఎవరికీ తెలియని ఓ రహస్యం దాగిఉందనేది నిర్వహకుల అభిప్రాయం. (బీజేపీకి ఊహించని షాకిచ్చిన మిత్రపక్షం) అయితే ఓ వర్గాన్ని కించపరుస్తూ సుదర్శన్ టీవీ నిర్వహిస్తున్న యూపీఎస్సీ జిహాద్ కార్యక్రమాన్ని నిషేధించాలని పలువురు సివిల్స్ అధికారులు సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. అప్పటికీ ఆ షో మూడు ఎపిసోడ్స్‌ని కూడా ప్రచారం చేసింది. దీనిపై రెండురోజుల క్రితం విచారణ చేపట్టిన జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం టీవీ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లౌకిక దేశంలో ఓ వర్గాన్ని నేరుగా టార్గెట్ చేసే విధంగా ప్రవర్తిస్తున్నారని, వెంటనే ఆ షోను నిలిపివేయాలని ఆదేశించింది. స్వతంత్ర ప్రతిపత్తి గల యూపీఎస్సీ ప్రతిష్ట దెబ్బతినే విధంగా షో ఉందని ఆక్షేపించింది. వాక్ స్వాతంత్రం పేరుతో ఇష్టం వచ్చిన విధంగా వ్యవహరిస్తామంటే ఊరుకునే ప్రసక్తేలేదని న్యాయస్థానం స్పష్టం చెప్పింది. ఇకపై తదుపరి షోలను టెలికాస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు సైతం జారీచేసింది. (30న బాబ్రీ కూల్చివేత తీర్పు) కాగా కేంద్ర ప్రభుత్వం గణాంకాల ప్రకారం.. 2019 సివిల్ సర్వీస్ పరీక్షల్లో మొత్తం 829 మంది అభ్యర్థులు సెలెక్ట్ అయితే వారిలో 42 మంది ముస్లిం కమ్యూనిటికి చెందిన అభ్యర్థులు ఉన్నారు. అంటే మొత్తంలో 5శాతం మంది కేంద్ర సర్వీసులకు అర్హత సాధించారు. ఇక 2018లో మొత్తం 759 మంది అభ్యర్థులు అర్హత సాధిస్తే వారిలో 28 మంది ముస్లింలు ఉన్నారు. ఇక 2012, 13,14లో వరుసగా 30,34,38 మంది చొప్పున అభ్యర్థులు ఎన్నికవుతూ వస్తున్నారు. కాగా జాతీయ స్థాయిలోనూ మైనార్టీల ప్రాతినిధ్యం పెరగాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలను తీసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రత్యేక సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిల్స్‌తో పాటు మైనార్టీలకూ ప్రత్యేకంగా స్టడీ సర్కిల్స్‌ను ఏర్పాటు చేస్తోంది. మరోవైపు ముస్లింలపై కుట్ర పన్నేవిధంగా షోలు నిర్వహించడం సరైనదికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
నన్ను అరెస్టు చేసే దమ్ముందా?
సాక్షి, బెంగళూరు: దమ్ముంటే తనను అరెస్టు చేయాలని ఎంపీ, బీజేపీ నాయకురాలు శోభ కరంద్లాజే ప్రభుత్వానికి సవాలు విసిరారు. జిహాద్‌కు వ్యతిరేకంగా మాట్లాడినందుకే తనను జైలులో పెట్టాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. హన్నావరలో సంఘ్ కార్యకర్త పరేశ్మేస్తా హత్యతోపాటు కావ్యా నాయక్ అనే విద్యార్థి పై జరిగిన దాడిని ఖండిస్తూ సోషల్ మీడియాలో శోభ పోస్టులు చేయడంతో ఆమెపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ దాఖలయ్యింది. ఈ నేపథ్యంలో శనివారం బెంగళూరులోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె తీవ్ర ఆగ్రహావేశాలతో మాట్లాడారు. ‘రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులకు నేను భయపడబోను. నన్ను అరెస్టు చేస్తే తదుపరి పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కొన్ని మైనారిటీ వర్గాలు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నా పట్టించుకోకుండా, భారత సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ కోసం పోరాడుతున్న వారి పై కేసులు నమోదు చేస్తూ రాజకీయ ప్రయోజనం పొందాలని చూడటం ఎంతవరకూ సమంజసం’ అని మండిపడ్డారు. వీరశైవ– లింగాయత సముదాయం మధ్య చిచ్చుపెట్టి లింగాయత్ సముదాయానికి మైనారిటీ హోదా కల్పించాలని కాంగ్రెస్ పార్టీ భావించడం వెనుక రాజకీయ కుట్ర దాగుందని శోభ విమర్శించారు. మహదాయిపై రాహుల్ వైఖరేమిటి? మహదాయి సమస్య పరిష్కారం కోసం ట్రిబ్యునల్ పరిధిలోనే బీజేపీ రాష్ట్రాధ్యక్షుడైన యడ్యూరప్ప, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ పనిచేస్తుంటే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు ఇరు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని శోభ అన్నారు. గోవాలోని కాంగ్రెస్ నాయకులు కర్ణాటకకు చుక్క నీరుకూడా వదలమని చెబుతున్నారన్నారు. ఈ వ్యవహారంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మహదాయిపై వారి వైఖరి ఏమిటనేది చెప్పాలని కోరారు. -
భారత్‌పై విషం కక్కిన హఫీజ్ సయీద్
లాహోర్ : ముంబైదాడుల సూత్రధారి హఫీజ్ మరోసారి భారత్ మీద విషం కక్కాడు. భారత్ నుంచి కశ్మీర్‌ను వేరు చేయడానికే జీహాద్‌ను కొనసాగిస్తున్నట్ల చెప్పారు. లాహోర్‌లో జమాతే ఉద్ దవా మద్దతుదారులతో శనివారం హఫీజ్ మాట్లాడారు. ఈ సందర్భంగా 1971 యుద్ధానికి భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని జమాతే కార్యకర్తలకు పిలుపునిచ్చారు. యుద్ధంలో భారత్‌ను ఓడించి.. కశ్మీర్‌కు స్వేచ్ఛ ప్రసాదించాలని మద్దతుదారులకు చెప్పారు. బంగ్లాదేశ్ విమోచన యుద్ధంపై భారత్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రతి పాకిస్తానీ ఎదురు చూస్తున్నాడని.. ఆ రోజు ఎంతో దూరం లేదని హఫీజ్ పేర్కొనడం విశేషం. తూర్పు పాకిస్తాన్‌ను.. పాకిస్తాన్ నుంచి విడదీనట్టు.. భారత్ నుంచి కశ్మీర్‌ను వేరు చేయాలని చెప్పారు. కశ్మీర్ విమోచనమే అసలైన ప్రతీకారమని హఫీజ్ సయీద్ తన మద్దతాదారులతో అన్నారు. డిసెంబర్ 16న భారత్, బంగ్లాదేశ్‌లు విజయ్ దివస్‌గా జరుపుకోవడంపై హఫీజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో.. పాకిస్తాన్‌పై భారత్ అద్వితీయ విజయం సాధించింది. పాకిస్తాన్‌కు చెందిన లక్ష మంది సైనికులను భారత సైన్యం.. యుద్ధఖైదీలకు బంధించింది. తరువాత జరిగిన ఒప్పందాల్లో భారత్ పెద్ద మనసుతో వారికి క్షమాభిక్ష ప్రసాదించి వదలిపెట్టిన విషయం విదితమే. -
భారత్.. జీహాదీల లక్ష్యం
కశ్మీర్ స్వేచ్ఛే లక్ష్యం భారత్‌లో జీహాద్ మరింత తీవ్రతరం ప్రకటించిన జమాత్ ఉద్ దవా చీఫ్ అబ్దుల్ రెహమాన్ లాహోర్ : భారత్ లక్ష్యంగా జీహాదీలు తమ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయాలని ఉవ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా చీఫ్ అబ్దుల్ రెహమాన్ మక్కీ తీవ్రవాదులకు ఉద్భోధించారు. జమ్మూ కశ్మీర్‌కు స్వేచ్ఛ లభించే వరకూ పోరాటం చేయాలని రెహమాన్ మక్కీ తీవ్రవాదులకు రెచ్చగొట్టేలా పేర్కొన్నారు. భారత్‌లో అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఉగ్రవాది అబు వాలెద్ మహ్మద్‌ను భద్రతా బలగాలు మట్టుపెట్టిన సంగతి తెలిసిందే. లాహోర్‌లో జరిగిన వాలెద్ సంస్మరణ సభలో పాల్గొన్న రెహమాన్ మక్కీ.. సీమాంతర ఉగ్రవాదాన్ని మరింత ప్రోత్సహిస్తామని అన్నారు. మరికొంత మంది యువకులకు జీహాదీ శిక్షణ ఇచ్చి కశ్మీర్లోకి పంపుతామని ప్రకటించారు. భారత ప్రభుత్వంతో పోరాడుతున్న కాశ్మీరీలకు అన్ని రకాలుగా మద్దతు ఇస్తామని రెహమాన్ మక్కీ చెప్పారు. -
ఆ ఉగ్రదాడి వెనకా పాక్ హస్తం!
ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా.. దాని వెనక పాక్ హస్తం కనిపించేలాగే ఉంది. గతంలో ముంబై నగరం మీద జరిగిన ఉగ్రదాడి పాక్ పనేనని మన దేశం స్పష్టంగా చెప్పి, సాక్ష్యాలు చూపించింది. అయినా పాక్ కాదంది. ఇప్పుడు లండన్‌లో జరిగిన ఉగ్రదాడిలో కూడా పాక్ హస్తం ఉందని తేలిపోయింది. లండన్ ఉగ్రదాడిలో పాల్గొన్న ముగ్గురిలో ఒకడైన ఖుర్రమ్ షజాద్ భట్ అనే వ్యక్తి 'ద జీహాదీస్ నెక్స్ట్ డోర్' అనే ఒక డాక్యుమెంటరీలో కూడా నటించిన పాకిస్తానీ. ఆ విషయం బ్రిటన్‌కు చెందిన ఎంఐ5 ఇంటెలిజెన్స్ సర్వీస్ వాళ్లు చెప్పారు. పాకిస్తాన్లో పుట్టి, లండన్‌లో స్థిరపడిన ఖుర్రమ్తో పాటు అతడి ఇద్దరు ఉగ్రవాద సహచరులను పోలీసులు కాల్చి చంపేశారు. శనివారం రాత్రి రద్దీగా ఉన్న మార్కెట్లోకి చొరబడి ఏడుగురిని వీళ్లు చంపిన విషయం తెలిసిందే. కొన్నాళ్లు కేఎఫ్సీలోను, మరికొన్నాళ్లు వేరే కంపెనీలలోను ఖుర్రమ్ పనిచేశాడు. గత సంవత్సరం అతడు నటించిన డాక్యుమెంటరీ ప్రసారమైంది. ప్రస్తుతం నిషేధానికి గురైన అల్-ముహాజిరౌన్ అనే సంస్థ మాజీ అధినేత అంజెమ్ చౌదరితో ఖుర్రమ్కు మంచి సంబంధాలు ఉండేవి. ఇస్లామిక్ స్టేట్ జీహాదీలను ప్రోత్సహిస్తున్నందుకు, తన ప్రవచనాలతో యువతను రెచ్చగొడుతున్నందుకు చౌదరికి ఐదున్నరేళ్ల జైలు శిక్ష పడింది. అల్ ముహాజిరౌన్ సంస్థ ప్రవచనాలతో ప్రభావితమైనవారిలో 2005 జూలై నెలలో లండన్ ప్రజారవాణా వ్యవస్థ వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడి 52 మంది మరణానికి కారణమైన వాళ్లు కూడా ఉన్నారు. అలాంటి సంస్థతో ఖుర్రమ్ తిరిగేవాడు. అయితే.. అతడి ఇంటి చుట్టుపక్కల వాళ్లు మాత్రం ఖుర్రమ్ గురించి చాలా బాగా చెబుతున్నారు. ఏమాత్రం ఆవేశంగా ఉండేవాడు కాదని, కనిపించినప్పుడు హాయ్, బై చెప్పడం తప్ప పెద్దగా మాట్లాడేవాడు కాదని ఆ ప్రాంతంలో డ్రైవింగ్ స్కూలు నడిపే సలాహుదీన్ చెప్పారు. ఖుర్రమ్కు కొడుకు, కూతురు ఉన్నారని, వాళ్లను దగ్గరలోని పార్కుకు తీసుకెళ్లి ఫుట్‌బాల్ ఆడేవాడని తెలిపారు. ఖుర్రమ్తో పాటు ఉన్న రెండో ఉగ్రవాది పేరు రాచిడ్ రెడౌన్ అని పోలీసులు తెలిపారు. మూడో వ్యక్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు. -
హఫీజ్‌కు వ్యతిరేకంగా తొలిసారి పాక్ సాక్ష్యం
-
హఫీజ్‌కు వ్యతిరేకంగా తొలిసారి పాక్ సాక్ష్యం
లాహోర్: ముంబయి పేలుళ్ల సూత్రదారి ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి జ్యుడిషియలర్ రివ్యూ బోర్డు ముందు వాంగ్మూలం ఇచ్చారు. జిహాద్ పేరిట సయీద్ ఆయన అనుచరులు ఉగ్రవాదాన్ని వ్యాపింప జేస్తున్నారని, తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. గృహనిర్బందం చేసిన సయీద్‌ను మరో 90 రోజులపాటు నిర్బంధంలో ఉంచేందుకు పాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై లాహోర్ హైకోర్టు ప్రశ్నించింది. అతడి నిర్భందాన్ని పొడిగించడానికి ముందు వారిని ఎందుకు జ్యుడిషియల్ రివ్యూ బోర్డు ముందుకు తీసుకురాలేదని ప్రశ్నించింది. ఈ నేపథ్యంతో కట్టుదిట్టమైన భద్రత నడుమ సయీద్ అతడి నలుగురు అనుచరులను బోర్డు ముందుకు తీసుకొచ్చిన పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ అనంతరం వారిని అదుపులోకి తీసుకోవడానికి గల కారణాలు తెలిపింది. దీంతో ఈసారి విచారణకు అటార్నీ జనరల్‌ను పంపించాల్సిందిగా రివ్యూ బోర్డు ఆదేశిస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. -
మోదీ, జిహాద్ పై జకీర్ ఏమన్నారు..?
జెద్దా: తన ఉపన్యాసాలతో ఉగ్రవాదులు ప్రభావితమయ్యారని జరుగుతున్న ప్రచారాన్ని వివాదాస్పద ఇస్లాం బోధకుడు జకీర్ నాయక్ ఖండించారు. మీడియా తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ప్రశంసలు కురిపించారు. అమాయకుల ప్రాణాలను తీయడం జిహాద్ కాదని స్పష్టంచేశారు. శుక్రవారం సౌదీ అరేబియా నుంచి భారత మీడియాతో జకీర్ మాట్లాడారు. భారతదేశంలోని వార్తా పత్రికలే తనపై విచారణ జరుపుతున్నాయని అన్నారు. మోదీ అనేక ముస్లిం దేశాలు తిరుగుతూ హిందూ, ముస్లింల ఐక్యతకు కృషిచేస్తున్నారని కొనియాడారు. ఒకనాడు విశ్వగురు స్థానంలో ఉన్న భారత్.. మోదీ కృషి వల్ల మళ్లీ ప్రపంచంలో మొదటిస్థానాన్ని పొందగలదని అకాక్షించారు. జిహాద్ అంటే సమాజ అభివృద్ధి కోసం కృషి చేయడమేనని తేల్చిచెప్పారు. ఇస్లాం రాజ్యం పేరుతో అమాయకులను చంపడాన్ని పాపంగా ఖురాన్ చెప్పిందని జకీర్ తెలిపారు. ప్రభుత్వం, విచారణ సంస్థలు ఎప్పుడు రమ్మన్నా ఇండియా రావడానికి సిద్ధంగా ఉన్నాయని స్పష్టంచేశారు. బంగ్లాదేశ్ లోని రెస్టారెంట్ లో నరమేధం సృష్టించిన ఉగ్రవాదుల్లో ఒకరు జకీర్ బోధనలతోనే ప్రభావితమయ్యానని చెప్పాడు. దీంతో బంగ్లా ప్రభుత్వం జకీర్ కు చెందిన పీస్ ఛానల్ ను నిషేధించింది. కశ్మీర్ లో భద్రతా దళాల కాల్పుల్లో మరణించిన ఉగ్రవాది బుర్హాన్ వనీ సైతం జకీర్ బోధనలతో ప్రభావితమైన విషయం తెలిసిందే. -
భారత్‌లో నరమేధానికి దొడ్డిదారి
న్యూఢిల్లీ: తక్కువ వ్యయంతో భారత్‌లో రక్తపాతం సృష్టించడానికి అత్యంత సులువైన మార్గం జీహాద్ (పవిత్రయుద్ధం) ఒక్కటేననేదే పాకిస్తాన్ యోచన. సైనిక బలం విషయంలో భారత్‌తో సమానంగా ఎదగడానికి ఈ విధానమే సరైనదని భావిస్తోంది. పైగా అక్కడి వ్యవస్థ, చట్టాల ప్రకారం జీహాదీలను విచారించడం కష్టం. ఇందుకు కారణం వారిని అక్కడ మంచివారిగా భావించడమే. ఈ విషయాన్ని అమెరికాలో పాక్ మాజీ రాయబారి హుస్సేన్ హక్కాని వెల్లడించారు. ‘ఇండియా వర్సెస్ పాక్: వైకాంట్ ఉయ్ బీ ఫ్రెండ్స్’ పేరిట ఇటీవల రాసిన తన పుస్తకంపై ఆయన తన మనోభావాలను మీడియాతో పంచుకున్నారు. జీహాద్, భారత్‌తో సంబంధాలు, ఐఎస్ఐతో పాక్ సైన్యానికి గల సంబంధాలు తదితర అంశాలను ఈ సందర్భంగా వెల్లడించారు. ముంబైపై ఉగ్రవాదుల దాడి గురించి ప్రశ్నించగా పాల్గొన్నది తమ వారైనా ఆపరేషన్‌తో సంబంధం లేదన్నారు. ‘పాకిస్థాన్‌కు చెందినవారి ప్రమేయం ఉంది’ అని అన్నారు. అయితే వారు ఎవరనేది ఆయన వెల్లడించలేదు. దాడికి రూపకల్పనచేసినవారిలో పాకిస్తాన్ సైనిక విభాగం విశ్రాంత అధికారులు, విశ్రాంత గూఢచార విభాగం అధికారులు కూడా ఉన్నారని తెలిపారు. కాగా అన్ని ఆధారాలు సమర్పించినప్పటికీ ముంబైపై ఉగ్రదాడి కేసు లోతుల్లోకి పాకిస్తాన్ వెళ్లనేలేదు. పాకిస్తాన్లో ఉగ్రవాద కార్యకలాపాలకు తెరదించాలంటూ అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి కండోలెజ్జా రైస్ గతంలో కోరినా పాక్.. ఎంతమాత్రం స్పందించలేదు. 1990 నుంచి పాకిస్తాన్ ఇదే ధోరణిని అనుసరిస్తోంది. ఉగ్రవాదుల దాడి విషయంలో అమెరికా..పాక్‌పై ఒత్తిడి తీసుకురాగా అందుకు నిరాకరించింది. ఆ తర్వాత కశ్మీర్ అంశాన్ని తెరపైకి తెచ్చింది. -
ఫ్లైట్‌లో జిహాద్ అంటూ కాక్ పీట్ వైపు దూసుకెళ్లి..
అలెగ్జాండ్రియా(వర్జీనియా): విమానం వెళుతుండగా జిహాద్ అంటూ అరుస్తూ కాక్‌పీట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వ్యక్తికి అమెరికా కోర్టు తొమ్మిది నెలల జైలు శిక్షను విధించింది. గత ఏడాది మార్చి 2015న 36 ఏళ్ల డేవిడ్ ప్యాట్రిక్ డియాజ్ అనే వ్యక్తి డల్లెస్ నుంచి డెన్వెర్కు బయలుదేరాడు. తొలుత అందరితోపాటు కుదురుగా కూర్చున్న అతడు ఫ్లైట్ బయలుదేరి గగనతలానికి వెళ్లిన కాసేపటికి జిహాద్ అంటూ బిగ్గరగా కేకలు పెడుతూ కాక్ పీట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన సిబ్బంది ఉన్నపలంగా అతడిని బంధించి తిరిగి విమానాన్ని వెనక్కితిప్పి వర్జీనియాలోని డల్లెస్ ఎయిర్ పోర్ట్ లో దింపేశారు. అనంతరం అతడిని అరెస్టు చేశారు. అయితే, అతడి తరుపు న్యాయవాది అలెగ్జాండ్రియా కోర్టులో వాదిస్తూ అతడు ఆ సమయంలో మద్యం సేవించిన కారణంగా మానసికంగా బలహీనుడయ్యాడని అందుకే అలా ప్రవర్తించాడని చెప్పారు. అయితే, ఎయిర్ లైన్స్ తరుపు న్యాయవాది మాత్రం అతడికి కనీసం 21 నెలలు జైలు శిక్ష విధించాలని కోరారు. కాగా, న్యాయమూర్తి మాత్రం తొమ్మిది నెలల శిక్ష విధించడంతోపాటు 22 వేల డాలర్ల ఫైన్ వేశారు. -
'ఉగ్రవాదంపై ముస్లింలు జిహాద్ ప్రకటించాల్సిందే'
న్యూఢిల్లీ: ఉగ్రవాదం, జాతివివక్ష, నరమేధానికి వ్యతిరేకంగా ముస్లింలు తప్పక జిహాద్(పవిత్ర యుద్ధం) ప్రకటించాల్సిందేనని ఓ ఇస్లామిక్ స్కాలర్ అన్నాడు. ఉగ్రవాదుల చర్యలు ఇస్లాం సిద్ధాంతాలకు సవాలుగా మారాయని, వీటి విషయంలో ముస్లింలంతా ఏకమై పరిష్కారం కనుగొనాలని చెప్పాడు. జమైతే ఉలేమా అల్ హింద్ సంస్థకు చెందిన స్కాలర్ మౌలానా మహ్మద్ మదానీ ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ సమాజంలో దుష్టశక్తులను సమూలంగా నాశనం చేసి మంచిని స్థాపించే సానుకూల దృక్పథం జిహాద్ ది తప్ప ఆ పేరుతో అమాయకుల ప్రాణాలను తీయడం మాత్రం దాని ఉద్దేశం కాదన్నారు. ఉగ్రవాదంపై జిహాద్ ప్రకటించడం ప్రతి ముస్లిం దేశానికి ఉన్న కనీస బాధ్యత అని, ఇప్పటికైనా ఆయా దేశాలు ఈ విషయంలో కలిసి ముందడుగు వేయాలని చెప్పారు. సమాజంలో అసహనం అనేది ఏమాత్రం మంచిది కాదని, దానిని నిర్మూలించాల్సిన అవసరం ఉందని అన్నారు. త్వరలోనే దేశవ్యాప్తంగా ఢిల్లీ, హైదరాబాద్, ముంబయి మరో 65 నగరాల్లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పలు ముస్లిం సంస్థలతో ర్యాలీలు నిర్వహిస్తామని చెప్పారు. 2007 నుంచి ఈయన సంస్థ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపిస్తూనే ఉంది. -
అమెరికా రష్యాలపై జిహాద్ చేయండి: ఐఎస్
అగ్రరాజ్యాలు అమెరికా, రష్యాలపై ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ జీహాద్ ప్రకటించింది. ఈ మేరకు ఐఎస్ ప్రతినిధి అబు మహ్మద్ అల్ అద్నానీ ఒక ఆడియో మెసేజ్ విడుదల చేశాడు. ముస్లిం యువకులు ఎక్కడున్నా వచ్చి రష్యన్లు, అమెరికన్ల మీద జీహాద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చాడు. ఆ రెండు దేశాలు ముస్లింల మీద యుద్ధం కొనసాగిస్తున్నాయన్నాడు. అల్ కాయిదా అనుంధ సంస్థ నస్రా ఫ్రంట్ రష్యామీద దాడులు చేయాలని పిలుపునిచ్చిన ఒక్క రోజు తర్వాత ఇస్లామిక్ స్టేట్ పిలుపు విషయం బయటికొచ్చింది. రష్యన్లు కనపడితే చంపేయాలని కాకాస్ లోని ఉగ్రవాదులకు నస్రా ఫ్రంట్ నాయకుడు అబు మహ్మద్ అల్ జొలానీ పిలుపునిచ్చాడు. సిరియాలో రష్యా వైమానిక దాడులకు ప్రతీకారంగా ఈ దాడులు చేయాలన్నాడు. జీహాదీ వర్గాలన్నీ ఒక గొడుకు కిందకు రావాలని, అంతర్గత కుమ్ములాటలు మానుకోవాలని అన్నాడు. సిరియాలో రష్యా, పాశ్చాత్య దేశాల బలగాల మీద యుద్ధం చేసేవరకు అంతర్గత విభేదాలు ఆపాలన్నాడు. సెప్టెంబర్ 30వ తేదీ తర్వాత సిరియాలో రష్యా వైమానిక దాడులు మొదలయ్యాయి. ప్రధానంగా నస్రా ఫ్రంట్, ఇస్లామిక్ స్టేట్‌తో పాటు ఇతర ఉగ్రవాద గ్రూపుల స్థావరాల మీద ఈ దాడులు జరుగుతున్నాయి. దాంతో సిరియా ఉగ్రవాదులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. అందుకే ప్రధానంగా రష్యా, ఇతర పాశ్చాత్య దేశాల బలగాలపై దాడులకు ఉగ్రవాదులు పిలుపునిస్తున్నారు. ఈ ప్రాంతంలో దాదాపు 41 వరకు ఉగ్రవాద బృందాలున్నాయి. -
ఎక్కడిదీ సిమి?
