ఎమ్మెల్సీల నియామక పత్రాలు సృష్టించిన మోసగాడు అరెస్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యుడిని నియమిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గెజిట్ జారీ చేసినట్లు ఫోర్జరీ పత్రాలు సృష్టించడంతోపాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ కోటాలో నామినేటెడ్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పోస్టులను గవర్నర్ కార్యాలయం మంజూరు చేసినట్లు మరో మూడు ఫోర్జరీ పత్రాలను సృష్టించిన ఘరానా మోసగాడు మారంరాజు రాఘవరావు (62)ను సీఐడీ శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పొల్కంపల్లి గ్రామానికి చెందిన రాఘవరాజు సికింద్రాబాద్‌లోని భాస్కరరావు నగర్‌లో నివాసముంటున్నాడు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇతడిపై గతంలో పలు చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదయ్యాయి.
మరో నిందితుడు మట్ట రఘువంశీని రాజ్యసభ సభ్యుడిగా చూపించేందుకు కేంద్ర హోం శాఖ గెజిట్‌ను ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలను సృష్టించాడు. అలాగే నామినేటెడ్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పోస్టులను గవర్నర్ కార్యాలయం మంజూరు చేసినట్లు మరో మూడు ఫోర్జరీ పత్రాలను సృష్టించాడు. ఈ క్రమంలో ఏకంగా గవర్నర్ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. తమ పత్రాలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తూ రఘువంశీ ఏకంగా గవర్నర్ కార్యాలయానికి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేశాడు. ఈ దరఖాస్తుతోపాటు ఫోర్జరీ పత్రాలను జత చేయడంతో మోసం బయటపడింది. గవర్నర్ కార్యాలయం ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన సీఐడీ.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించింది. రాఘవరావును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించింది.
గవర్నర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి..!
Published Sun, Dec 18 2016 2:42 AM | Last Updated on Mon, Sep 4 2017 10:58 PM
Advertisement
Advertisement