మార్గం సుగమం | clearance for interagation | Sakshi
Sakshi News home page

మార్గం సుగమం

Published Mon, Feb 6 2017 9:09 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM

మార్గం సుగమం - Sakshi

మార్గం సుగమం

  ► డానిష్‌ రియాజ్‌ విచారణకు గ్రీన్‌ సిగ్నల్‌
  ► గుజరాత్‌లో చిక్కిన ఐఎం ఉగ్రవాది ఇతడు
  ► సీసీఎస్‌ ఆధీనంలోని సిట్‌లోనూ ఒక కేసు
 
సాక్షి, సిటీబ్యూరో:  గుజరాత్‌లోని వడోదరలో అరెస్టైన ఇండియన్ ముజాహిదీన్‌ (ఐఎం) ఉగ్రవాది డానిష్‌ రియాజ్‌పై నగరంలోని నమోదై ఉన్న కేసు విచారణకు మార్గం సుగమమైంది. 2012లో పీటీ వారెంట్‌పై అరెస్టైన ఇతడిపై నగర పోలీసులు అన్‌లాఫుల్‌ యాక్టివిటీస్‌ ప్రివెన్షన్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. దీన్ని ధ్రువీకరిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో డానిష్‌పై ఉన్న కేసులో అభియోపగపత్రాల దాఖలు, న్యాయస్థానంలో విచారణకు గ్రీన్‌సిగ్నల్‌ లభించినట్‌లైంది. ఉగ్రవాద కార్యకలాపాల కోసం బోగస్‌ వివరాలతో ఓ టెలికం కంపెనీని మోసం చేసిన ఆరోపణలపై అబిడ్స్‌ ఠాణాలో నమోదైన ఈ కేసు ఆపై సీసీఎస్‌ ఆధీనంలోని సిట్‌కు బదిలీ అయింది.
కేరళ నుంచి హైదరాబాద్‌కు...
జార్ఖండ్‌ రాజధాని రాంచీ సమీపంలోని బరియతు ప్రాంతానికి చెందిన డానిష్‌ రియాజ్‌ అసలు పేరు మంజూర్‌ ఆలం. వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయిన డానిష్‌ నిషిద్ధ స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా (సిమీ) సభ్యుడు. జంట పేలుళ్ల కేసులో వాంటెడ్‌గా ఉన్న ఐఎం మాస్టర్‌మైండ్‌ రియాజ్‌ భత్కల్‌తో సంబంధాలు ఏర్పాటు చేసుకుని, క్యాడర్‌కు సన్నిహితుడిగా మారాడు. 2007లో రాంచీ నుంచి మాయమైన ఇతను పట్నా, ముంబై, బెంగళూరుల్లో కొంతకాలం గడిపాడు. కేరళలోని వేగమోన్‌లో 2007 డిసెంబర్‌లో జరిగిన సిమీ క్యాంప్‌ నిర్వహణలో కీలకపాత్ర పోషించాడు. ఆ తరువాత హైదరాబాద్‌కు మకాం మార్చి బంజారాహిల్స్‌ ప్రాంతంలో ఉన్న ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్‌గా పని చేస్తూ టోలిచౌకిలోని గుల్షాన్‌ కాలనీలో షెల్టర్‌ ఏర్పాటు చేసుకున్నాడు. 
 
ఇక్కడ నుంచే ‘అహ్మదాబాద్‌’ ఆపరేషన్‌
గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్‌లో 2008 జులై 26న జరిగిన పేలుళ్లకు కుట్ర పన్నిన వారిలో డానిష్‌ కూడా ఒకడు. ఈ కేసులో నిందితులైన ఐఎం ఉగ్రవాదులు అబ్దుల్‌ సుభాన్‌ ఖురేషీ అలియాస్‌ తౌఖీర్, అబ్దుల్‌ రజాఖ్, ముజీబ్‌ షేఖ్‌లకు కొంతకాలం పాటు నగరంలోనే ఆశ్రయం కల్పించాడు.  ఫేస్‌బుక్‌లో ప్రొఫైల్‌ క్రియేట్‌ చేసిన డానిష్‌ దాని సాయంతో అనేక మందిని ఉగ్రవాదం వైపు ఆకర్షించాడు. ఓ వ్యక్తిని కలుసుకోవడానికి 2011 జూన్‌లో డానిష్‌ సికింద్రాబాద్‌ నుంచి ‘సికింద్రాబాద్‌–రాజ్‌కోట్‌’ ఎక్స్‌ప్రెస్‌లో వడోదర పయనమయ్యాడు. దీనిపై రాష్ట్ర నిఘా వర్గాల ద్వారా సమాచారం అందుకున్న గుజరాత్‌ డిటెక్టివ్స్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ (డీసీబీ) ఆతడిని అరెస్టు చేసింది.
 
విచారణలో ‘అబిడ్స్‌’ నేరాంగీకారం... 
అక్కడి అధికారులు డానిష్‌ను విచారించిన నేపథ్యంలోనే ఇక్కడ టెలికం కంపెనీని మోసం చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. డానిష్‌ నగరంలో ఉన్నప్పుడు ఉగ్రవాద కార్యకలాపాల కోసం సెల్‌ఫోన్‌ కనెక్షన్‌ తీసుకోవాలని భావించాడు. అయితే అసలు పేరు వినియోగిస్తే నిఘా వర్గాల దృష్టిలో పడే ప్రమాదం ఉందని భావించిన డానిష్‌... సయ్యద్‌ అష్వఖ్‌ ఇక్బాల్‌ పేరుతో తయారు చేసిన బోగస్‌ డాక్యుమెంట్లను సమర్పించి ఆ సంస్థను మోసం చేసి ఫోన్‌ కనెక్షన్‌ తీసుకున్నాడు. దీంతో అక్కడి అధికారులు అబిడ్‌్సలోని కేఎల్‌కే ఎస్టేట్స్‌లో ఉన్న టెలికం సంస్థకు సమాచారమిచ్చారు. దీని ఆధారంగా టెలికం సంస్థ 2011 సెప్టెంబర్‌ 2న అబిడ్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు నిమిత్తం సిట్‌కు బదిలీ చేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement