లెబనాన్‌లో అత్యంత బలంగా ఉన్న హెజ్‌బొల్లా మిలిటెంట్ గ్రూపునకు ఇజ్రాయెల్ దాడుల్లో కోలుకోలేని దెబ్బ తగిలింది. వారం రోజుల్లోనే ఏడుగురు అగ్రనాయకులను కోల్పోయింది. లెబనాన్ చేష్టలుడిగిపోయింది. మరోవైపు కచ్చితత్వంలో లక్ష్యాలను చేధించిన ఇజ్రాయెల్ అధికారులు తమ నిఘా వ్యవస్థ పనితీరును, సైనిక పాటవాన్ని చూసి సంబరాల్లో మునిగిపోయారు. పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు అలముకున్నాయి. లెబనాన్‌లో బలీయ మిలటరీ, రాజకీయ శక్తిగా ఉన్న హెజ్‌బొల్లా శరాఘాతాల నుంచి తేరుకోవడానికి ప్రయత్నిస్తోంది. అధినేత హసన్ నస్రల్లా సహా హెజ్‌బొల్లాను స్థాపించిన 1980 నుంచి కీలక సభ్యులుగా ఉన్న పలువురిని వారం రోజుల్లో కోల్పోయింది. నస్రల్లా మినహా మిగతావారు బయటి ప్రపంచానికి అంతగా పరిచయం లేని వ్యక్తులే అయినప్పటికీ.. హెజ్‌బొల్లాలో వారి పాత్ర కీలకం. వీరిలో ఎవరేమిటో చూద్దాం..
– సాక్షి, నేషనల్ డెస్క్
నబిల్ కౌక్
కౌక్ శనివారం వైమానిక క్షిపణి దాడిలో మరణించారు. హెజ్‌బొల్లా సెంట్రల్ కౌన్సిల్ ఉప నాయకుడు. హెజ్‌బొల్లాను స్థాపించిన తొలినాళ్లలో 1980లలో దాంట్లో చేరారు. 1995–2010 మధ్య హెజ్‌బొల్లా దక్షిణ లెబనాన్ మిలటరీ కమాండర్‌గా పనిచేశారు. మీడియాతో తరచూ మాట్లాడేవారు. మద్దతుదారులను ఉద్దేశించి ఉపన్యసించే వారు. హెజ్‌బొల్లా మిలిటెంట్ల అంత్యక్రియల సందర్భంగా భావోద్వేగ ప్రసంగాలు చేసేవారు. నస్రల్లాకు వారుసుల్లో ఒకరిగా కౌక్‌ను పరిగణించేవారు.
ఇబ్రహీం అకీల్
హెజ్‌బొల్లా అగ్రశ్రేణి కమాండర్. మెరికల్లాంటి రాడ్వాన్ ఫోర్సెస్‌కు నాయకుడు. రాడ్వాన్ ఫోర్సెస్‌ను తమ సరిహద్దుల్లోంచి వెనక్కినెట్టాలని ఇజ్రాయెల్ చాన్నాళ్లుగా ప్రయత్నిస్తోంది. అత్యున్నత సైనిక మండలి ‘జిహాద్ కౌన్సిల్’లో అకీల్ సభ్యుడు. ఏన్నో ఏళ్లుగా అమెరికా వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నాడు. 1983లో బీరుట్‌లోని అమెరికా రాయబార కార్యాలయంలో పేలుళ్లలో అకీల్ పాత్ర ఉందని అమెరికా హోంశాఖ పేర్కొంది. అమెరికన్లు, జర్మన్లను బందీలుగా పట్టుకోవడంలో ముఖ్య భూమిక పోషించాడని తెలిపింది.
హసన్ నస్రల్లా
1992 నుంచి హెజ్‌బొల్లా నాయకుడిగా ఉన్నారు. ఇజ్రాయెల్‌లో పలు యుద్ధాల్లో హెజ్‌బొల్లాకు సారథ్యం వహించారు. లెబనాన్‌లో హెజ్‌బొల్లాను ప్రబల రాజకీయ, సైనికశక్తి తీర్చిదిద్దారు. పశ్చిమాసియాలో పలు ప్రాంతీయ సంఘర్షణల్లో పాలుపంచుకుంటూనే రాజకీయ శక్తి ఎదిగింది. పారామిలటరీ దళంగా రూపుదిద్దుకుంది. 2011లో సిరియా తిరుగుబాటు కాస్తా అంతర్యుద్ధంగా మారింది. సిరియా అధ్యక్షుడు బషర్ అసాద్‌ను అధికారంలో ఉంచడంలో హెజ్‌బొల్లా కీలకపాత్ర పోషించింది.
ఇరాక్, యెమెన్‌లలోనూ (ఇరాన్ అండదండలున్న) సాయుధ తిరుగుబాటు గ్రూపులు తమ శక్తిసామర్థ్యాలను మెరుగుపర్చుకోవడానికి నస్రల్లా సారథ్యంలోని హెజ్‌బొల్లా సాయపడింది. లెబానాన్‌లో నస్రల్లాను ఆరాధించేవారు, విరోధించేవారు సమపాళ్లలో ఉంటారు. 2000 సంవత్సరంలో దక్షిణ లెబానాన్‌కు ఇజ్రాయెల్ నుంచి విముక్తి కల్పించిన హీరోగా మద్దతుదారులు నస్రల్లాను కీర్తిస్తారు. గుట్టలుగా ఆయుధాలను పోగేసుకొని.. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శకులు అంటారు. టెహరాన్ ఎజెండాకు అనుగుణంగా హెజ్‌బొల్లా పనిచేస్తోందని వారి ఆరోపణ.
అలీ కరాకీ
దక్షిణాది వ్యవహారాలకు బాధ్యుడు. హమాస్‌కు మద్దతు, ఇజ్రాయెల్‌పై పోరులో దక్షిణాది దళాలకు నాయకత్వం వహించాడు. హెజ్‌బొల్లా నాయకత్వంలో ముఖ్యుడుని అమెరికా అలీ కరాకీని అభివర్ణించింది. ఇతని గురించి బయటి ప్రపంచానికి తెలిసింది తక్కువే. ఇజ్రాయెల్ బాంబుదాడుల్లో నస్రల్లాతో పాటు చనిపోయాడు.
ఇబ్రహీం కొబైసీ
హెజ్‌బొల్లా క్షిపణి యూనిట్‌కు నాయకుడు. 2000 సంవత్సరంలో ఉత్తర సరిహద్దుల్లో ముగ్గురు ఇజ్రాయెల్ సైనికులను కిడ్నాప్ చేసి హతమార్చడం కొబైసీ పథకరచనే అని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. నాలుగేళ్ల తర్వాత యుద్ధఖైదీల మారి్పడి కిందట ఈ ముగ్గురు సైనికుల మృతదేహాలను హెజ్‌బొల్లా ఇజ్రాయెల్‌కు అప్పగించింది.
మొహమ్మద్ సురౌర్
హెజ్‌బొల్లా డ్రోన్ విభాగం చీఫ్. ఇజ్రాయెల్‌తో గాజాపై విరుచుకుపడ్డాక.. ప్రస్తుత యుద్ధంలో తొలిసారిగా హెజ్‌బొల్లా దాడులకు డ్రోన్లకు వాడింది. సురౌర్ నేతృత్వంలో ఇజ్రాయెల్ లోపలి భూభాగాల్లోకి వెళ్లి.. పేలిపోయే విధంగా డ్రోన్లను వాడారు. అలాగే గూడచర్యానికి కూడా హెజ్‌బొల్లా డ్రోన్లను వినియోగించింది. ఇజ్రాయెల్ ప్రధానంగా హెజ్‌బొల్లా ప్రయోగించే రాకెట్లు, క్షిపణులపై దృష్టి పెట్టగా.. డ్రోన్ల ద్వారా ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలను చేధించి హెజ్‌బొల్లా దాడులు చేసింది.
అహ్మద్ వెహ్‌బే
రాడ్వాన్ ఫోర్సెస్ కమాండర్. రెండు దశాబ్దాల కింద ఈ దళాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి దీన్ని ఉన్నతశ్రేణి దళంగా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించారు. బీరుట్ దక్షిణ శివారులో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో అకీల్‌తో పాటు వెహ్‌బే కూడా మరణించాడు. వీరు తలదాచుకున్న భవనం పూర్తిగా నేలమట్టమైంది.
మిగిలింది వీరే..
అగ్రనాయకత్వంలో అతికొద్ది మంది మిగిలి ఉన్నారు. నస్రల్లా తర్వాతి స్థానంలో ఉన్నది నయీం కస్సెమ్. అత్యంత సీనియర్. 1991 నుంచి హెజ్‌బొల్లాకు డిప్యూటీ లీడర్‌గా ఉన్నారు. హషీం సైఫిద్దీన్ హెజ్‌బొల్లా సెంట్రల్ కౌన్సిల్ అధిపతి. నస్రల్లాకు సోదరుడైన హషీం హెజ్‌బొల్లా సారథ్య బాధ్యతలు చేపడతారని భావిస్తున్నారు. బతికి ఉన్న అగ్రనేతల్లో మరో ఇద్దరు.. తలాల్ హమీహే, అబూ అలీ రెదాలు. వీరిందరిపై ఇజ్రాయెల్ ఇప్పుడు గురిపెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment