బంగ్లాదేశ్ నుంచి బీహార్ మీదుగా కోలారు జిల్లాలో, ఆ తరువాత రామనగరలో మకాం వేసి నిఘావర్గాలకు దొరికిపోయిన అనుమానిత ఉగ్రవాది మునీర్ షేక్ ఉదంతం ఎన్నో ప్రశ్నలను సంధిస్తోంది. కర్ణాటకలో ఉగ్రవాదుల స్లీపర్ సెల్స్ విస్తరిస్తున్నాయనే అనుమానాలు మునీర్ అరెస్టుతో బలపడుతున్నాయి. ఈ వ్యవహారం విచారణలో మరిన్ని కోణాలు బయటపడే అవకాశముంది.
దొడ్డబళ్లాపురం: రామనగర పట్టణంలో ఆదివారంరాత్రి ఎన్‌ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో అరెస్టుచేసిన అనుమానిత ఉగ్రవాది మునీర్ గురించి విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. మునీర్ బంగ్లాదేశ్ వాసి అని, భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించాడని తెలుస్తోంది. మునీర్‌కు ఆధార్ కార్డు కూడా ఉండడం విశేషం. ఇది బీహార్‌లో తీసుకున్నాడా?, లేక కర్ణాటకలోనా? అన్నది వెల్లడికాలేదు. రామనగరలో ఇల్లు అద్దెకు ఇచ్చే సమయంలో ఇంటి యజమాని రఫీక్‌ఖాన్... మునీర్ నుండి ఆధార్‌కార్డ్ తీసుకున్నాడు, అయితే ఇటీవలే రైలు టికెట్ బుక్ చేయాలని సాకు చెప్పి మునీర్ ఆధార్‌కార్డు వెనక్కు తీసుకున్నాడట. రూ.50వేలు అడ్వాన్స్ అడగ్గా సగమే ఇవ్వడంతో ఇంటి యజమాని మునీర్‌కు అగ్రిమెంట్ చేసి ఇవ్వలేదు. ఖాన్‌కు మునీర్‌ను పరిచయం చేసింది ఒక మహిళని తేలింది. ఇప్పుడు ఆ మహిళ గురించి ఐబీ అధికారులు సీరియస్‌గా విచారణచేస్తున్నారు. మునీర్‌కు ఆమెకు సంబంధమేంటి? అది ఎటువంటి సంబంధం? ఆమెకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయా? అనే కోణాల్లో తనిఖీ చేస్తున్నారు. మునీర్ కోసం అనేక రోజుల నుండి ఐబీ అధికారులు గాలిస్తున్నారు. చివరకు రామనగరలో తలదాచుకున్నట్టు తేలడంతో దాడి జరిపి అరెస్టు చేశారు.
జేఎంబీ, ఐఎంలతో సంబంధాలు
బీహార్‌లోని జమాపూర్ జిల్లా షక్రువిటా గ్రామవాసిగా చెప్పుకునే బుర్హాన్ అలియాస్ బంగ్లాదేశ్‌లోని మునీర్ షేక్ జమాతుల్ ముజాహిదీన్ (జేఎంబీ), ఇండియన్ ముజాహిద్దీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థల్లో సభ్యుడు. బీహార్లో పోలీస్ కస్టడీలో ఉండగా పోలీసుల పై దాడిచేసి పరారయ్యాడు. బీహార్‌లోని పాట్నా జిల్లా బోధ్ గయాలో 2013లో జరిగిన వరుస పేలుళ్లకు, పశ్చిమ బెంగాల్‌లోని బర్ధమాన్‌లో 2014లో జరిగిన బాంబు పేలుడుకు ఐఈడీ బాంబులు తయారుచేసి ఇచ్చింది మునీర్‌గా తెలిసింది.
తొలుత కోలారు జిల్లాలో మకాం
బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్‌లోకి వచ్చి బీహార్‌లో మకాం వేశాడు. బోధ్ గయా, బర్ధమాన్ బాంబ్ పేలుళ్ల తరువాత కోలారు జిల్లా మాలూరుకు మకాం మార్చాడు. అక్కడొక ప్రైవేటు కంపెనీలో హెల్పర్‌గా పనిచేసి అనంతరం రెండునెలల క్రితం రామనగరకు వచ్చాడు. మునీర్ చుట్టుపక్కల వారితో మాట్లాడేవాడు కాదు. సైకిల్‌పై ఊరూరూ తిరుగుతూ బట్టలు అమ్మేవాడు. ఉదయం 8 గంటలకు ఇల్లువదిలితే సాయంత్రం తిరిగి వచ్చేవాడు. అతని ఇంటికి ఎవ్వరూ బంధుమిత్రులు వచ్చేవారు కాదని ఇంటి యజమాని రఫీక్ చెబుతున్నాడు. మునీర్ భార్య, 3 ఏళ్ల కొడుకు, ఏడాది వయసున్న కూతురుతో నివసిస్తున్నాడు. బాడుగ ఇళ్ల బ్రోకర్‌గా భావిస్తున్న మహిళతో మునీర్ మొదట ఒక్కడే వచ్చి ఇల్లు చూశాడు. ఫ్యామిలీకి మాత్రమే ఇల్లు ఇస్తామనడంతో భార్యాపిల్లలను తీసుకొచ్చాడు. మునీర్ ఇంట్లో ఐబీ అధికారులు ఇండియా, కర్ణాటక మ్యాప్‌లు, ప్రముఖ పర్యాటక స్థలాల వివరాలు, రెండు ల్యాప్‌టాప్‌లు, జిలెటిన్ బాక్స్ స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment