హఫీజ్‌కు వ్యతిరేకంగా తొలిసారి పాక్ సాక్ష్యం
లాహోర్: ముంబయి పేలుళ్ల సూత్రదారి ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి జ్యుడిషియలర్ రివ్యూ బోర్డు ముందు వాంగ్మూలం ఇచ్చారు. జిహాద్ పేరిట సయీద్ ఆయన అనుచరులు ఉగ్రవాదాన్ని వ్యాపింప జేస్తున్నారని, తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. గృహనిర్బందం చేసిన సయీద్‌ను మరో 90 రోజులపాటు నిర్బంధంలో ఉంచేందుకు పాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై లాహోర్ హైకోర్టు ప్రశ్నించింది.
అతడి నిర్భందాన్ని పొడిగించడానికి ముందు వారిని ఎందుకు జ్యుడిషియల్ రివ్యూ బోర్డు ముందుకు తీసుకురాలేదని ప్రశ్నించింది. ఈ నేపథ్యంతో కట్టుదిట్టమైన భద్రత నడుమ సయీద్ అతడి నలుగురు అనుచరులను బోర్డు ముందుకు తీసుకొచ్చిన పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ అనంతరం వారిని అదుపులోకి తీసుకోవడానికి గల కారణాలు తెలిపింది. దీంతో ఈసారి విచారణకు అటార్నీ జనరల్‌ను పంపించాల్సిందిగా రివ్యూ బోర్డు ఆదేశిస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.