PCPIR
-
బౌద్ధ ఆరామాలు గోవిందా...
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పీసీపీఐఆర్ కోసం విశాఖపట్నం - కాకినాడ మధ్య ప్రతిపాదించిన 1,58,147 ఎకరాలు ప్రాచీన సంపదనకు నిలయంగా ఉంది. ఈ ప్రాంతంలో 8 బౌద్ధ ఆరామ కేంద్రాలున్నాయి. జిల్లాలోని ధారపాలెం, కొత్తూరు, రాకాసికొండ, అమలాపురం, వీరాలమెట్ట, పెంటకోట, గోపాలపట్నం, తూర్పుగోదావరి జిల్లాలోని కొడవలి, పి.తిప్పాపురం ఉన్నాయి. బౌద్ధారామ కేంద్రాలుగా గుర్తింపు కోసం మరో 8 కేంద్రాల పేర్లతో ఓ జాబితా రూపొందించారు. కొత్త పోలవరం, గుడివాడ, పెద్ద ఉప్పలాం, బుచ్చిరాజుపేట, ఎ.కొత్తపల్లిలను ఆ జాబితాలో చేర్చారు. మరో 13 కేంద్రాలను బౌద్ధ ఆరామా కేంద్రాలుగా గుర్తించాలన్న ప్రతిపాదన ఉంది. 12వ శతాబ్దంలో తూర్పు చాణుక్య వంశానికి చెందిన కాషాయ విష్ణువర్థన మహారాజు ఈ బౌద్ధ అరామ కేంద్రాల పరిరక్షణ కోసం నిధులు సమకూర్చినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ప్రాచీనవారసత్వ ప్రాశస్త్యం ఉన్న కేంద్రాలకు విఘాతం కలగకుండా చూడాలని పురావస్తు ప్రదేశాల పరిరక్షణ చట్టం స్పష్టం చేస్తోంది. ఏకపక్షంగా... వారసత్వ సంపద ఉన్న ప్రాంతాలతోసహా భారీ ఎత్తున భూములు పీసీపీఐఆర్ కింద పారిశ్రామిక సంస్థలకు కట్టబెట్టేయడానికి సిద్ధమైంది. పీసీపీఐఆర్ మాస్టర్‌ప్లాన్ రూపొందించిన వుడా అధికారులు పురావస్తు శాఖ అధికారులను కనీసం సంప్రదించ లేదు. సమాచార హక్కు చట్టం కింద కోరినప్పుడు ఈ విషయం నిర్ధారణయ్యింది. బౌద్ధ ఆరామ అవశేషాలు ఉన్న ప్రాంతాలతోసహా భూసేకరణకు సిద్ధపడుతున్నప్పుడు వుడా అధికారులు సంప్రదించారా అని ప్రశ్నించగా...పురావస్తు శాఖ అధికారులు లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ వుడా అధికారులు తమను సంప్రదించలేదని వెల్లడించారు. వుడా అధికారులు కూడా స్పందిస్తూ పురావస్తు శాఖను సంప్రదించలేదని అంగీకరించారు. వుడా అధికారులు తమదైన శైలిలో సమర్థించుకోవడం గమనార్హం. భూసేకరణకు ఓ కన్సల్టెన్సీ ద్వారా డ్రాఫ్ట్ప్లాన్ రూపొందిస్తున్నామన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి నెలరోజుల ముందు విడుదల చేసే ఆ డ్రాఫ్ట్ ప్లాన్‌లో అన్ని అంశాలను పొందుపరుస్తామని చెప్పారు. అనంతరం అభ్యంతరాలు తెలపవచ్చని కూడా చెప్పుకొచ్చారు. కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన డ్రాఫ్ట్ప్లాన్లో అసలు ఆ ప్రాంతంలో బౌద్ధ ఆరామ అవశేషాలు ఉన్నాయన్న విషయాన్నే ప్రస్తావించ లేదు. బౌద్ధ ఆరామ అవశేషాలను ప్రభుత్వం కనీసం గుర్తించలేదని స్పష్టమవుతోంది. -
ఏదో ఒకటి చేసి నమ్మించండి
⇒ ప్రభుత్వ ప్రతిష్ట మంటగలిసిపోతోంది.. ⇒ ప్రజల్లోకి వెళ్లలేక పోతున్నాం ⇒ అధికారులకు మంత్రి గంటా ఆదేశం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : ‘పీసీపీఐఆర్ వల్ల ప్రభుత్వ ప్రతిష్ట మంటగలిసేట్టుగా ఉంది. ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదు. ప్రజలకు ఇప్పటికే మనపై నమ్మకం పోతోంది. ఏదో ఒకటి చేయండి. ప్రజల ఆగ్రహం చల్లారేలా కనికట్టు చేయండి’ అధికారులకు మంత్రి, ఎమ్మెల్యేల ఆదేశం ఇదీ. పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్(పీసీపీఐఆర్) వ్యవహారం జిల్లా మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలకు కంటిపై కునుకులేకుండా చేస్తోంది. వేలాదిమందిని నిరాశ్రయులను చేయనున్న ఈ ప్రతిపాదనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 18న నక్కపల్లిలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం అంటేనే జిల్లా మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు బెంబేలెత్తిపోతున్నారు. దాంతో మంత్రి గంటా శ్రీనివాసరావు, టీడీపీ ఎమ్మెల్యేలు వంగలపూడి అనిత, పంచకర్ల రమేష్ బాబు రంగంలోకి దిగారు. కలెక్టర్ యువరాజ్, జేసీ ప్రవీణ్‌కుమార్, ఎస్పీ కోయ ప్రవీణ్‌లతోపాటు రెవెన్యూ, వుడా అధికారులతో కలెక్టరేట్లో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు అనిత, రమేష్‌బాబు జిల్లా అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పీసీపీఐఆర్ అంటేనే ప్రజలు కొట్టేట్లుగా ఉన్నారని మంత్రి గంటా వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో పీసీపీఐఆర్ పేరుతో ఊళ్లు ఖాళీ చేయమంటే ప్రజలు తిరగబడటం ఖాయమని ఆందోళన వ్యక్తం చేశారు. తమను కనీసం సంప్రదించకుండా ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ఎందుకు నిర్ణయించారని మంత్రి కలెక్టర్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఇది ప్రభుత్వం హైదరాబాద్‌స్థాయిలో తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశారు. దాంతో మంత్రి ఎలా స్పందించాలో తెలియక మంత్రి ఇబ్బందిపడ్డారు. పీసీపీఐఆర్ అంటే తమకే అవగాహన లేకుంటే ప్రజలకు ఏం సర్దిచెప్పగలమని ఆయన ప్రశ్నించారు. యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలిగించే ప్రజాభిప్రాయ సేకరణ వద్దన్నారు. పీసీపీఐఆర్ అని ప్రజల్ని ఇబ్బంది పెడితే తిరగబడతారని వ్యాఖ్యానించడం గమనార్హం. పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ ఏ ప్యాకేజీ ఇస్తామో ప్రజాభిప్రాయ సేకరణకు ముందే చెబితే ఆగ్రహం కొంతవరకు తగ్గించొచ్చన్నారు. కనికట్టు చేయండి : సమావేశంలో చివరగా మంత్రి గంటా మాట్లాడుతూ పీసీపీఐఆర్ నిరాశ్రయులకు మంచి ప్యాకేజీ ఇస్తామని ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. ఏదో ఒకటి చేసేసి ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నించాలని స్పష్టంగా చెప్పారు. సోమవారం నుంచి గ్రామస్థాయి సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ, ఎమ్పీటీసీలకు పీసీపీఐఆర్‌పై మొదట అవగాహన కల్పించాలని చెప్పారు. దీంతో డిసెంబర్ 2న జిల్లామంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్సీలతో వుడా కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశంలో డీఆర్వో నాగేశ్వర్రావు, అనకాపల్లి, విశాఖపట్నం, నర్సీపట్నం ఆర్డీవోలు, వుడా, ఏపీఐఐసీ అధికారులు పాల్గొన్నారు. -
పచ్చని బతుకుల్లో పీసీపీఐఆర్ చిచ్చు
‘చంద్రబాబు దొంగదెబ్బ తీశారు’ ‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పీసీపీఐఆర్ కోసం అధికారులు వస్తే కట్టికొట్టండని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు ఆయనే మా భూములు లాక్కోవాలని చూస్తున్నారు. మరి ఇప్పుడు మేం ఎవర్ని కట్టి కొట్టాలి?’ - గొర్ల బాబూరావు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఓ వైపు పచ్చని పొలాలు, తోటలు మరోవైపు విశాల సాగర తీరంతో అందంగా అలరారుతున్న ఆ పల్లెలపై ‘పీసీపీఐఆర్’ పేరుతో ప్రభుత్వ పడగనీడ పడింది. పెట్రోలియమ్, కెమికల్, అండ్ పెట్రో కెమికల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (పీసీపీఐఆర్) కోసం విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో 640 చ.కి.మీ. పరిధిలో భారీ భూసేకరణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. విశాఖపట్నం జిల్లాలో 490చ.కి.మీ. పరిధిలోని పెదగంట్యాడ, పరవాడ, అచ్యుతాపురం, రాంబిల్లి, ఎస్.రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లోని 82 గ్రామాలను ఏకంగా సేకరించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఏకంగా 82గ్రామాల్లో భూసేకరణకు డిసెంబరు 18న నక్కపల్లిలో ప్రజాభిప్రాయసేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించేసింది. ప్రభుత్వ దుర్మార్గ వ్యూహం పొలాల నుంచి రైతులను, సముద్రం నుంచి మత్స్యకారులను దూరం చేసేందుకు ప్రభుత్వం కర్కషమైన వ్యూహం పన్నింది. అధికారిక లెక్కల ప్రకారం ఆ గ్రామాల్లో 2లక్షలమంది రైతులు, 1,21,511మంది మత్స్యకారులు ఉన్నారు. కేవలం భూములు మాత్రమే సేకరిస్తామని గ్రామాల్లో ప్రజలు నివసించవచ్చని ప్రభుత్వం సన్నాయి నొక్కులు నొక్కుతోంది. కానీ పొలాలు, తోటలను ప్రభుత్వం గుంజుకున్న తరువాత ఆ గ్రామీణులకు ఆ గ్రామాల్లో ఉపాధి ఉండనే ఉండదు. భూముల చుట్టూ కంచె వేసేస్తే మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లేందుకు అవకాశం ఉండదు. మరోవైపు పెట్రోకెమికల్ పరిశ్రమల నుంచి వెలువడే అత్యంత కలుషితమైన వ్యర్థాలతో ఆ గ్రామాల్లో ఎవ్వరూ ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో పొట్టచేతబట్టుకుని ఆ గ్రామాలను వదిలిపోవాల్సిన దుస్థితి అనివార్యమవుతుంది. నిబంధనలను ఉల్లంఘిస్తూ పీసీపీఐఆర్ పేరుతో పేదల భూములు బడాబాబులకు కట్టబెట్టాలన్న ఆతృతతో ప్రభుత్వం నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తోంది. అటు న్యాయస్థానాల తీర్పులను కాలరాస్తూ మరోవైపు భూసేకరణ, నోటిఫికేషన్, ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ అంతా కూడా నిబంధనలకు విరుద్ధంగా చేసుకుపోతోంది. కోర్టు తీర్పును ధిక్కరిస్తూ: 2011లో అప్పటి ప్రభుత్వం నక్కపల్లి ఇండస్ట్రియల్ పార్క్‌గా పేర్కొంటూ భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై ఆ ప్రాంత ప్రజలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దాంతో రైతుల పునరావాసంపై స్పష్టత ఇచ్చేవరకు భూసేకరణ ప్రక్రియ చేపట్టవద్దని న్యాయస్థానం తీర్పునిచ్చింది. ప్రభుత్వం ఆ ఇండస్ట్రియల్ పార్క్ ప్రతిపాదననే మరింత విస్తృతపరచి ‘పీసీపీఐఆర్’గా మార్చింది. కానీ కోర్టు తీర్పును ఏమాత్రం పట్టించుకోకండా ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం పీసీపీఐఆర్ కోసం భూసేకరణ ప్రక్రియను ఉపక్రమించింది. పీసీపీఆర్కు వ్యతిరేకంగా గతంలో ప్రతిపాదిత గ్రామాలు చేసిన తీర్మానాలను కూడా పట్టించుకోవడం లేదు. ప్రజాభిప్రాయ సేకరణ స్ఫూర్తిని అపహాస్యం చేస్తూ ప్రజాభిప్రాయ సేకరణకు ముందు ప్రభుత్వం ‘ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్టు (ఈఐఎస్ రిపోర్టు)ను రూపొందించాలి. ఆ భూముల్లో పరిశ్రమల స్థాపన వల్ల ఎలాంటి కాలుష్యానికి దారితీస్తుంది... మనుషులు, జీవజాలం, పంటలు, పర్యావరణం మీద ప్రతికూల ప్రభావం ఎలా ఉండబోతోంది?... అందుకు తీసుకోనున్న నివారణ చర్యలు ఏమిటి అనేవి ఆ నివేదికలో ఉండాలి. కానీ ప్రభుత్వం రూపొందించిన ఈఐఎస్ నివేదిక ఇంతవరకు ప్రజలకు చేరనే లేదు. పంచాయతీకి ఒకటి చొప్పున నివేదిక కాపీని జిల్లా అధికారులు ఇచ్చినట్లే ఇచ్చి అందకుండా చేస్తున్నారు. చాలావరకు అధికారుల వద్దే తొక్కిపెట్టారు. ఏడుమండలాల్లోని 82 గ్రామాల్లో భూసేకరణకు సంబంధించి కేవలం ఒక్క నక్కపల్లిలోనే ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించింది. ఆ 82 గ్రామాల ప్రజలు దూరంగా ఉన్న నక్కపల్లికి రావడం వ్యయప్రయాసలతో కూడుకున్నది. ప్రభుత్వం తాము ముందుకు మేనేజ్ చేసిన తమ మనుషులనే తరలించి తమకు అనుకూలంగా వ్యవహారం నడిపించేందుకే ఇలాంటి ఎత్తుగడ వేసింది. తిరగబడుతున్న పల్లెలు: తమ భూములు గుంజుకోవాలని చూస్తున్న ప్రభుత్వ పన్నాగంపై ప్రజలు భగ్గుమంటున్నారు. రాజయ్యపేట, చందనాడ, బుచ్చిరాజుపేట, కృష్ణపాలెం, నడిపిల్లి, వెదురువాడ, తానాం, బోనంగి, దొప్పెర్ల, చాటిమెట్ట, పూడి, రాంబిల్లి, మర్రిపాలెం... ఇలా ప్రతి గ్రామం రగిలిపోతోంది. ‘మమ్మల్ని పెట్రోల్‌పోసి తగలెట్టేసి పెట్రోల్ఫ్యాక్టరీలు పెట్టండి’ ‘మేం చేపలోళ్లం. గంగమ్మ తల్లినే నమ్ముకుని బతుకుతున్నాం. ఇప్పుడు మమ్మల్ని సముద్రానికి దూరం చేద్దామని ప్రభుత్వం చూస్తోంది. ముందు మా చేపలోళ్లని పెట్రోల్ పోసి తగలెట్టేసి తరువాత ఫ్యాక్టరీలు పెట్టుకోండి. మేం ప్రాణాలతో ఉండగా భూములు ఇవ్వం. ఊరు వదలం’ -పైడితల్లి, రాజయ్యపేట ‘భూములు ఇవ్వం.. ఊరు వదలం’ ‘ఈ గ్రామాల్లో ఎకరా రెండెకరాలు ఉన్న చిన్నకారు రైతులే ఉన్నారు. ఆ కొద్దిపాటి భూమి లాక్కొంటే వారు వలసపోయి కూలీలుగా బతకలేరు. మాబోటి చిన్నరైతులు మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకోవాల్సిందే. అందుకే భూములు కాపాడుకునేందుకు ఎంతకైనా పోరాడతాం’ - పళ్ల అప్పలస్వామి -
సర్కారు భూబాగోతం
భూసేకరణ కోసం రైతులపై దాష్టీకం భూముల క్రయవిక్రయాలపై ఆంక్షలు హైకోర్టు ఆదేశాలు బేఖాతరు ‘మాకు భూములున్నా ఆర్థికంగా ఇబ్బందులు తప్పడం లేదు. మా భూములపై ప్రభుత్వం పెత్తనం చెలాయిస్తోంది. పిల్లకి పెళ్లి చేసుకోవడానికీ లేదు.. ఇల్లు కట్టుకోవడానికీ లేదు..’ ఇదీ నక్కపల్లి మండలం తీర ప్రాంత గ్రామాల్లో అన్న దాతల ఆవేదన. పీసీపీఐఆర్ పేరుతో ఏపీఐఐసీ అధికారులు చేపట్టిన భూ సేకరణ ప్రక్రియతో అన్న దాతలు అభాగ్యులుగా మిగిలారు. తీర ప్రాంత గ్రామాల్లో పారిశ్రామిక పార్కు, అణువిద్యుత్ పరిశ్రమ, కోస్టల్ కారిడార్ తదితర పరిశ్రమల ఏర్పాటుకు రెండేళ్ల క్రితం భూసేకరణ చేపట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. దీనిలో బాగంగా అప్పట్లో డీఎల్ పుఎరం, నెల్లిపూడి, వేంపాడు, బంగారమ్మపేట, అమలాపురం, మూలపర, చందనాడ, రాజయ్యపేట, బుచ్చిరాజు పేట, పాటిమీద తదతర గ్రామాల్లో సుమారు 2700ఎకరాల భూ సేకరణకు సంబంధించి నోటీసులు జారీ చేశారు. భూ సేకరణను వ్యతిరేకిస్తూ రైతులు నోటీసులు తిస్కరించారు. అయినా లెక్క చేయకుండా అధికారులు 4(1) నోటీసులు కూడా జారీ చేసి భూములు క్రయ, విక్రయాలు జరగకుండా ఆంక్షలు విధించారు. దీంతో భూములు పోతాయన్న ఆందోళనతో రైతులంతా హైకోర్టును ఆశ్రయించడంతో భూ సేకరణకు అడ్డుకట్ట పడింది. భూములను పరిశ్రమలకు తీసుకుంటే తమకు అధోగతేనన్న రైతుల ఆందోళనను కోర్టు కూడా పరిగణనలోకి తీసుకుని భూ సేకరణపై స్టే విధించింది. అయితే హైకోర్టు ఆదేశాలను జీర్ణించుకోలేని ప్రభుత్వం భూముల క్రయ, విక్రయాలపై నిషేధం విధిస్తూ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు, బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి అన్నదాతల కష్టాలు ప్రారంభం అయ్యాయి. భూములు అమ్మకోవడానికి, తాకట్టు పెట్టుకోవడానికి వీల్లేకపోవడంతో అష్ట కష్టాలు పడుతున్నారు. కనీసం పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యాలయాలకు భూములు అమ్మకోవాలన్నా, వరకట్నంగా పిల్లకు ఇవ్వాలన్నా అవకాశం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే కొంత భూమిని అముమకుని ఇల్లు కట్టుకోవాలన్నా రిజిస్టేషన్ జరగక పోవడంతో కొనేందుకు ఎవరూ మందుకు రాలేదని వాపోతున్నారు. కనీసం తమ పట్టాదారు పాసు పుస్తకాలతో పీఏసీఎస్‌లో మెంబర్షిప్ పొందాలన్నా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతంలో ఎవరిని కదిపినా తమ భూముల క్రయ, విక్రయాలపై ఆంక్షలు ఎత్తి వేయాలని కోరుతున్నారు. ఆంక్షలు ఎత్తివేయాలి వ్యవసాయాన్నే నమ్ముకుని జీవిస్తున్న మా భూములపై ప్రభుత్వం విధించిన ఆంక్షలు ఎత్తివేయాలి. పరిశ్రమలకు భూములిచ్చేది లేదని పలు మార్లు పోరాటం చేశాం. కోర్టులను ఆశ్రయించి స్టే కూడా తెచ్చుకున్నాం. అయినా ఆంక్షలు తొలగించక పోవడం దారుణం. - తళ్ల అప్పలస్వామి, రైతు, చందనాడ భూములిచ్చే ప్రసక్తి లేదు ప్రాణాలివ్వడానికైనా సిద్ధమే. పరిశ్రమలకు భూమిలిచ్చే ప్రసక్తే లేదు. కోర్టు ఆదేశాలను ధిక్కరించి మా భూములకు క్రయ, విక్రయాలు ఆపేశారు. తక్షణమే వాటి ఎత్తివేయాలి. - సూరకాసుల గోవిందు, రైతు, మూలపర భూసేకరణకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాం కోస్తా తీర ప్రాంతాల్లో పరిశ్రమలతో రైతులు, చేతి వృత్తుల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాలుష్య పరిశ్రమలను స్థాపించి ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడాలని చూస్తున్నారు. భూ సేకరణకు వ్యతిరేకంగా గతంలో రైతులతో కలసి ఎన్నో పోరాటాలు చేశాం. భూ సేకరణకు వ్యతిరేకంగా పోరాటాల్లో సీపీఎం రైతులకు అండగా నిలుస్తోంది. - ఎం.అప్పలరాజు, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు