'గన్ ఇస్తారనుకుంటే..గరిటె ఇచ్చారు'
హైదరాబాద్ : మరో హైదరాబాదీ యువతి ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేరి...అనంతరం అక్కడ నుంచి బయటపడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరానికి చెందిన ఓ యువతి ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్‌ఐఎస్) ఉగ్రవాద సంస్థ కార్యకలాపాల వైపు మొగ్గు చూపింది. ఫేస్బుక్ ద్వారా పరిచయం అయిన ఓ మహిళ...ఆమెను ఐఎస్ఐఎస్లో చేరేలా ప్రేరేపించినట్లు సమాచారం.
అనంతరం ఆమె హైదరాబాద్ నుంచి దోహా మీదగా ఇరాక్ చేరుకుని అక్కడ రెండు నెలలపాటు శిక్షణ పొందినట్లు తెలుస్తోంది. అయితే చేతిలోకి తుపాకీ వస్తుందనుకున్న ఆ యువతికి...వంటపని అప్పచెప్పటంతో కంగుతిన్న ఆమె కుటుంబ సభ్యుల సహకారంతో అక్కడ నుంచి బయటపడినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల ద్వారా ఆమెను పోలీసులు హైదరాబాద్ రప్పించినట్లు సమాచారం. హైదరాబాద్ చేరుకున్న ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా ఈ యువతి ద్వారా ఐఎస్ఐఎస్లో చేరేందుకు యత్నిస్తున్న మరో ఆరుగురు యువకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఒక్క హైదరాబాద్ నుండే రెండు మూడు నెలల కాలంలో దాదాపు 42 మంది యువకులు వివిధ మార్గాల్లో వెళుతూ సరిహద్దుల్లో భద్రతా దళాలలకు పట్టుబడిన విషయం తెలిసిందే. వీరే కాకుండా హైదరాబాద్‌కు చెందిన వైద్య విద్యార్థిని కూడా ఐఎస్‌ఐఎస్ సంస్థలో చేరేందుకు సిద్ధమై, ఇరాక్, సిరియాకు వెళ్లి పోరాటం చేసేందుకు సిద్ధపడినట్లు రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం గుర్తించిన విషయం తెలిసిందే. ఐఎస్ఐఎస్లో చేరేందుకు వెళుతూ ఇప్పటికే సల్మాన్ మొయిద్దీన్ పట్టుబడి పోలీసుల కస్టడీలో ఉన్నాడు.