ఖుర్రమ్ షజాద్ భట్, రాచిడ్ రెడౌన్
ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా.. దాని వెనక పాక్ హస్తం కనిపించేలాగే ఉంది. గతంలో ముంబై నగరం మీద జరిగిన ఉగ్రదాడి పాక్ పనేనని మన దేశం స్పష్టంగా చెప్పి, సాక్ష్యాలు చూపించింది. అయినా పాక్ కాదంది. ఇప్పుడు లండన్‌లో జరిగిన ఉగ్రదాడిలో కూడా పాక్ హస్తం ఉందని తేలిపోయింది. లండన్ ఉగ్రదాడిలో పాల్గొన్న ముగ్గురిలో ఒకడైన ఖుర్రమ్ షజాద్ భట్ అనే వ్యక్తి 'ద జీహాదీస్ నెక్స్ట్ డోర్' అనే ఒక డాక్యుమెంటరీలో కూడా నటించిన పాకిస్తానీ. ఆ విషయం బ్రిటన్‌కు చెందిన ఎంఐ5 ఇంటెలిజెన్స్ సర్వీస్ వాళ్లు చెప్పారు. పాకిస్తాన్‌లో పుట్టి, లండన్‌లో స్థిరపడిన ఖుర్రమ్‌తో పాటు అతడి ఇద్దరు ఉగ్రవాద సహచరులను పోలీసులు కాల్చి చంపేశారు. శనివారం రాత్రి రద్దీగా ఉన్న మార్కెట్లోకి చొరబడి ఏడుగురిని వీళ్లు చంపిన విషయం తెలిసిందే. కొన్నాళ్లు కేఎఫ్‌సీలోను, మరికొన్నాళ్లు వేరే కంపెనీలలోను ఖుర్రమ్ పనిచేశాడు. గత సంవత్సరం అతడు నటించిన డాక్యుమెంటరీ ప్రసారమైంది.
ప్రస్తుతం నిషేధానికి గురైన అల్-ముహాజిరౌన్ అనే సంస్థ మాజీ అధినేత అంజెమ్ చౌదరితో ఖుర్రమ్‌కు మంచి సంబంధాలు ఉండేవి. ఇస్లామిక్ స్టేట్ జీహాదీలను ప్రోత్సహిస్తున్నందుకు, తన ప్రవచనాలతో యువతను రెచ్చగొడుతున్నందుకు చౌదరికి ఐదున్నరేళ్ల జైలు శిక్ష పడింది. అల్ ముహాజిరౌన్ సంస్థ ప్రవచనాలతో ప్రభావితమైనవారిలో 2005 జూలై నెలలో లండన్ ప్రజారవాణా వ్యవస్థ వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడి 52 మంది మరణానికి కారణమైన వాళ్లు కూడా ఉన్నారు. అలాంటి సంస్థతో ఖుర్రమ్ తిరిగేవాడు.
అయితే.. అతడి ఇంటి చుట్టుపక్కల వాళ్లు మాత్రం ఖుర్రమ్ గురించి చాలా బాగా చెబుతున్నారు. ఏమాత్రం ఆవేశంగా ఉండేవాడు కాదని, కనిపించినప్పుడు హాయ్, బై చెప్పడం తప్ప పెద్దగా మాట్లాడేవాడు కాదని ఆ ప్రాంతంలో డ్రైవింగ్ స్కూలు నడిపే సలాహుదీన్ చెప్పారు. ఖుర్రమ్‌కు కొడుకు, కూతురు ఉన్నారని, వాళ్లను దగ్గరలోని పార్కుకు తీసుకెళ్లి ఫుట్‌బాల్ ఆడేవాడని తెలిపారు. ఖుర్రమ్‌తో పాటు ఉన్న రెండో ఉగ్రవాది పేరు రాచిడ్ రెడౌన్ అని పోలీసులు తెలిపారు. మూడో వ్యక్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు.