im
-
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న ఐఎం చీఫ్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌లోని లుంబినీ పార్క్, గోకుల్ చాట్‌ల్లో 2007 ఆగస్ట్ 25న చోటుచేసుకున్న జంట పేలుళ్ల కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న నిషిద్ధ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) వ్యవస్థాపకుడు అమీర్ రజాఖాన్ పాకిస్థాన్‌లో తలదాచుకున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. ఇతడు ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తన ముఖ కవళికల్నీ మార్చుకున్నట్లు తేల్చాయి. ఉగ్రవాదులుగా పిలిచే ఉగ్ర సోదరులు, 2007 నాటి జంట పేలుళ్ల కేసు నిందితులు రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్‌లను ఉగ్రవాదం వైపు మళ్లించింది సైతం ఇతగాడే. ఫోన్ కాల్స్‌ను ఓ ప్రాంతం నుంచి చేస్తూ మరో ప్రాంతం నుంచి చేస్తున్నట్లు చూపించే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఐరోపా ఖండంలోని దేశాల్లో ఉన్నట్లు దర్యాప్తు సంస్థల్ని తప్పుదోవపట్టిస్తున్నాడని నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇతడు తమ ముఖ కవళికల్ని మార్చుకున్నాడని చెప్పడానికి సంబంధించిన కీలక ఆధారాలను సేకరించిన నిఘా వర్గాలు గాలింపు ముమ్మరం చేశాయి. బెదిరింపుల దందాలో దొరికిన నమూనాలు.. కేంద్ర నిఘా వర్గాలు గతంలోనే పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా పోలీసుల వద్ద నుంచి అమీర్ రజా ఖాన్ గొంతుకు సంబంధించిన నమానాలను సేకరించాయి. అదే నగరానికి చెందిన అమీర్ రజా ఖాన్ అక్కడ నుంచే నేర ప్రస్థానం ప్రారంభించాడు. తన సోదరుడైన ఆసిఫ్ రజా ఖాన్‌తో కలిసి ఆఫ్తాబ్ అన్సారీ గ్యాంగ్‌లో చేరి కిడ్నాప్‌లు, బెదిరించి డబ్బు గుంజడాలు వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడ్డాడు. 2001లో కోల్‌కతాకే చెందిన చెప్పుల తయారీ కర్మాగారం యజమాని ప్రథా రాయ్ బుర్మన్ను కిడ్నాప్ చేస్తానని బెదిరించి భారీగా దండుకున్న ఆరోపణలపై కేసు నమోదైంది. ఈ సందర్భంలోనే అమీర్ రజా ఖాన్ ఫోన్ ద్వారా చేస్తున్న బెదిరింపులను రాయ్ సాంకేతిక పరిజ్ఞానంతో నమోదు చేశారు. వాటిని అప్పట్లోనే కోల్‌కతా నేర దర్యాప్తు విభాగం అధికారులకు అందించారు. అమీర్, ఆసిఫ్‌ల నేర సామ్రాజ్యం గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు విస్తరించడంతో అక్కడా అనేక నేరాలు చేశారు. 2001లోనే రాజ్‌కోట్‌లో పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆసిఫ్ మరణించడంతో అమీర్ పాకిస్థాన్‌కు పారిపోయి ఉగ్రవాద బాటపట్టాడు. ఆసిఫ్ రజా కమెండో ఫోర్స్ (ఏఆర్‌సీఎఫ్) పేరుతో 2002లో కోల్‌కతాలోని అమెరికన్ కేంద్రంపై దాడి చేయించాడు. ఆ తర్వాత దీన్నే ఇండియన్ ముజాహిదీన్‌గా (ఐఎం) మార్చి దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు పాల్పడ్డాడు. వీటిలో నగరంలో జరిగిన జంట పేలుళ్లు కూడా ఒకటి. సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ... అమీర్ రజా పాకిస్థాన్‌లో ఉంటూనే కోల్‌కతాలో తన దందా కొనసాగించాడని నిఘా వర్గాలు చెబుతున్నాయి. 2010లో అక్కడి ఫైవ్‌స్టార్ హోటల్ యజమానిని రూ.20 కోట్లు చెల్లించాలంటూ ఫోన్ ద్వారా బెదిరించాడు. ఈ సందర్భంలోనూ గొంతును బాధితుడు సాంకేతిక పరిజ్ఞానంతో నమోదు చేశారు. భవానీపూర్ పోలీసుస్టేషన్లో నమోదైన ఈ కేసు ఆపై జాతీయ దర్యాప్తు సంస్థకు బదిలీ అయింది. దర్యాప్తులో భాగంగా రాయ్ కేసులో నేర దర్యాప్తు విభాగం వద్ద ఉన్న గొంతు నమూనాలను సేకరించిన జాతీయ దర్యాప్తు సంస్థ అంతర్జాతీయ ఫోన్ సంభాషణలపై నిఘా పెట్టింది. వీటిలో ఒక దాంట్లో అమీర్ రజా ఖాన్ గొంతు చిక్కడంతో లోతుగా ఆరా తీసింది. ఆ ఫోన్ కాలు ఐరోపా ఖండంలో ఉన్న లగ్జెంబర్గ్ నుంచి వచ్చినట్లు నిర్థారించిన జాతీయ దర్యాప్తు సంస్థ ఆ దేశ పోలీసులకు కేసు దర్యాప్తు సహకార విజ్ఞప్తి రాసింది. దీనిపై స్పందించిన ఆ దేశం కూడా దర్యాప్తు చేసి రజా తమ దేశంలో లేడని స్పష్టం చేసింది. మరింత లోతుగా దర్యాప్తు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ పాకిస్థాన్‌లోనే ఉంటున్న అమీర్ రజా ఖాన్ ఫోను సంకేతాల్ని ప్రాంతం మార్పు ద్వారా వ్యవహారాలు సాగిస్తున్నాడని అభిప్రాయపడింది. ఈ కారణంగానే లగ్సెంబర్గ్ వెలుగులోకి వచ్చినట్లు తేల్చింది. దుబాయ్, కరాచీ, నేపాల్ల్లోనూ అతడి కదలికలు ఉన్నట్లు సాంకేతిక పరికరాల నిఘాలో గుర్తించారు. రెండేళ్లలో మారిన కవళికలు.. ఈ వివరాల ఆధారంగా ఆరా తీసిన కేంద్ర నిఘా వర్గాలు అంతర్జాతీయ సంస్థల సహకారంతో అమీర్ కోసం వేట ముమ్మరం చేశాయి. ఫలితంగా 2018లో అమీర్ కదలికల్ని పాకిస్థాన్‌లో ఉన్న బాలాకోట్‌లోని లష్కరే తొయిబా ఉగ్రవాద శిక్షణ శిబిరంలో గుర్తించాయి. అప్పట్లో అక్కడి ఉగ్రవాదులకు ఇతడు శిక్షణ ఇస్తున్నట్లు తేల్చారు. మళ్లీ దాదాపు రెండేళ్ల తర్వాత అమీర్‌కు చెందిన తాజా ఫొటోను కేంద్ర నిఘా వర్గాలు సేకరించగలిగాయి. దీనికి, అప్పటి ఫొటోకు చాలా తేడాలు ఉన్నట్లు తేల్చాయి. గడ్డం, మీసం లేకపోవడంతో పాటు కవళికల్లోనే ఎన్నో తేడాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలోనే ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తన ముఖాన్ని మార్చుకున్నట్లు అనుమానిస్తున్నాయి. దాదాపు ఏడాదిన్నర క్రితం అమీర్ రజా ఖాన్ చనిపోయాడంటూ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ అధికారికంగానే ప్రకటించింది. తాజాగా దొరికిన ఆధారాలు అతడు బతికే ఉన్నాడని స్పష్టం చేస్తున్నాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న అధికారులు దీని వెనుక కొత్త వ్యూహం ఏదైనా ఉందా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. -
ప్రాణం ఖరీదు రూ.888!
సాక్షి, హైదరాబాద్: నగరంలో ‘జంట పేలుళ్ల ’కోసం ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) మాస్టర్‌మైండ్ రియాజ్ భత్కల్ ఖర్చు చేసింది ఎంతో తెలుసా..? అక్షరాల రూ.40 వేలు మాత్రమే. గోకుల్‌చాట్, లుంబినీపార్క్ పేలుళ్లతో పాటు దిల్‌సుఖ్‌నగర్‌లో దొరికిన పేలని బాంబు ఆపరేషన్ వెనుక ఉన్న విషయమిది. 2007 ఆగస్టు 25న చోటు చేసుకున్న ఈ రెండు పేలుళ్లు 45 మందిని పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ లెక్కన సరాసరిన ఒక్కో హత్యకు వీరు రూ.888 చొప్పున ఖర్చు చేశారు. హైదరాబాద్ పేలుళ్ల తర్వాత వీరందరూ ఈ కుట్ర పురుడుపోసుకున్న పుణేలోని అశోక మీవ్స్ అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. అక్కడ ఉంటూనే ఆ నగరంలో కొన్ని కిడ్నాప్‌లు చేయడం ద్వారా ‘మాల్ ఏ ఘనీమఠ్’ సంపాదించాలని కుట్రపన్నారు. మంగళవారం దోషులుగా తేలిన అనీఖ్ షఫీద్ సయ్యద్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరిల వాంగ్మూలాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అనీఖ్‌కు ఇచ్చింది రూ.20 వేలు... పాతబస్తీలోని మక్కా మసీదు పేలుళ్లకు ప్రతీకారంగా నగరాన్ని టార్గెట్ చేయాలని భావించిన రియాజ్ భత్కల్ తన అనుచరుడు అనీఖ్‌ను హైదరాబాద్ పంపాలని నిర్ణయించుకున్నాడు. తొలుత ఫారూఖ్ బంధువైన నవీద్‌ను కలిసి, కంప్యూటర్ శిక్షణ కోసం వచ్చినట్లు చెప్పాలని సూచించాడు. ఆగస్టు 1న అతడికి రూ.20 వేలు ఇచ్చి పంపాడు. సరూర్‌నగర్‌లోని నవీద్ ఇంట్లో కొన్ని రోజులు ఉన్న అనీఖ్ అక్కడి నుంచి పుణే వెళుతున్నట్లు చెప్పి నాంపల్లిలోని ఓ లాడ్జిలో బస చేశాడు. అయితే దాని అద్దె రోజుకు రూ.250 వరకు ఉండటంతో మరుసటి రోజే అజీజియా లాడ్జికి మకాం మార్చాడు. తన పేరు సతీష్ గౌక్వాడ్‌గా చెప్పుకుని రూ.120 అద్దెతో గది తీసుకున్నాడు. ఇక్కడ ఉంటూనే హబ్సిగూడ బంజారా నిలయంలోని ఫ్లాట్ నం.302లో దిగేందుకు యజమానితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. నెలకు రూ.4 వేల అద్దె చెల్లించేందుకు అంగీకరించి రూ.12 వేలు అడ్వాన్స్‌గా ఇచ్చాడు. అక్బర్ తెచ్చింది మరో రూ.6 వేలు... ఫ్లాట్ అద్దెకు తీసుకున్న అనీఖ్ ఈ విషయాన్ని పబ్లిక్ ఫోన్ ద్వారా రియాజ్‌కు చేరవేయడంతో ఆగస్టు 8న అక్బర్‌ను నగరానికి పంపిన రియాజ్... ఖర్చుల కోసం రూ.6 వేలు ఇచ్చాడు. అనీఖ్, అక్బర్ అమీర్‌పేటలోని ధూమ్ టెక్నాలజీస్‌లో హార్డ్‌వేర్ నెట్ వర్కింగ్ కోర్సులో చేరి రూ.5 వేలు చెల్లించారు. అక్బర్.. వినోద్ పాటిల్ పేరుతో చెలామణి అయ్యాడు. భత్కల్ ఆదేశాల మేరకు అనీఖ్ రూ.4 వేలతో కోఠిలో టీవీ కొనుగోలు చేశాడు. రియాజ్ భత్కల్ బంజారా నిలయానికి వచ్చిన తర్వాత అతడి సూచనల మేరకు సికింద్రాబాద్‌లోని రూ.360 వెచ్చించి మూడు బ్యాగులు కొన్నారు. ఆగస్టు 1 నుంచి 27 మధ్య (పేలుళ్ల తర్వాతా ఫ్లాట్‌లోనే రెండు రోజులు ఉన్నాడు) భత్కల్ రెండుసార్లు వచ్చిపోవడానికి, బాంబుల తయారీ, ఇతర ఖర్చులకు మరో రూ.14 వేలు వెచ్చించినట్లు అనీఖ్, అక్బర్ చెప్పుకొచ్చారు. ఇలా మొత్తమ్మీద జంట పేలుళ్ల ఆపరేషన్ పూర్తి చేయడానికి రియాజ్ వెచ్చించింది రూ.40 వేలు. పేలుళ్ల అనంతరం ఆగస్టు 27న అనీఖ్ పుణేకు తిరిగి వెళ్లిపోయాడు. పుణేలో కిడ్నాప్‌లకు కుట్ర... పేలుళ్ల తర్వాత అనీఖ్, అక్బర్, రియాజ్ వేర్వేరుగా పుణే చేరుకున్నారు. ఆ తర్వాత రెండు రోజులకు పుణేలోని అశోక మీవ్స్ అపార్ట్మెంట్లో సమావేశం కాగా, రియాజ్ తన కుట్రను బయటపెట్టాడు. ఉగ్రవాద కార్యకలాపాలకు అవసరమైన డబ్బు (మాల్ ఏ ఘనీమఠ్) కోసం కిడ్నాప్‌లు చేయాలని చెప్పాడు. పుణేలోని ప్రముఖ నిర్మాణ, రియల్ ఎస్టేట్ సంస్థ లుంకడ్ బిల్డర్స్ యజమానిని తొలి టార్గెట్‌గా చేసుకున్నారు. అక్కడి విమాన్‌నగర్‌లో ఉన్న అతడి కార్యాలయం, క్యాంప్ ఏరియాలోని కౌన్సిల్ హాల్ ఔట్‌పోస్ట్‌ల వద్ద రెక్కీ చేసే బాధ్యతలను రియాజ్.. అనీఖ్, అక్బర్‌కే అప్పగించాడు. ఇతడితో పాటు రంక జ్యూవెలర్స్ యజమాని కుమారుడినీ టార్గెట్‌గా చేసుకుని గణేశ్ పేట్‌లోని అతడి కార్యాలయం, మార్షినగర్‌లోని ఇంటి వద్ద సైతం వీరితో రెక్కీ చేయించాడు. ఒక్కొక్కరి వెనుక పక్షం రోజుల పాటు రెక్కీలు చేయించిన రియాజ్ ఆపై హఠాత్తుగా వదిలేయాలంటూ చెప్పాడు. జంట పేలుళ్లతో పాటు పేలని బాంబు కేసులో అనీఖ్, అక్బర్లను మంగళవారం దోషులుగా నిర్ధారించిన న్యాయస్థానం వచ్చే సోమవారం శిక్ష ఖరారు చేయనుంది. -
యాసీన్ భత్కల్‌కు ఎదురుదెబ్బ!
సాక్షి, సిటీబ్యూరో: నిషేధిత దేశవాళీ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) కో–ఫౌండర్ యాసీన్ భత్కల్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో ఉరిశిక్ష పడిన ఇతడికి బెంగళూరు చిన్నస్వామి స్టేడియం పేలుళ్ల కేసులోనూ శిక్షకు ‘మార్గం సుగమమైంది’. యాసీన్ అనుచరులు, ఆ కేసులో సహ నిందితులైన ముగ్గురిని దోషులుగా తేలుస్తూ అక్కడి ప్రత్యేక కోర్టు గత వా రం తీర్పు ఇచ్చింది. దీంతో యాసీన్కూ శిక్ష తప్ప దని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరులతో పాటు అహ్మదాబా ద్, ఢిల్లీ, పుణే, వారణాసి విధ్వంసాలకు సూత్ర« దారిగా ఉన్న ఇతను ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నాడు. 2010లో స్టేడియం బ్లాస్ట్... బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో 2010 ఏప్రిల్ 17న జరిగిన పేలుళ్లలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఐపీఎల్ మ్యాచ్‌ల నేపథ్యంలో ఈ స్టేడియాన్ని టార్గెట్ చేసిన ఐఎం విధ్వంసానికి దిగింది. ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించిన అధికారులు కర్ణాటకలోని భత్కల్ ప్రాంతానికి చెందిన గజ ఉగ్రవాదులైన రియాజ్, ఇక్బాల్ భత్కల్‌ల ఆదేశాల మేరకు వారి సమీప బంధువు యాసీన్ నేతృత్వంలో పేలుళ్లు జరిగినట్లు గుర్తించారు. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు 2011 నవంబర్‌లో ఖతీల్, ఖఫీల్ అక్తర్, ఎజాజ్, హసన్ తదితరులను అరెస్టు చేసి పుణేలోని ఎరవాడ జైల్లో ఉంచింది. వీరి విచారణ నేపథ్యంలో బెంగళూరుకు 60 కిమీ దూరంలో ఉన్న టుమ్కూరులో మొత్తం ఐదు బాంబులను తయారు చేశామని, ఆ ఏడాది ఏప్రిల్ 16 అర్థరాత్రి యాసీన్‌తో పాటు ఖతీల్ వీటిని స్టేడియం చుట్టూ పెట్టారని వెల్లడించారు. మిగిలిన వారిపై అభియోగాలు... యాసీన్ భత్కల్ 2008లో జరిగిన అహ్మదాబాద్ పేలుళ్ల తర్వాత పూర్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో అతడి ఆచూకీ లేని కారణంగా బెంగళూరు పోలీసులు యాసీన్ మినహా మిగిలిన నిందితులపై కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశారు. 2011 వరకు భారత్‌లోనే ఉండి ‘ఆపరేషన్స్’ చేపట్టిన యాసీన్ ఆపై దేశం దాటేశాడు. యునానీ వైద్యుడి ముసుగులో నేపాల్‌లో తలదాచుకుని తన అనుచరుల ద్వారా దేశ వ్యాప్తంగా పేలుళ్ళకు పాల్పడ్డాడు. 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏ–1 మిర్చ్ సెంటర్, 107 బస్టాప్ వద్ద చేసిన జంట పేలుళ్లే ఇతడి ఆఖరి ఆప రేషన్. మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న ‘యాసీన్ అండ్ కో’ చిరవకు 2013 ఆగస్టులో పట్టుబడ్డారు. దీంతో యాసీన్‌పై బెంగళూరు పోలీసులు చిన్నస్వామి స్టేడియం పేలుళ్లకు సంబం«ధించి వేరుగా అభియో గపత్రం దాఖలు చేశారు. ఇతడిపై హైదరాబాద్ కేసులో నేరం నిరూపణై ఉరి శిక్ష కూడా పడింది. వేరుగా అభియోగపత్రం దాఖలు... ఢిల్లీ పేలుళ్ల కేసు విచారణ కోసం అక్కడి పోలీసులు యాసీన్ తదితరులను తీసుకువెళ్లారు. ప్రస్తుతం యాసీన్ భత్కల్ను తీహార్ జైల్లో ఉన్న ఏకాంత కారాగారంలో (సోలిటరీ కన్ఫైన్మెంట్) ఉంచారు. ఓ పక్క ఢిల్లీ సెషన్స్ కోర్టులో అక్కడి పేలుళ్ల కేసు విచారణ సాగుతుండగానే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం పేలుళ్ల కేసు విచారణ సైతం బెంగళూరులోని కోర్టులో సాగింది. దీంతో యాసీన్‌పై మరో అభియోగపత్రం దాఖలు చేశారు. ఇది విచారణలో ఉండగానే గత వారం న్యాయస్థానం మిగిలిని నిందితుల్ని దోషులుగా తేల్చింది. ఖతీల్ 2012లో జైల్లోనే హత్యకు గురికాగా.. మిగిలిన ఖఫీల్, ఎజాజ్, హసన్‌లకు ఏడేళ్ళ చొప్పున జైలు శిక్ష విధించింది. దీంతో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి, విచారణ ఎదుర్కొంటున్న యాసీన్‌ను శిక్ష తప్పదని నిపుణులు చెప్తున్నారు. ఇతడిపై ఉన్న మిగతా కేసుల విచారణ సైతం పూర్తయి, ఇతర ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత మాత్రమే హైదరాబాద్ ఎన్ఐఏ కోర్టు విధించిన ఉరి శిక్ష అమలుకు ఆస్కారం ఉంటుందని తెలిపారు. -
మార్గం సుగమం
► డానిష్ రియాజ్ విచారణకు గ్రీన్ సిగ్నల్ ► గుజరాత్లో చిక్కిన ఐఎం ఉగ్రవాది ఇతడు ► సీసీఎస్ ఆధీనంలోని సిట్‌లోనూ ఒక కేసు సాక్షి, సిటీబ్యూరో: గుజరాత్‌లోని వడోదరలో అరెస్టైన ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాది డానిష్ రియాజ్‌పై నగరంలోని నమోదై ఉన్న కేసు విచారణకు మార్గం సుగమమైంది. 2012లో పీటీ వారెంట్‌పై అరెస్టైన ఇతడిపై నగర పోలీసులు అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. దీన్ని ధ్రువీకరిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో డానిష్‌పై ఉన్న కేసులో అభియోపగపత్రాల దాఖలు, న్యాయస్థానంలో విచారణకు గ్రీన్‌సిగ్నల్ లభించినట్లైంది. ఉగ్రవాద కార్యకలాపాల కోసం బోగస్ వివరాలతో ఓ టెలికం కంపెనీని మోసం చేసిన ఆరోపణలపై అబిడ్స్ ఠాణాలో నమోదైన ఈ కేసు ఆపై సీసీఎస్ ఆధీనంలోని సిట్‌కు బదిలీ అయింది. కేరళ నుంచి హైదరాబాద్‌కు... జార్ఖండ్ రాజధాని రాంచీ సమీపంలోని బరియతు ప్రాంతానికి చెందిన డానిష్ రియాజ్ అసలు పేరు మంజూర్ ఆలం. వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన డానిష్ నిషిద్ధ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమీ) సభ్యుడు. జంట పేలుళ్ల కేసులో వాంటెడ్‌గా ఉన్న ఐఎం మాస్టర్‌మైండ్ రియాజ్ భత్కల్‌తో సంబంధాలు ఏర్పాటు చేసుకుని, క్యాడర్‌కు సన్నిహితుడిగా మారాడు. 2007లో రాంచీ నుంచి మాయమైన ఇతను పట్నా, ముంబై, బెంగళూరుల్లో కొంతకాలం గడిపాడు. కేరళలోని వేగమోన్‌లో 2007 డిసెంబర్లో జరిగిన సిమీ క్యాంప్ నిర్వహణలో కీలకపాత్ర పోషించాడు. ఆ తరువాత హైదరాబాద్‌కు మకాం మార్చి బంజారాహిల్స్ ప్రాంతంలో ఉన్న ఓ సాఫ్ట్వేర్ సంస్థలో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా పని చేస్తూ టోలిచౌకిలోని గుల్షాన్ కాలనీలో షెల్టర్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ నుంచే ‘అహ్మదాబాద్’ ఆపరేషన్ గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లో 2008 జులై 26న జరిగిన పేలుళ్లకు కుట్ర పన్నిన వారిలో డానిష్ కూడా ఒకడు. ఈ కేసులో నిందితులైన ఐఎం ఉగ్రవాదులు అబ్దుల్ సుభాన్ ఖురేషీ అలియాస్ తౌఖీర్, అబ్దుల్ రజాఖ్, ముజీబ్ షేఖ్‌లకు కొంతకాలం పాటు నగరంలోనే ఆశ్రయం కల్పించాడు. ఫేస్బుక్లో ప్రొఫైల్ క్రియేట్ చేసిన డానిష్ దాని సాయంతో అనేక మందిని ఉగ్రవాదం వైపు ఆకర్షించాడు. ఓ వ్యక్తిని కలుసుకోవడానికి 2011 జూన్‌లో డానిష్ సికింద్రాబాద్ నుంచి ‘సికింద్రాబాద్–రాజ్‌కోట్’ ఎక్స్‌ప్రెస్‌లో వడోదర పయనమయ్యాడు. దీనిపై రాష్ట్ర నిఘా వర్గాల ద్వారా సమాచారం అందుకున్న గుజరాత్ డిటెక్టివ్స్ క్రైమ్ బ్రాంచ్ (డీసీబీ) ఆతడిని అరెస్టు చేసింది. విచారణలో ‘అబిడ్స్’ నేరాంగీకారం... అక్కడి అధికారులు డానిష్‌ను విచారించిన నేపథ్యంలోనే ఇక్కడ టెలికం కంపెనీని మోసం చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. డానిష్ నగరంలో ఉన్నప్పుడు ఉగ్రవాద కార్యకలాపాల కోసం సెల్‌ఫోన్ కనెక్షన్ తీసుకోవాలని భావించాడు. అయితే అసలు పేరు వినియోగిస్తే నిఘా వర్గాల దృష్టిలో పడే ప్రమాదం ఉందని భావించిన డానిష్... సయ్యద్ అష్వఖ్ ఇక్బాల్ పేరుతో తయారు చేసిన బోగస్ డాక్యుమెంట్లను సమర్పించి ఆ సంస్థను మోసం చేసి ఫోన్ కనెక్షన్ తీసుకున్నాడు. దీంతో అక్కడి అధికారులు అబిడ్్సలోని కేఎల్కే ఎస్టేట్స్‌లో ఉన్న టెలికం సంస్థకు సమాచారమిచ్చారు. దీని ఆధారంగా టెలికం సంస్థ 2011 సెప్టెంబర్ 2న అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు నిమిత్తం సిట్‌కు బదిలీ చేశారు. -
కరుడుగట్టిన ఉగ్రవాది అరెస్ట్
-
పోలీస్ కస్టడీకి ఐఎం ఉగ్రవాది
న్యూఢిల్లీ: ఆరేళ్ల క్రితం నాటి పేలుళ్ల కేసులో అరెస్టయిన ఇండియన్ ముజాహిద్దీన్ (ఐఎం) సంస్థ ఉగ్రవాది ఫైజాన్ అహ్మద్ సుల్తాన్‌ను స్థానిక న్యాయస్థానం వచ్చే నెల రెండో తేదీదాకా పోలీస్ కస్టడీకి ఆదేశించింది. షార్జానుంచి రప్పించిన ఫైజాన్‌ను ఢిల్లీ పోలీసులు ఈ నెల ఆరంభంలో పోలీసులు అరెస్టుచేసిన సంగతి విదితమే. ఫైజాన్‌ను బుధవారం అదనపు సెషన్స్‌కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి దయాప్రకాశ్ ఐదు రోజులపాటు పోలీస్ కస్టడీలో ఉంచాలంటూ ఆదేశించారు. వరుస పేలుళ్ల కేసుకు సంబంధించి నిందితుడిని ఇంకా విచారించాల్సి ఉందని, అందువల్ల అతడిని తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు చేసిన విన్నపాన్ని మన్నించిన న్యాయమూర్తి పైవిధంగా ఆదేశాలు జారీచేశారు. కాగా వరుస పేలుళ్ల కేసులో నిందితుడిగా అనుమానిస్తున్న 55 ఏళ్ల సుల్తాన్‌ను అంతకుముందు అరెస్టు చేసిన జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) జాతి వ్యతిరేక యుద్ధం అనే మరొక ప్రత్యేక కేసుకు సంబంధించి విచారించింది. ఇదిలాఉంచితే 2008, సెప్టెంబర్ 13నాటి వరుస బాంబు పేలుళ్ల ఘటనకు సంబంధించి ఐఎం సహ వ్యవస్థాపకులు యాసిన్ భత్కల్, రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్లతోపాటు మొత్తం 29 మంది నిందితులపై ప్రత్యేక న్యాయస్థానంలో ఎన్ఐఏ అప్పట్లో అభియోగాలు మోపింది. ఈ కేసుకు సంబంధించి ఇంకా 16 మంది నిందితులు ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. -
మళ్లీ సిమి సెగ!
న్యూఢిల్లీ: ఎన్నో ఉగ్రవాద దాడులతో ప్రమేయమున్న భారత ఇస్లామిక్ విద్యార్థుల ఉద్యమ (సిమి) సంస్థ..ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) సాయంతో మళ్లీ విస్తరణకు యత్నిస్తోందని ఢిల్లీ పోలీసులకు సమాచారం అందింది. పాకిస్థాన్ జాతీయుడు వకాస్ సహా పలువురు ఐఎం సభ్యుల అరెస్టుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఉగ్రవాద కార్యకలాపాల నిర్వహణకు ఇది నిధులు సేకరిస్తున్నట్టు నిఘా వర్గాలు గ్రహించాయి. ఢిల్లీ సహా భారత్‌లోని పలు ప్రాంతాల్లో మళ్లీ కార్యకలాపాలు మొదలుపెట్టడానికి సిమి ప్రయత్నిస్తోందని జియా ఉర్ రెహమాన్ ఎలియాస్ వకాస్ పోలీసుల విచారణలో వెల్లడిం చారు. ప్రస్తుతం ఢిల్లీ పోలీసుల కస్టడీలోనే ఉన్న ఇతడు, సిమిలో చురుగ్గా పని చేస్తున్న వారి వివరా లు కూడా వెల్లడించినట్టు తెలుస్తోంది. ప్రత్యేక ఉగ్రవాద స్థాపనకు నిధుల కోసం బ్యాంకులను దోపిడీ చేయాలంటూ ముస్లిం యువకులను ప్రేరేపించిన సిమి సభ్యుడు అబూ ఫైజల్ ఎలియాస్ ‘డాక్టర్’తోనూ వకాస్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు బయటపడింది. ‘డాక్టర్’ ఇది వరకే మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు నుంచి ఐదుగురు సిమి కార్యకర్తలతోపాటు తప్పించుకున్నాడు. ఇతణ్ని పోలీసులు తిరిగి గత డిసెంబర్లో అరెస్టు చేశారు. మిగతా ఐదుగురు మాత్రం ఇప్పటికీ దొరకలేదు. జైలు నుంచి తప్పించుకోవాలన్న కుట్రకు కూడా ఇతడే సూత్రధారని విచారణలో వెల్లడయింది. ఉగ్రవాద సంస్థకు నిధుల కోసం ‘డాక్టర్’ బృందం నర్మదలోని గ్రామీణబ్యాంకులో 2009లో దోపిడీ జరిపింది. దేవస్, ఇటార్సీ బ్యాంకు దోపిడీలతోనూ ఇతనికి సంబంధం ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఇతడు ఢిల్లీలో ఎటువంటి దాడులకూ పాల్పడకపోయినా, ఉగ్రవాద సంస్థలకు ఇతడు నిధులు సమకూర్చాడని స్థానిక పోలీసులు చెబుతున్నారు. 