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లాలో ఇద్దరు సిమి ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌తో ఈ సంస్థ కార్యకలాపాలు మరోసారి సర్వత్రా చర్చనీయమయ్యాయి. స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఎంఐ) పేరుతో ఇస్లాం మతవ్యాప్తే లక్ష్యంగా కొందరు యువకులు ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ కేంద్రంగా 1977లో ఈ సంస్థను నెలకొల్పారు. భారత్‌ను ఇస్లాం దేశంగా మార్చాలనే సంకల్పంతో దేశంపైనే జిహాద్(పవిత్ర యుద్ధం) ప్రకటించింది సిమి! హింసాత్మక కార్యకలాపాల ద్వారా లక్ష్యసాధనకు ఉగ్రవాదాన్నే మార్గంగా ఎంచుకుంది. యూపీకి చెందిన ప్రొఫెసర్ మహమ్మద్ అహ్మదుల్లా సిద్ధిఖీ దీని వ్యవస్థాపకుడు. మొదట్లో జమాతే ఇస్లామే హింద్ విద్యార్థి విభాగంగా ఆవిర్భవించిన సిమి.. 1981లో ఆ సంస్థతో సంబంధాలు తెంచుకుంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నేరం కింద 14 ఏళ్ల కిందటే ఈ సంస్థను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. దేశంలో పలు విధ్వంసక చర్యల్లో సిమి పేరు వినిపించింది. అహ్మదాబాద్‌లో వరుస బాంబు పేలుళ్లు, కాన్పూరు మత ఘర్షణల్లో సిమి ఉగ్రవాదుల ప్రమేయం బట్టబయలైంది. 2001లో ఈ సంస్థను నిషేధించాక మధ్యప్రదేశ్ నుంచి గుట్టుగా తమ కార్యకలాపాలను విస్తరించింది. నిషేధం తర్వాత ఆ రాష్ట్రంలోనే పోలీసులు దాదాపు 180 మంది మిలిటెంట్లను అరెస్టు చేయడమే సిమి విస్తరించిన తీరుకు అద్దం పడుతోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్‌లోని పలు ఉగ్రవాద సంస్థలతో ఈ సంస్థకు సంబంధాలున్నాయి. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐతోనూ లింకులున్నట్లు పోలీసులు తేల్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ సిమి చాపకింద నీరులా విస్తరించింది. సిమి తమ కార్యకలాపాలకు అవసరమయ్యే నిధుల సమీకరణకు ‘మాల్ ఏ ఘనీమత్’ పేరుతో యాక్షన్ టీమ్‌ను ఏర్పాటు చేసుకుంది. నల్గొండ జిల్లాలో చనిపోయిన ఉగ్రవాదులు ఈ టీమ్‌లోని సభ్యులే. అందుకే వరుసగా బ్యాంకు దోపిడీ, నగల దోపిడీలపైనే ఈ ముఠా దృష్టి సారించింది. -
‘జిహాద్’ నినాదాలు!
అర్వపల్లి/మోత్కూరు: అర్వపల్లి ఖాజా నసిరుద్దీన్ బాబా దర్గా నుంచి బయలుదేరిన దుండగులు అస్లాం అయూబ్, జాకీర్ బాదల్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరించారు. అర్వపల్లి సమీపంలో పోలీసుల నుంచి తప్పించుకున్న తర్వాత అర్వపల్లి మండల కేంద్రానికి చేరుకుని గట్టిగా కేకలు వేశారు. లింగయ్య అనే వ్యక్తి దగ్గర బైక్‌ను లాక్కుని ‘అల్లాహో అక్బర్...’ అంటూ నినాదాలు చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. అలాగే ‘‘పుట్టింది ఒక్కరోజే.. చనిపోయేదీ ఒక్కరోజే’’ అంటూ హిందీలో అరుస్తూ అర్వపల్లి నుంచి వెళ్లిపోయారు. ప్రజల జోలికి పోలేదు. అనంతారంలో పెట్రోల్ పోసిన సుంకరి చంద్రమౌళిని కూడా ఏమీ అనలేదు. ‘హాఫ్ లీటర్ పెట్రోల్ డాలో’ అని మాత్రమే అన్నారని, పోలీసులు రాగానే డబ్బులివ్వకుండానే పారిపోయారని స్థానికులంటున్నారు. ఎన్కౌంటర్ జరిగిన స్థలంలో మాత్రం దుండగులు ‘జీహాద్’ అని నినాదాలు చేసినట్లు సమాచారం. అయితే పోలీసులు మాత్రం దీన్ని నిర్ధారించడం లేదు. తుపాకీతో బెదిరించారు పని మీద ఉదయం ఆరుకే డిస్కవరి బైక్‌పై అర్వపల్లికి వచ్చాను. రోడ్డెక్కగానే ఇద్దరు నా దగ్గరికొచ్చారు. నేను బైక్‌పైనే ఉన్నా. వారి చేతిలో తుపాకులున్నాయి. నేను ఎవరో అనుకున్నా. దగ్గరికి వచ్చి ‘బైక్ దేవ్’ అని తుపాకీని నా తలపై గురిపెట్టారు. నాకు నోటమాట రాలేదు. నన్ను చంపేస్తారేమోనన్న భయంతో బైక్ ఇచ్చేశాను. వారు ఆ బైక్‌పై పారిపోయారు. - బింగి లింగమల్లు, జాజిరెడ్డిగూడెం, అర్వపల్లి మండలం ఒక్క క్షణంలో ప్రాణం నిలిచింది.. జానకీపురం ఎన్కౌంటర్లో ఎదురుకాల్పులు జరుగుతున్నప్పుడు సీఐ బాలగంగిరెడ్డి డ్రైవర్‌కు ముష్కరులు తుపాకీ ఎక్కుపెట్టారు. తుపాకీ ఇవ్వకుంటే కాల్చేస్తామన్నారని జీప్ నడిపిన హోంగార్డు శీను వెల్లడించారు. ‘‘తుపాకీ ఇవ్వాలంటూ నా పొట్టపై రెండుసార్లు తుపాకీ ఎక్కుపెట్టి, చంపేస్తామని హిందీలో బెదిరించారు. నా దగ్గర తుపాకీ లేదని చెప్పాను. సీఐ చాకచక్యంగా కాల్చడంతో బతికి బయటపడ్డాను’’ అని శీను చెప్పారు. -
ఇస్లాంకు శత్రువు ఐఎస్ఐఎస్
హైదరాబాద్: జీహాద్ అంటే రక్తపాతం, విధ్వంసం కాదనీ దీనిపేరిట యువత తప్పుదారి పట్టడం సరికాదని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ యువతకు హితవుపలికారు. వారికి జీహాద్ చేయాలనే భావనే ఉంటే తమ తమ బస్తీ పరిసరాల్లోని సమస్యలపై దృష్టిసారించాలని విజ్ఞప్తిచేశారు. గురువారం నగరంలోని జామియా నిజామియాలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇస్లాంకు ఐఎస్ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్, సిరియా) ప్రధాన శత్రువన్నారు. ఐఎస్ఐఎస్తో ఇస్లాంకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ వాదం ఒక దగా, మోసమని చెప్పారు. ఇస్లాం పేరిట రక్తపాతం సృష్టించడం సహించరానిదన్నారు. జీహాద్ పేరిట ఇంటర్నెట్, మొబైల్‌లలో కనిపించే సమాచారం చూసి యువత దారితప్పుతోందనీ, ఉగ్రవాది హఫీజ్ సయీద్ లాంటి సంఘ విద్రోహ శక్తులు పొందుపరచిన సమాచారమే అందులో ఉంటుందన్నారు. జీహాద్‌కు స్పష్టమైన నిర్వచనాన్ని మతగురువులు మౌలానాలను సంప్రదిస్తే తెలుస్తుందన్నారు. నిజంగా జీహాద్ చేయాలనుకుంటే యువత తమ తమ బస్తీ పరిసరాల్లోని చెడు సమస్యలపై దృష్టి సారించాలని అసదుద్దీన్ కోరారు. ప్రజాస్వామిక దేశంలో మత స్వేచ్ఛను ఆపడం ఎవరి తరంకాదన్నారు. -
'గన్ ఇస్తారనుకుంటే..గరిటె ఇచ్చారు'
హైదరాబాద్ : మరో హైదరాబాదీ యువతి ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేరి...అనంతరం అక్కడ నుంచి బయటపడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరానికి చెందిన ఓ యువతి ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ కార్యకలాపాల వైపు మొగ్గు చూపింది. ఫేస్బుక్ ద్వారా పరిచయం అయిన ఓ మహిళ...ఆమెను ఐఎస్ఐఎస్లో చేరేలా ప్రేరేపించినట్లు సమాచారం. అనంతరం ఆమె హైదరాబాద్ నుంచి దోహా మీదగా ఇరాక్ చేరుకుని అక్కడ రెండు నెలలపాటు శిక్షణ పొందినట్లు తెలుస్తోంది. అయితే చేతిలోకి తుపాకీ వస్తుందనుకున్న ఆ యువతికి...వంటపని అప్పచెప్పటంతో కంగుతిన్న ఆమె కుటుంబ సభ్యుల సహకారంతో అక్కడ నుంచి బయటపడినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల ద్వారా ఆమెను పోలీసులు హైదరాబాద్ రప్పించినట్లు సమాచారం. హైదరాబాద్ చేరుకున్న ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా ఈ యువతి ద్వారా ఐఎస్ఐఎస్లో చేరేందుకు యత్నిస్తున్న మరో ఆరుగురు యువకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక్క హైదరాబాద్ నుండే రెండు మూడు నెలల కాలంలో దాదాపు 42 మంది యువకులు వివిధ మార్గాల్లో వెళుతూ సరిహద్దుల్లో భద్రతా దళాలలకు పట్టుబడిన విషయం తెలిసిందే. వీరే కాకుండా హైదరాబాద్‌కు చెందిన వైద్య విద్యార్థిని కూడా ఐఎస్ఐఎస్ సంస్థలో చేరేందుకు సిద్ధమై, ఇరాక్, సిరియాకు వెళ్లి పోరాటం చేసేందుకు సిద్ధపడినట్లు రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం గుర్తించిన విషయం తెలిసిందే. ఐఎస్ఐఎస్లో చేరేందుకు వెళుతూ ఇప్పటికే సల్మాన్ మొయిద్దీన్ పట్టుబడి పోలీసుల కస్టడీలో ఉన్నాడు.