కేంద్ర, రాష్ట్రాల కేబినెట్ మంత్రులు సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పరిధిలోకి వస్తారని, ప్రజా సేవకులైన వారు పౌరులు అడిగిన
{పజలకు జవాబుదారీగా ఉండాలి
కేంద్ర, రాష్ట్ర మంత్రులకు సూచించిన సీఐసీ
న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్రాల కేబినెట్ మంత్రులు సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పరిధిలోకి వస్తారని, ప్రజా సేవకులైన వారు పౌరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి తీరాల్సిందేనని కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) స్పష్టం చేసింది. ఆర్టీఐ చట్టం ప్రకారం నిర్దేశిత అభ్యర్థనతో ప్రజలు ప్రశ్నలను నేరుగా మంత్రులకు పంపొచ్చని తెలిపింది. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రతి మంత్రికీ సమకూర్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సిఫార్సు చేసింది. ఈ మేరకు సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు ఆదేశాలు జారీ చేశారు. ‘గోప్యతా ప్రమాణం’ స్థానంలో ‘పారదర్శకతా ప్రమాణం’ పాటించాలని సూచించారు. పార్లమెంట్ ఆమోదించిన ఆర్టీఐ చట్టాన్ని ప్రతి మంత్రీ గౌరవించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర కేబినెట్ మంత్రులను ప్రజలు కలిసే సమయాలను తెలపాలంటూ అహ్మద్‌నగర్‌కు చెందిన హేమంత్ ధాగే దాఖలు చేసిన పిటిషన్ విచారణలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎవరైనా గంట కొడితే శ్రీరాముడు అంతఃపురం నుంచి వెంటనే బయటకు వచ్చి వారిని కలిసి సమస్యేమిటో తెలుసుకుని పరిష్కరించేవాడన్నారు. కానీ... ప్రజలకు మంత్రి అందుబాటులో ఉండే సమయం తెలుసుకోవడానికి ఓ పౌరుడు ఆర్టీఐ చట్టాన్ని ఆశ్రయించాడంటే విచారించాల్సిన విషయమన్నారు. ‘సెక్షన్ 4(1)(బీ) ప్రకారం మంత్రులు స్వయంగా ఇలాంటి సమాచారాన్ని అందించాలి. అలాంటి సదుపాయం లేకపోతే మంత్రి కార్యాలయం ఆ విషయం చెప్పాలి. మంత్రికి ఇవన్నీ చూసుకోవడం కుదరకపోతే అందుకు తగిన అధికారులు, సిబ్బందిని నియమించుకోవాలి’ అని చెప్పారు. ఆర్టీఐకి సంబంధించి ఓ కచ్చితమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర, రాష్ర్ట మంత్రులకు సూచించారు.