2011లో అరెస్టు కాకముందు ‘డాక్టర్’ ఐంఎ సభ్యులతో సన్నిహితంగా మెలిగాడు. పాక్ నుంచి ప్రోత్సాహం నిర్బంధం కారణంగా చెల్లాచెదురైన సిమి కార్యకర్తలంతా తిరిగి ఒక్కటయ్యేందుకు చర్యలు తీసుకోవాలని పాక్‌లోని ఐఎం అగ్రనాయకులు భారత్‌లోని తమ రహస్య సభ్యులకు సూచించినట్టు తెలిసింది. ఇలా మళ్లీ సంఘటితంగా మారిన సిమి కార్యకర్తలు బ్యాంకు దోపిడీలకు పునఃప్రారంభిస్తారని దర్యాప్తు సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. 2010కి ముందు సిమి కార్యకర్తలు దక్షిణాది రాష్ట్రాల్లో పలుచోట్ల బ్యాంకు దోపిడీలకు పాల్పడ్డారు. ‘గతంలో సిమిలో పనిచేసిన వారందరితోనూ ఐఎం కార్యకర్తలు మళ్లీ సంప్రదింపులు జరుపుతున్నారు. సంస్థ లో చేరాల్సిందిగా ముస్లిం యువతను ప్రోత్సహిస్తున్నారు. పేద కుటుంబాలకు చెందిన వారిపై ఎక్కువ గా దృష్టి సారిస్తున్నారు’ అని ఢిల్లీ పోలీసు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఖాండ్వా జైలు నుంచి తప్పించుకున్న ఐజాజుద్దీన్, అస్లాం, జాకీర్ హుస్సే న్, షేక్ మెహబూబ్, ఇక్రార్ను మళ్లీ అరెస్టు చేయడానికి ఢిల్లీ పోలీసులు నిఘా సంస్థల సాయంతో ప్రత్యేకంగా గాలిస్తున్నారు. ఈ ఐదుగురు మహా రాష్ట్ర, మధ్యప్రదేశ్ వాసులని తేలింది. ఈ విషయ మై మరింత సమాచారం సేకరించేందుకు ఢిల్లీ పోలీసు స్పెషల్‌సెల్ వకాస్‌ను తన కస్టడీలోకి తీసుకుంది. సిమి 1977లో అలీగఢ్‌లో ఏర్పాటయింది. 2002లో సిమిని నిషేధించకముందు మధ్యప్రదేశ్‌లోని అన్ని జిల్లాలు, ముఖ్యప్రాంతాల్లో దీనికి కార్యకర్తలు, కార్యాలయాలు ఉండేవి. ఇస్లామిక్ మతప్రచారం, ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడం దీని ప్రధాన లక్ష్యాలు. సిమి అధ్యక్షుడు షహీద్ ఫలాహీ 9/11 దాడుల కేసులో అరెస్టు కావడంతో నిఘా వర్గాలు దీనిపై దృష్టి సారించాయి. నిషేధం తరువాత 1,200 మంది కార్యకర్తలను అరెస్టు చేశారు. 2010లో ఏర్పడిన ఐఎం సిమి అనుబంధ సంస్థేనని పోలీసులు అంటున్నారు. పలు పేలుళ్ల ఘటనలతో సిమి, ఐఎంకు సంబంధాలు ఉన్నట్టు తేల్చారు. సిమి కార్యకర్త అరెస్టు భోపాల్: సిమిలో కీలక సభ్యుడిగా వ్యవహరిస్తున్న గుల్రేజ్ అలీని మధ్యప్రదేశ్ ఉగ్రవాద వ్యతిరేక దళం పోలీసులు భోపాల్ రైల్వే స్టేషన్లో ఆదివారం అరెస్టు చేశారు. విశేషమేమంటే ఢిల్లీ పోలీసులు ‘డాక్టర్’ను (అబూ ఫైజల్) ఆదివారమే భోపాల్‌కు తీసుకెళ్లారు. ఇతణ్ని తిరిగి తీసుకెళ్లడానికి అక్కడ వేచిచూస్తున్న ఏటీఎస్ పోలీసులకు అలీ కనిపించాడు. ఇతనిపై రూ.15 వేల రివార్డు కూడా ఉంది. నిందితుడికి స్థానిక కోర్టు మే ఐదు వరకు పోలీసు కస్టడీ విధించింది. అలీపై ఇది వరకే పలు కేసులు నమోదయ్యాయి. -
ఐఎం చీఫ్ అక్తర్ అరెస్ట్