స.హ. చట్టంతో ప్రశ్నించే హక్కు
- సామాన్యుల్లో అవగాహన రాహిత్యం
- అమలు తీరులో లోపాలు
- స.హ. చట్టం కమిషనర్ తాంతియాకుమారి
విశాఖపట్నం: ఏ సమాచారాన్నయినా ఎప్పుడైనా ఎవరైనా తెలుసుకునే అవకాశం సమాచార హక్కు చట్టం కల్పించింది. సామాన్యుడు సైతం సమాజంలో ఏం జరుగుతుందో అధికారులను ప్రశ్నించే వెసులుబాటు కల్పిస్తూ 2005లో వచ్చిన ఈ చట్టం తొలినాళ్లలో అధికారుల గుండెల్లో గుబులు రేపింది. రానురాను ఈ చట్టం మిగతా చట్టాల్లాగా సామాన్య మధ్యతరగతి వారికి న్యాయం చేయలేక పోయింది. ఈ చట్టం అమలులోకి వచ్చి అక్టోబర్ 12 నాటికి తొమ్మిదేళ్లయిన సందర్భంగా చట్టం అమలు తీరు లోపాలు గురించి సమాచార హక్కు చట్టం కమిషనర్ తాంతియాకుమారితో ముఖాముఖి..
సమాచారహక్కు చట్టం వచ్చిన తొమ్మిదేళ్లలో ఎన్ని కేసులు వచ్చాయి, ఎన్ని పరిష్కారమయ్యాయి?
ఈ తొమ్మిదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 4వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అప్పీళ్లకు వచ్చిన వాటి ని పరిష్కరించేందుకు సాధ్యమైనంత వరకూ కృషి చేస్తున్నాం. సమస్య పరిష్కారంమయ్యేలా చూస్తున్నాం.
చట్టంపై చైతన్యం ఎంతవరకూ వచ్చింది?
చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం గ్రామాల్లో అవగాహన సదస్సులు, ప్రచారం నిర్వహించాలి. అది ఎక్కడా జరగడంలేదు. అధికారులు నిర్లక్ష్యం పూర్తిగా కనబడుతోంది.
జిల్లా, మండల స్థాయిలో కమిటీలు ఉన్నాయా?
ప్రతి జిల్లాకు మోనటరింగ్ కమిటీలు ఉండాలి. కలెక్టర్, పోలీస్ కమిషనర్/ఎస్పీ, డీఆర్‌ఓతో పాటు ఇద్దరు జర్నలిస్టులు, ఇద్దరు స్వచ్ఛంద సంస్థల సభ్యులు, ఇద్దరు కార్యకర్తలతో జిల్లా కమిటీ ఉండాలి. ఇంతవరకూ ఎక్కడా ఈ కమిటీలు వేయలేదు. సరికదా ఈ చట్టం పై కలెక్టర్లు దృష్టి పెట్టడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఈ చట్టంపై అవగాహన లేదు.
రాష్ట్ర స్థాయిలో చట్టం అమలు తీరు ఎలా ఉంది?
ఈ చట్టం అమలులో అనేక లోపాలున్నాయి. సక్రమంగా అమలు చేసేందుకు కావాల్సిన సిబ్బంది లేరు. ఫిర్యాదులు స్టోర్ చేసుకునేందుకు కంప్యూటర్లు లేవు. ఉన్న సిబ్బందికి ఆరు నెలలుగా జీతాలు లేవు. ఇలా అయితే అమలు చేయడం కష్టం కదా.
ఫిర్యాదుదారులు, అధికారులు హైదరాబాద్ రావడానికి ఇబ్బందులు పడుతున్నారు...
సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కారం కావాలంటే ఆర్టీఐ హియరింగ్ బెంచ్‌లు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం అందుకు సుముఖంగా లేదు. ప్రజా సమస్యలు పరిష్కరించాలంటే ప్రజల మధ్యనే చేయాలి. మేం పోరాడుతున్నది అవినీతి మీద . ఆ అవినీతి అధికారులను, ప్రజాప్రతినిధులను ప్రజల మధ్య నిలబెట్టి సమస్య పరిష్కారం చేస్తే గొడవలు అవుతాయి. మాకు రక్షణ ఉండదు. ఇంతవరకూ నాకు గన్‌మెన్ కూడా ఇవ్వలేదు.
సమాచారానికి కట్టే డబ్బులును అధికారులు వాడుకుంటున్నారనే అపవాదు ఉంది.
పౌరులు, ధరఖాస్తుదారులు సమాచారానికి కట్టే డబ్బులు ఖచ్చితంగా ఆర్టీఐ ఖాతాలోకే చేరాలి. రూపాయి అయినా సరే అధికారులు చలానా తీసి ఆర్టీఐ ఎకౌంట్ కు జమచేయాలి. అంతేతప్ప ఆ డబ్బులను జనరల్‌గా వాడుకునేందుకు అధికారులకు హక్కు లేదు.
జిల్లాల్లో మీ పర్యటనలు ఎవరు నిర్ణయిస్తారు, మీ ప్రొటోకాల్ ఎవరు ప్రిపేర్ చేస్తారు?
జిల్లాల్లో పర్యటనలు మేమే నిర్ణయించుకుంటాం. ఆయా జిల్లాలకు వెళ్లేటప్పుడు జిల్లా కలెక్టర్ తప్పకుండా కలిసి ప్రొగ్రాం ఫిక్స్ చేయాలి. ప్రొటోకాల్ ప్రకారం వచ్చి నన్ను కలవాలి. ఆయన లేకపోతే డీఆర్‌ఓదే బాధ్యత.