బౌద్ధ ఆరామాలు గోవిందా...
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పీసీపీఐఆర్ కోసం విశాఖపట్నం - కాకినాడ మధ్య ప్రతిపాదించిన 1,58,147 ఎకరాలు ప్రాచీన సంపదనకు నిలయంగా ఉంది. ఈ ప్రాంతంలో 8 బౌద్ధ ఆరామ కేంద్రాలున్నాయి. జిల్లాలోని ధారపాలెం, కొత్తూరు, రాకాసికొండ, అమలాపురం, వీరాలమెట్ట, పెంటకోట, గోపాలపట్నం, తూర్పుగోదావరి జిల్లాలోని కొడవలి, పి.తిప్పాపురం ఉన్నాయి. బౌద్ధారామ కేంద్రాలుగా గుర్తింపు కోసం మరో 8 కేంద్రాల పేర్లతో ఓ జాబితా రూపొందించారు.
కొత్త పోలవరం, గుడివాడ, పెద్ద ఉప్పలాం, బుచ్చిరాజుపేట, ఎ.కొత్తపల్లిలను ఆ జాబితాలో చేర్చారు. మరో 13 కేంద్రాలను బౌద్ధ ఆరామా కేంద్రాలుగా గుర్తించాలన్న ప్రతిపాదన ఉంది. 12వ శతాబ్దంలో తూర్పు చాణుక్య వంశానికి చెందిన కాషాయ విష్ణువర్థన మహారాజు ఈ బౌద్ధ అరామ కేంద్రాల పరిరక్షణ కోసం నిధులు సమకూర్చినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ప్రాచీనవారసత్వ ప్రాశస్త్యం ఉన్న కేంద్రాలకు విఘాతం కలగకుండా చూడాలని పురావస్తు ప్రదేశాల పరిరక్షణ చట్టం స్పష్టం చేస్తోంది.
ఏకపక్షంగా...
వారసత్వ సంపద ఉన్న ప్రాంతాలతోసహా భారీ ఎత్తున భూములు పీసీపీఐఆర్ కింద పారిశ్రామిక సంస్థలకు కట్టబెట్టేయడానికి సిద్ధమైంది. పీసీపీఐఆర్ మాస్టర్‌ప్లాన్ రూపొందించిన వుడా అధికారులు పురావస్తు శాఖ అధికారులను కనీసం సంప్రదించ లేదు. సమాచార హక్కు చట్టం కింద కోరినప్పుడు ఈ విషయం నిర్ధారణయ్యింది. బౌద్ధ ఆరామ అవశేషాలు ఉన్న ప్రాంతాలతోసహా భూసేకరణకు సిద్ధపడుతున్నప్పుడు వుడా అధికారులు సంప్రదించారా అని ప్రశ్నించగా...పురావస్తు శాఖ అధికారులు లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ వుడా అధికారులు తమను సంప్రదించలేదని వెల్లడించారు.
వుడా అధికారులు కూడా స్పందిస్తూ పురావస్తు శాఖను సంప్రదించలేదని అంగీకరించారు. వుడా అధికారులు తమదైన శైలిలో సమర్థించుకోవడం గమనార్హం. భూసేకరణకు ఓ కన్సల్టెన్సీ ద్వారా డ్రాఫ్ట్‌ప్లాన్ రూపొందిస్తున్నామన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి నెలరోజుల ముందు విడుదల చేసే ఆ డ్రాఫ్ట్ ప్లాన్‌లో అన్ని అంశాలను పొందుపరుస్తామని చెప్పారు.
అనంతరం అభ్యంతరాలు తెలపవచ్చని కూడా చెప్పుకొచ్చారు. కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన డ్రాఫ్ట్‌ప్లాన్‌లో అసలు ఆ ప్రాంతంలో బౌద్ధ ఆరామ అవశేషాలు ఉన్నాయన్న విషయాన్నే ప్రస్తావించ లేదు. బౌద్ధ ఆరామ అవశేషాలను ప్రభుత్వం కనీసం గుర్తించలేదని స్పష్టమవుతోంది.