Central Information Department
-
బెట్టింగ్ సైట్ల ప్రకటనలొద్దు టీవీ చానళ్లకు కేంద్రం సూచన
న్యూఢిల్లీ: బెట్టింగ్ సైట్లకు సంబంధించిన వాణిజ్య ప్రకటనల ప్రసారంపై కేంద్రం సోమవారం మార్గదర్శకాలను విడుదలచేసింది. ‘ఆన్లైన్ బెట్టింగ్ సైట్లను వాటికి సంబంధించిన వార్త వెబ్సైట్లను, వాటి ఉత్పత్తులు/సేవల సంబంధ అంశాలను చూపే వాణిజ్య ప్రకటనల ప్రసారం మానుకోండి’ అని న్యూస్ వెబ్సైట్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, ప్రైవేట్ శాటిలైట్ చానళ్లకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ సోమవారం సూచించింది. ఈ మార్గదర్శకాలు, చట్టాన్ని అతిక్రమిస్తే తీవ్ర స్థాయిలో చర్యలు ఉంటాయని ప్రైవేట్ శాటిలైట్ చానళ్లను కేంద్రం హెచ్చరించింది. వార్తలను ప్రచురించే పబ్లిషర్లకు, డిజిటల్ మీడియాకూ ఇదే తరహా సూచనలిస్తూ విడిగా మార్గదర్శకాలను పంపింది. ‘సొంత న్యూస్ వెబ్సైట్ల మాటున కొన్ని బెట్టింగ్ సంస్థలు తమను తాము అడ్వర్టైజ్ చేసుకుంటున్నాయి. బెట్టింగ్ సంస్థల లోగోలే ఆ న్యూస్ వెబ్సైట్లకూ ఉంటున్నాయి. ఈ వెబ్సైట్లు ఏవీ భారత చట్టాలకు లోబడి అధీకృత యంత్రాంగం వద్ద రిజిస్టర్ కాలేదు. తప్పుడు వాణిజ్య ప్రకటనలు, వార్తలు ప్రసారం చేస్తూ బెట్టింగ్, గ్యాబ్లింగ్‌కు పాల్పడుతున్నాయి. వీటిలో కొన్ని ప్రొఫెషనల్ స్పోర్ట్స్ బ్లాగ్లు, క్రీడా వార్తల వెబ్సైట్లుగా చెలామణి అవుతున్న విషయంపై వినియోగదారుల వ్యవహారాల విభాగాన్ని అప్రమత్తం చేశాం’ అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ తెలిపింది. -
కేంద్ర సమాచార శాఖ డీజీగా వెంకటేశ్వర్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర సమాచార శాఖ (తెలంగాణ) డైరెక్టర్ జనరల్‌గా ఎస్.వెంకటేశ్వర్ శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఏపీ రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్‌గా విధులు నిర్వహించిన ఆయన డెప్యుటేషన్ అనంతరం బదిలీపై హైదరాబాద్‌కు వచ్చారు. రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్ ఫర్ ఇండియా హైదరాబాద్ కార్యాలయ అదనపు ప్రెస్ రిజిస్ట్రార్‌గా కూడా వ్యవహరిస్తారు. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలో నూతనంగా ఏర్పాటు చేసిన రీజినల్ అవుట్ రీచ్ బ్యూరోకు అధిపతిగా కూడా ఉంటారు. గతంలో ఆయన ప్రసార మంత్రిత్వ శాఖలో పలు విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. తన 30 ఏళ్ల పదవీకాలంలో పత్రికా సమాచార కార్యాలయం బెంగుళూరు అదనపు డైరెక్టర్ జనరల్‌గా, ఏపీ రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్‌గా, ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్లలో డైరెక్టర్‌గా, భవనేశ్వర్ పత్రికా సమాచార కార్యాలయం డైరెక్టర్‌గా వివిధ హోదాల్లో పనిచేశారు. -
ఇక ‘సోషల్ మీడియా హబ్’!
న్యూఢిల్లీ: కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకాల అమలు, జిల్లాలో ట్రెండింగ్ సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుగా ‘సోషల్ మీడియా కమ్యూనికేషన్ హబ్’ను ప్రారంభించనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ తెలిపింది. ఈ ప్రాజెక్టులో భాగంగా సమాచార సేకరణకు ప్రతి జిల్లాలో మీడియా ప్రతినిధుల్ని కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తామని వెల్లడించింది. వీరు ఆయా జిల్లాల్లో జరిగే సంఘటనలతో పాటు కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల అమలుపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటారని పేర్కొంది. ఈ సమాచారాన్ని విశ్లేషించడానికి కేంద్ర స్థాయిలో నిపుణుల్ని నియమిస్తామంది. ఈ ప్రాజెక్టు ఇంగ్లిష్, హిందీ, తెలుగు, బెంగాలి, తమిళ్, కన్నడ సహా పలు భాషల్ని సపోర్ట్ చేస్తుందనీ.. దీంతో అన్ని సామాజిక మాధ్యమాలు, డిజిటల్ మీడియాల్లోని సమాచారాన్ని సేకరించవచ్చంది. -
సమాచార హక్కుతో సుపరిపాలన
కేంద్ర సమాచార శాఖ కమిషనర్ మాడభూషి శ్రీధర్ సెంట్రల్ యూనివర్సిటీ: సమాచార హక్కు చట్టం దేశంలో రెండో స్వాతంత్య్ర సంగ్రామం లాంటిదని కేంద్ర సమాచార శాఖ కమిషనర్ మాడభూషి శ్రీధర్ పేర్కొన్నారు. యూజీసీ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ‘సమాచార హక్కు చట్టం తీరుతెన్నులు’ అనే అంశంపై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ ప్రభుత్వాలు సుపరిపాలన అందించేందుకు ఆర్టీఐ ఎంతో దోహదపడిందన్నారు. 2005లో మొదలైన ఆర్టీఐ ద్వారా సామాన్యులు సైతం విలువైన సమాచారాన్ని పొందగలిగారని తెలిపారు. క్షేత్ర స్థాయిలో ప్రజలకు ఈ చట్టంపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. యూనెటైడ్ నేషన్స్ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ప్రతినిధి ఎస్.రామారావు మాట్లాడుతూ 1990లో 13 దేశాలు మాత్రమే ఆర్టీఐని అమలు చేస్తే.. ప్రస్తుతం 100 దేశాల్లో ఈ చట్టం విజయవంతంగా అమలవుతోందన్నారు. రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ ఎస్.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్యంలో మైలు రాయి వంటిదని కొనియాడారు. స్వల్ప కాలంలో తక్కువ ఖర్చుతో ప్రజలకు అవసరమైన సమాచారం ఈ చట్టం ద్వారా పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీయూ ఇన్చార్జి వీసీ ఆర్.పి శర్మ, యూజీసీ హ్యుమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ సెంటర్(హెచ్‌సీయూ) ఇన్చార్జి డెరైక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.