టీటీడీ ఆర్టీఐ పరిధిలోకి వస్తుంది: మాడభూషి శ్రీధర్
హైదరాబాద్, న్యూస్‌లైన్: తిరుమల తిరుపతి దేవస్థానం సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందని కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ చెప్పారు. టీటీడీ ప్రజల ధనంతోనే నడుస్తుంది కాబట్టి ప్రభుత్వ పరిధిలోకే వస్తుందన్నారు. ఆర్టీఐ రాకముందే టీటీడీలో అవకతవకలపై తాను ఒక పత్రికలో పనిచేస్తున్నప్పుడు వార్తలు రాయగా, అధికారులు కేసులు వేశారన్నారు. కోర్టు ద్వారా టీటీడీలోని పత్రాలను తీసుకొని అవకతవకలను నిరూపిం చినట్లు తెలిపారు.
సోమవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో వెటరన్ జర్నలిస్టు అసోసియేషన్, హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో ‘సింపోసియం ఆన్ ఆర్టీఐ యాక్ట్ అండ్ జర్నలిస్ట్స్’ అంశంపై సదస్సు నిర్వహించారు. దీనికి మాడభూషి, రాష్ట్ర సమాచార కమిషనర్ విజయబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాడభూషి మాట్లాడుతూ ఆర్టీఐ అమలులో మీడియా పాత్రే కీలకమన్నారు. సమావేశంలో వెటరన్ జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు వరదాచారి, భండారి శ్రీని వాస్, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు రవికాంత్‌రెడ్డి పాల్గొన్నారు.