సమాచార హక్కుతో సుపరిపాలన
కేంద్ర సమాచార శాఖ కమిషనర్ మాడభూషి శ్రీధర్
సెంట్రల్ యూనివర్సిటీ: సమాచార హక్కు చట్టం దేశంలో రెండో స్వాతంత్య్ర సంగ్రామం లాంటిదని కేంద్ర సమాచార శాఖ కమిషనర్ మాడభూషి శ్రీధర్ పేర్కొన్నారు. యూజీసీ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ‘సమాచార హక్కు చట్టం తీరుతెన్నులు’ అనే అంశంపై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ ప్రభుత్వాలు సుపరిపాలన అందించేందుకు ఆర్‌టీఐ ఎంతో దోహదపడిందన్నారు. 2005లో మొదలైన ఆర్‌టీఐ ద్వారా సామాన్యులు సైతం విలువైన సమాచారాన్ని పొందగలిగారని తెలిపారు.
క్షేత్ర స్థాయిలో ప్రజలకు ఈ చట్టంపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. యూనెటైడ్ నేషన్స్ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ప్రతినిధి ఎస్.రామారావు మాట్లాడుతూ 1990లో 13 దేశాలు మాత్రమే ఆర్‌టీఐని అమలు చేస్తే.. ప్రస్తుతం 100 దేశాల్లో ఈ చట్టం విజయవంతంగా అమలవుతోందన్నారు. రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ ఎస్.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్యంలో మైలు రాయి వంటిదని కొనియాడారు. స్వల్ప కాలంలో తక్కువ ఖర్చుతో ప్రజలకు అవసరమైన సమాచారం ఈ చట్టం ద్వారా పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీయూ ఇన్‌చార్జి వీసీ ఆర్.పి శర్మ, యూజీసీ హ్యుమన్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ సెంటర్(హెచ్‌సీయూ) ఇన్‌చార్జి డెరైక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.