
రహ‘దారి’ ఏది?
- ఏటా లక్షల్లో రోడ్లపైకి వస్తున్న కొత్త వాహనాలు
- విపరీతంగా పెరుగుతున్న ద్విచక్రవాహనాల సంఖ్య
- నగరవాసుల్లో ఏడాదికేడాది పెరుగుతున్న మోజు
- ఫలితంగా ప్రమాదకరంగా మారుతున్న రహదారులు
- ఆందోళనను కలిగిస్తున్న కాలుష్యం తీవ్రత
సాక్షి, ముంబై: నగరంలో రోజురోజుకూ ద్విచక్ర వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. తత్ఫలితంగా కిక్కిరిసిన వాహనాలతో రహదారులు ప్రమాదకరంగా మారుతున్నాయి. ముంబై రిక్షామెన్ యూనియన్ నాయకుడు తంపీ కురేన్ సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాల మేరకు.. ఏప్రిల్-2013 నుంచి మార్చి 2014 మధ్య కాలంలో వాహనాల సంఖ్య 1,86,640 కు పెరిగింది. మార్చి 1998 నుంచి మార్చి 2013 వరకు ప్రతి సంవత్సరం 88,510 వాహనాలు సగటున రోడ్లపైకి వస్తున్నాయి. కొత్తగా రోడ్లపైకి వస్తున్న వాహనాలను చూసి అధికారులు నిర్ఘాంత పోతున్నారు. ప్రస్తుతం ద్విచక్ర వాహనాల కొనుగోళ్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం నగరంలోని మూడు ఆర్టీవో కేంద్రాల్లో 23,74,038 వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి.
ఇందులో అంధేరి ఆర్టీవో కార్యాలయంలో 1,86,640 ద్విచక్రవాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకోగా, వడాలా, తాడ్‌దేవ్ ఆర్టీవో కార్యాలయాలలో 1,02,829 ద్విచక్రవాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. దీంతో నగరంలో ద్విచక్రవాహనాలు ఉపయోగించే వారి సంఖ్య ఎంతగా పెరిగిందో తెలుస్తోంది.
1998 ఆర్థిక సంవత్సరం వరకు నగరంలో కేవలం 3,54,799 ద్విచక్రవాహనాలు ఉండగా మార్చి 2013లో వీటి సంఖ్య 12,35,282కు పెరిగింది. 1998 నుంచి ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేస్తున్నవారి సంఖ్య మరింతగా పెరుగుతోంది. ఇదిలా ఉండగా కార్లు ఉపయోగించే వారి సంఖ్య కూడా గణనీయంగానే పెరుగుతోంది. 1998లో నగర రోడ్లపై 2,73,581 కార్లు ఉండగా, మార్చి 31, 2014 వరకు కార్ల సంఖ్య 7,28,225కు చేరుకుంది. గత 16 సంవత్సరాల్లో 166 శాతం కార్ల సంఖ్య పెరిగిందని అధికారి తెలిపారు.
దీంతో కాలుష్య కారకాల జాబితాలో ఆటోలతోపాటు కార్లు కూడా చేరాయి. ప్రస్తుతం నగర రహదారులపై డీజిల్ కార్ల సంఖ్య పెరగడంతో కార్ల వల్ల జరుగుతున్న కాలుష్యం కూడా ఏమంత తక్కువేం కాదన్నారు. దీంతోపాటు అత్యంత క్యూబిక్ కెపాసిటీ(సీసీ) ఉన్న వాహనాలు రోడ్లపైకి వస్తుండడం, వాటి వేగం కూడా ఎక్కువగా ఉంటుండడంతో రహదారులు ప్రమాదకరంగా మారుతున్నాయి.