సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌లోని లుంబినీ పార్క్, గోకుల్ చాట్‌ల్లో 2007 ఆగస్ట్ 25న చోటుచేసుకున్న జంట పేలుళ్ల కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న నిషిద్ధ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) వ్యవస్థాపకుడు అమీర్ రజాఖాన్ పాకిస్థాన్‌లో తలదాచుకున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. ఇతడు ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తన ముఖ కవళికల్నీ మార్చుకున్నట్లు తేల్చాయి. ఉగ్రవాదులుగా పిలిచే ఉగ్ర సోదరులు, 2007 నాటి జంట పేలుళ్ల కేసు నిందితులు రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్‌లను ఉగ్రవాదం వైపు మళ్లించింది సైతం ఇతగాడే. ఫోన్ కాల్స్‌ను ఓ ప్రాంతం నుంచి చేస్తూ మరో ప్రాంతం నుంచి చేస్తున్నట్లు చూపించే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఐరోపా ఖండంలోని దేశాల్లో ఉన్నట్లు దర్యాప్తు సంస్థల్ని తప్పుదోవపట్టిస్తున్నాడని నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇతడు తమ ముఖ కవళికల్ని మార్చుకున్నాడని చెప్పడానికి సంబంధించిన కీలక ఆధారాలను సేకరించిన నిఘా వర్గాలు గాలింపు ముమ్మరం చేశాయి.
బెదిరింపుల దందాలో దొరికిన నమూనాలు..
కేంద్ర నిఘా వర్గాలు గతంలోనే పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా పోలీసుల వద్ద నుంచి అమీర్ రజా ఖాన్ గొంతుకు సంబంధించిన నమానాలను సేకరించాయి. అదే నగరానికి చెందిన అమీర్ రజా ఖాన్ అక్కడ నుంచే నేర ప్రస్థానం ప్రారంభించాడు. తన సోదరుడైన ఆసిఫ్ రజా ఖాన్‌తో కలిసి ఆఫ్తాబ్ అన్సారీ గ్యాంగ్‌లో చేరి కిడ్నాప్‌లు, బెదిరించి డబ్బు గుంజడాలు వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడ్డాడు. 2001లో కోల్‌కతాకే చెందిన చెప్పుల తయారీ కర్మాగారం యజమాని ప్రథా రాయ్ బుర్మన్‌ను కిడ్నాప్ చేస్తానని బెదిరించి భారీగా దండుకున్న ఆరోపణలపై కేసు నమోదైంది. ఈ సందర్భంలోనే అమీర్ రజా ఖాన్ ఫోన్ ద్వారా చేస్తున్న బెదిరింపులను రాయ్ సాంకేతిక పరిజ్ఞానంతో నమోదు చేశారు. వాటిని అప్పట్లోనే కోల్‌కతా నేర దర్యాప్తు విభాగం అధికారులకు అందించారు. అమీర్, ఆసిఫ్‌ల నేర సామ్రాజ్యం గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు విస్తరించడంతో అక్కడా అనేక నేరాలు చేశారు. 2001లోనే రాజ్‌కోట్‌లో పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆసిఫ్ మరణించడంతో అమీర్ పాకిస్థాన్‌కు పారిపోయి ఉగ్రవాద బాటపట్టాడు. ఆసిఫ్ రజా కమెండో ఫోర్స్ (ఏఆర్‌సీఎఫ్) పేరుతో 2002లో కోల్‌కతాలోని అమెరికన్ కేంద్రంపై దాడి చేయించాడు. ఆ తర్వాత దీన్నే ఇండియన్ ముజాహిదీన్‌గా (ఐఎం) మార్చి దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు పాల్పడ్డాడు. వీటిలో నగరంలో జరిగిన జంట పేలుళ్లు కూడా ఒకటి.
సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ...
అమీర్ రజా పాకిస్థాన్‌లో ఉంటూనే కోల్‌కతాలో తన దందా కొనసాగించాడని నిఘా వర్గాలు చెబుతున్నాయి. 2010లో అక్కడి ఫైవ్‌స్టార్ హోటల్ యజమానిని రూ.20 కోట్లు చెల్లించాలంటూ ఫోన్ ద్వారా బెదిరించాడు. ఈ సందర్భంలోనూ గొంతును బాధితుడు సాంకేతిక పరిజ్ఞానంతో నమోదు చేశారు. భవానీపూర్ పోలీసుస్టేషన్‌లో నమోదైన ఈ కేసు ఆపై జాతీయ దర్యాప్తు సంస్థకు బదిలీ అయింది. దర్యాప్తులో భాగంగా రాయ్ కేసులో నేర దర్యాప్తు విభాగం వద్ద ఉన్న గొంతు నమూనాలను సేకరించిన జాతీయ దర్యాప్తు సంస్థ అంతర్జాతీయ ఫోన్ సంభాషణలపై నిఘా పెట్టింది. వీటిలో ఒక దాంట్లో అమీర్ రజా ఖాన్ గొంతు చిక్కడంతో లోతుగా ఆరా తీసింది. ఆ ఫోన్ కాలు ఐరోపా ఖండంలో ఉన్న లగ్జెంబర్గ్ నుంచి వచ్చినట్లు నిర్థారించిన జాతీయ దర్యాప్తు సంస్థ ఆ దేశ పోలీసులకు కేసు దర్యాప్తు సహకార విజ్ఞప్తి రాసింది. దీనిపై స్పందించిన ఆ దేశం కూడా దర్యాప్తు చేసి రజా తమ దేశంలో లేడని స్పష్టం చేసింది. మరింత లోతుగా దర్యాప్తు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ పాకిస్థాన్‌లోనే ఉంటున్న అమీర్ రజా ఖాన్ ఫోను సంకేతాల్ని ప్రాంతం మార్పు ద్వారా వ్యవహారాలు సాగిస్తున్నాడని అభిప్రాయపడింది. ఈ కారణంగానే లగ్సెంబర్గ్ వెలుగులోకి వచ్చినట్లు తేల్చింది. దుబాయ్, కరాచీ, నేపాల్‌ల్లోనూ అతడి కదలికలు ఉన్నట్లు సాంకేతిక పరికరాల నిఘాలో గుర్తించారు.
రెండేళ్లలో మారిన కవళికలు..
ఈ వివరాల ఆధారంగా ఆరా తీసిన కేంద్ర నిఘా వర్గాలు అంతర్జాతీయ సంస్థల సహకారంతో అమీర్ కోసం వేట ముమ్మరం చేశాయి. ఫలితంగా 2018లో అమీర్ కదలికల్ని పాకిస్థాన్‌లో ఉన్న బాలాకోట్‌లోని లష్కరే తొయిబా ఉగ్రవాద శిక్షణ శిబిరంలో గుర్తించాయి. అప్పట్లో అక్కడి ఉగ్రవాదులకు ఇతడు శిక్షణ ఇస్తున్నట్లు తేల్చారు. మళ్లీ దాదాపు రెండేళ్ల తర్వాత అమీర్‌కు చెందిన తాజా ఫొటోను కేంద్ర నిఘా వర్గాలు సేకరించగలిగాయి. దీనికి, అప్పటి ఫొటోకు చాలా తేడాలు ఉన్నట్లు తేల్చాయి. గడ్డం, మీసం లేకపోవడంతో పాటు కవళికల్లోనే ఎన్నో తేడాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలోనే ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తన ముఖాన్ని మార్చుకున్నట్లు అనుమానిస్తున్నాయి. దాదాపు ఏడాదిన్నర క్రితం అమీర్ రజా ఖాన్ చనిపోయాడంటూ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ అధికారికంగానే ప్రకటించింది. తాజాగా దొరికిన ఆధారాలు అతడు బతికే ఉన్నాడని స్పష్టం చేస్తున్నాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న అధికారులు దీని వెనుక కొత్త వ్యూహం ఏదైనా ఉందా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment