సర్కారు భూబాగోతం
- భూసేకరణ కోసం రైతులపై దాష్టీకం
- భూముల క్రయవిక్రయాలపై ఆంక్షలు
- హైకోర్టు ఆదేశాలు బేఖాతరు
‘మాకు భూములున్నా ఆర్థికంగా ఇబ్బందులు తప్పడం లేదు. మా భూములపై ప్రభుత్వం పెత్తనం చెలాయిస్తోంది. పిల్లకి పెళ్లి చేసుకోవడానికీ లేదు.. ఇల్లు కట్టుకోవడానికీ లేదు..’ ఇదీ నక్కపల్లి మండలం తీర ప్రాంత గ్రామాల్లో అన్న దాతల ఆవేదన.
పీసీపీఐఆర్ పేరుతో ఏపీఐఐసీ అధికారులు చేపట్టిన భూ సేకరణ ప్రక్రియతో అన్న దాతలు అభాగ్యులుగా మిగిలారు. తీర ప్రాంత గ్రామాల్లో పారిశ్రామిక పార్కు, అణువిద్యుత్ పరిశ్రమ, కోస్టల్ కారిడార్ తదితర పరిశ్రమల ఏర్పాటుకు రెండేళ్ల క్రితం భూసేకరణ చేపట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. దీనిలో బాగంగా అప్పట్లో డీఎల్ పుఎరం, నెల్లిపూడి, వేంపాడు, బంగారమ్మపేట, అమలాపురం, మూలపర, చందనాడ, రాజయ్యపేట, బుచ్చిరాజు పేట, పాటిమీద తదతర గ్రామాల్లో సుమారు 2700ఎకరాల భూ సేకరణకు సంబంధించి నోటీసులు జారీ చేశారు.
భూ సేకరణను వ్యతిరేకిస్తూ రైతులు నోటీసులు తిస్కరించారు. అయినా లెక్క చేయకుండా అధికారులు 4(1) నోటీసులు కూడా జారీ చేసి భూములు క్రయ, విక్రయాలు జరగకుండా ఆంక్షలు విధించారు. దీంతో భూములు పోతాయన్న ఆందోళనతో రైతులంతా హైకోర్టును ఆశ్రయించడంతో భూ సేకరణకు అడ్డుకట్ట పడింది. భూములను పరిశ్రమలకు తీసుకుంటే తమకు అధోగతేనన్న రైతుల ఆందోళనను కోర్టు కూడా పరిగణనలోకి తీసుకుని భూ సేకరణపై స్టే విధించింది. అయితే హైకోర్టు ఆదేశాలను జీర్ణించుకోలేని ప్రభుత్వం భూముల క్రయ, విక్రయాలపై నిషేధం విధిస్తూ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు, బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది.
అప్పటి నుంచి అన్నదాతల కష్టాలు ప్రారంభం అయ్యాయి. భూములు అమ్మకోవడానికి, తాకట్టు పెట్టుకోవడానికి వీల్లేకపోవడంతో అష్ట కష్టాలు పడుతున్నారు. కనీసం పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యాలయాలకు భూములు అమ్మకోవాలన్నా, వరకట్నంగా పిల్లకు ఇవ్వాలన్నా అవకాశం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అలాగే కొంత భూమిని అముమకుని ఇల్లు కట్టుకోవాలన్నా రిజిస్టేషన్ జరగక పోవడంతో కొనేందుకు ఎవరూ మందుకు రాలేదని వాపోతున్నారు. కనీసం తమ పట్టాదారు పాసు పుస్తకాలతో పీఏసీఎస్‌లో మెంబర్‌షిప్ పొందాలన్నా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతంలో ఎవరిని కదిపినా తమ భూముల క్రయ, విక్రయాలపై ఆంక్షలు ఎత్తి వేయాలని కోరుతున్నారు.
ఆంక్షలు ఎత్తివేయాలి
వ్యవసాయాన్నే నమ్ముకుని జీవిస్తున్న మా భూములపై ప్రభుత్వం విధించిన ఆంక్షలు ఎత్తివేయాలి. పరిశ్రమలకు భూములిచ్చేది లేదని పలు మార్లు పోరాటం చేశాం. కోర్టులను ఆశ్రయించి స్టే కూడా తెచ్చుకున్నాం. అయినా ఆంక్షలు తొలగించక పోవడం దారుణం.
- తళ్ల అప్పలస్వామి, రైతు, చందనాడ
భూములిచ్చే ప్రసక్తి లేదు
ప్రాణాలివ్వడానికైనా సిద్ధమే. పరిశ్రమలకు భూమిలిచ్చే ప్రసక్తే లేదు. కోర్టు ఆదేశాలను ధిక్కరించి మా భూములకు క్రయ, విక్రయాలు ఆపేశారు. తక్షణమే వాటి ఎత్తివేయాలి.
- సూరకాసుల గోవిందు, రైతు, మూలపర
భూసేకరణకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాం
కోస్తా తీర ప్రాంతాల్లో పరిశ్రమలతో రైతులు, చేతి వృత్తుల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాలుష్య పరిశ్రమలను స్థాపించి ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడాలని చూస్తున్నారు. భూ సేకరణకు వ్యతిరేకంగా గతంలో రైతులతో కలసి ఎన్నో పోరాటాలు చేశాం. భూ సేకరణకు వ్యతిరేకంగా పోరాటాల్లో సీపీఎం రైతులకు అండగా నిలుస్తోంది.
- ఎం.అప్పలరాజు, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు