ఏలూరు (పశ్చిమ గోదావరి) : రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సమాచార హక్కు చట్టం ప్రజలకు పూర్తిస్థాయిలో ఉపయోగపడటం లేదని ఆ చట్టం కమిషనర్ పసుపులేటి విజయబాబు అభిప్రాయపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సమాచార హక్కు చట్టానికి ప్రభుత్వమే తూట్లు పొడుస్తోందని అసహనం వ్యక్తం చేశారు. పదేళ్లనాటి చట్టానికి నేటికీ పూర్తిస్థాయిలో సిబ్బంది లేరని, నిధులు సైతం విడుదల కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర దాటుతున్నా ఇప్పటికీ ప్రిన్సిపల్ సెక్రటరీ, ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన హై పవర్ కమిటీ సమావేశం జరగలేదని చెప్పారు. ప్రభుత్వ విధానాల వల్లే సమాచార హక్కు చట్టం సామాన్యులకు సమాచారాన్ని అందించలేకపోతోందన్నారు. దేవస్థానాల విషయమే ఇందుకు ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. ఐఏఎస్ అధికారులు విధులు నిర్వహించే టీటీడీలో కూడా ఆర్‌టీఐ అమలు కావడం లేదని దేవాదాయ శాఖ చెబుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలోనూ సమాచార హక్కు చట్టాన్ని భాగస్వామ్యం చేయాలని విజయబాబు పేర్కొన్నారు.
'ఏపీ సర్కారు కారణంగా స.హ చట్టం నిర్వీర్యం'
Published Mon, Dec 7 2015 7:35 PM | Last Updated on Sun, Sep 3 2017 1:38 PM
Advertisement
Advertisement