
రెవెన్యూ శాఖలో భూ మాఫియా
అవినీతిలో రెవెన్యూ సిబ్బంది
సమాచార హక్కు చట్టాన్ని గౌరవించాల్సిందే
సమాచారం ఇవ్వని అధికారులపై చర్యలు
ఆర్‌టీఐ రాష్ట్ర కమిషనర్ విజయబాబు వెల్లడి
తిరుపతి కార్పొరేషన్: ‘రెవెన్యూ శాఖలో భూ మాఫియా ఉంది, భూ రికార్డులు తారుమారు చేసి పేదల కడుపుకొడుతున్నారు, తద్వారా రెవెన్యూ సిబ్బంది కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడుతున్నారు’ అని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ పి.విజయబాబు ఆరోపించారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ భవనంలో మంగళవారం రాయలసీమ జిల్లాలతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించిన సమాచార హక్కు చట్టం కేసుల విచారణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాచార హక్కు చట్టం కమిషన్ జారీచేసిన ఉత్తర్వులను సంబంధిత అధికారులు కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.
రాజ్యాంగబద్ధంగా ఏర్పా టైన సమాచార హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందేనన్నారు. స్థానిక సంస్థల ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. సమాచార హక్కు చట్టం 4(1),(బి) ప్రకారం సమాచారం ఇవ్వని అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. టీటీడీలో సమాచారం ఇవ్వకపోతే ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. రెండు రోజులుగా సమాచార హక్కు చట్టం కింద 30 కేసులు విచారించినట్టు ఆయన తెలిపారు. అందులో 3 కేసులు వాయిదా వేయగా, 9 కేసుల్లో షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు.