అగ్రరాజ్యాలు అమెరికా, రష్యాలపై ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ జీహాద్ ప్రకటించింది. ఈ మేరకు ఐఎస్ ప్రతినిధి అబు మహ్మద్ అల్ అద్నానీ ఒక ఆడియో మెసేజ్ విడుదల చేశాడు. ముస్లిం యువకులు ఎక్కడున్నా వచ్చి రష్యన్లు, అమెరికన్ల మీద జీహాద్లో పాల్గొనాలని పిలుపునిచ్చాడు. ఆ రెండు దేశాలు ముస్లింల మీద యుద్ధం కొనసాగిస్తున్నాయన్నాడు. అల్ కాయిదా అనుంధ సంస్థ నస్రా ఫ్రంట్ రష్యామీద దాడులు చేయాలని పిలుపునిచ్చిన ఒక్క రోజు తర్వాత ఇస్లామిక్ స్టేట్ పిలుపు విషయం బయటికొచ్చింది.
రష్యన్లు కనపడితే చంపేయాలని కాకాస్ లోని ఉగ్రవాదులకు నస్రా ఫ్రంట్ నాయకుడు అబు మహ్మద్ అల్ జొలానీ పిలుపునిచ్చాడు. సిరియాలో రష్యా వైమానిక దాడులకు ప్రతీకారంగా ఈ దాడులు చేయాలన్నాడు. జీహాదీ వర్గాలన్నీ ఒక గొడుకు కిందకు రావాలని, అంతర్గత కుమ్ములాటలు మానుకోవాలని అన్నాడు. సిరియాలో రష్యా, పాశ్చాత్య దేశాల బలగాల మీద యుద్ధం చేసేవరకు అంతర్గత విభేదాలు ఆపాలన్నాడు. సెప్టెంబర్ 30వ తేదీ తర్వాత సిరియాలో రష్యా వైమానిక దాడులు మొదలయ్యాయి. ప్రధానంగా నస్రా ఫ్రంట్, ఇస్లామిక్ స్టేట్తో పాటు ఇతర ఉగ్రవాద గ్రూపుల స్థావరాల మీద ఈ దాడులు జరుగుతున్నాయి. దాంతో సిరియా ఉగ్రవాదులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. అందుకే ప్రధానంగా రష్యా, ఇతర పాశ్చాత్య దేశాల బలగాలపై దాడులకు ఉగ్రవాదులు పిలుపునిస్తున్నారు. ఈ ప్రాంతంలో దాదాపు 41 వరకు ఉగ్రవాద బృందాలున్నాయి.
అమెరికా రష్యాలపై జిహాద్ చేయండి: ఐఎస్
Published Wed, Oct 14 2015 8:00 AM | Last Updated on Fri, Aug 24 2018 8:18 PM
Advertisement