జిల్లాకు 13 కొత్త పెట్రోలింగ్ వాహనాలు
ఏలూరు అర్బన్ : జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని రాష్ట్ర డీజీపీ ఎన్.సాంబశివరావు తెలిపారు. శనివారం జిల్లాకు విచ్చేసిన డీజీపీ సాంబశివరావు స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులతో రహదారి భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ అనే అంశంపై పశ్చిమ గోదావరి, రాజమండ్రి అర్బన్ పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక హైవే పెట్రోలింగ్ కోసం హైవే రహదార్ల పరిధిలో ఉన్న జిల్లాలోని 13 పోలీసు స్టేషన్‌లకు ప్రత్యేకంగా 13 నూతన పెట్రోలింగ్ వాహనాలు అందించనున్నామని వెల్లడించారు. 2020 నాటికి ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, మరణాలు 50 శాతానికి తగ్గించేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. దానిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఎక్కువ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న (బ్లాక్ స్పాట్‌లు) 39 ప్రాంతాలను గుర్తించామన్నారు. ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి ప్రమాదాలను గుర్తించి అవి జరిగేందుకు కారణాలను విశ్లేషించి భవిష్యత్‌లో అలాంటి కారణాలతో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దీనికి తోడు డ్రోన్ కెమెరాల సాయంతో కూడా రహదారి భద్రత పర్యవేక్షిస్తామని, ప్రమాదాల కూడళ్లలోకి వాహనాలు ప్రవేశించగానే వాయిస్ అలర్ట్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ క్రమంలో పోలీసుశాఖ ప్రమాదాల నివారణకు తీసుకునే చర్యల్లో అవసరమైన అంశాల్లో ఆర్థిక తోడ్పాటు అందించేందుకు పోలీసులు వసూలు చేస్తున్న ఈ ఛలాన్ మొత్తంలో 40 శాతం పోలీసుశాఖకు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారని డీజీపీ తెలిపారు. ప్రమాదాలకు కారణాలలలో మానవతప్పిదాలతో పాటు ర హదారుల (కండీషన్) పరిస్థితి పరిశీలించి సంబంధిత శాఖల సమన్వయంతో తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు. హోంగార్డ్స్, రోడ్ సేఫ్టీ ఐజీ త్రిపాఠి ఉజాలా, ఏలూరు రేంజి డీజీపీ పీవీఎస్ రామకృష్ణ, జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్, రాజమండ్రి అర్బన్ ఎస్పీ రాజకుమారి, జిల్లా అడిషనల్ ఎస్పీ వలిశెల రత్న, ఏలూరు, కొవ్వూరు డీఎస్పీలు గోగుల వెంకటేశ్వరరావు, నర్రా వెంకటేశ్వరరావు, ఏఆర్ డీఎస్పీ ఎన్ చంద్రశేఖర్, ట్రాఫిక్ డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
డీజీపీకి ఘన స్వాగతం
జిల్లాకు వచ్చిన డీజీపీ ఎన్.సాంబశివరావుకు ఏలూరు రేంజి డీఐజీ పీవీఎస్ రామకృష్ణ, జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ ఇతర అధికారులు ఘనస్వాగతం పలికారు. పోలీస్ గెస్ట్‌హౌస్ వద్ద అధికారులతో ఏకాంతంగా జిల్లాలో పరిస్థితులపై ముచ్చటించారు. శాంతి భద్రతల పరంగా జిల్లా అధికారులు తీసుకుంటున్న చర్యలపై అభినందించారు. నాలుగేళ్ల కాలంతో పోల్చుకుంటే జిల్లాలో రహదారి ప్రమాదాలు, నేరాలు, దొంగతనాలు కూడా గణనీయంగా తగ్గడంపై సంతృప్తి వ్యక్తం చేస్తూ ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ను అభినందించారు.