మోదీ, జిహాద్ పై జకీర్ ఏమన్నారు..?
జెద్దా: తన ఉపన్యాసాలతో ఉగ్రవాదులు ప్రభావితమయ్యారని జరుగుతున్న ప్రచారాన్ని వివాదాస్పద ఇస్లాం బోధకుడు జకీర్ నాయక్ ఖండించారు. మీడియా తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ప్రశంసలు కురిపించారు. అమాయకుల ప్రాణాలను తీయడం జిహాద్ కాదని స్పష్టంచేశారు. శుక్రవారం సౌదీ అరేబియా నుంచి భారత మీడియాతో జకీర్ మాట్లాడారు.
భారతదేశంలోని వార్తా పత్రికలే తనపై విచారణ జరుపుతున్నాయని అన్నారు. మోదీ అనేక ముస్లిం దేశాలు తిరుగుతూ హిందూ, ముస్లింల ఐక్యతకు కృషిచేస్తున్నారని కొనియాడారు. ఒకనాడు విశ్వగురు స్థానంలో ఉన్న భారత్.. మోదీ కృషి వల్ల మళ్లీ ప్రపంచంలో మొదటిస్థానాన్ని పొందగలదని అకాక్షించారు. జిహాద్ అంటే సమాజ అభివృద్ధి కోసం కృషి చేయడమేనని తేల్చిచెప్పారు.
ఇస్లాం రాజ్యం పేరుతో అమాయకులను చంపడాన్ని పాపంగా ఖురాన్ చెప్పిందని జకీర్ తెలిపారు. ప్రభుత్వం, విచారణ సంస్థలు ఎప్పుడు రమ్మన్నా ఇండియా రావడానికి సిద్ధంగా ఉన్నాయని స్పష్టంచేశారు. బంగ్లాదేశ్ లోని రెస్టారెంట్ లో నరమేధం సృష్టించిన ఉగ్రవాదుల్లో ఒకరు జకీర్ బోధనలతోనే ప్రభావితమయ్యానని చెప్పాడు. దీంతో బంగ్లా ప్రభుత్వం జకీర్ కు చెందిన పీస్ ఛానల్ ను నిషేధించింది. కశ్మీర్ లో భద్రతా దళాల కాల్పుల్లో మరణించిన ఉగ్రవాది బుర్హాన్ వనీ సైతం జకీర్ బోధనలతో ప్రభావితమైన విషయం తెలిసిందే.