Sridhar madabhusi
-
‘రూల్ ఆఫ్ లా’ను కాటేస్తున్న కరోనా
అసలే మందులేని రోగం. కావలసినన్ని ఐసీయూ గదులు, డాక్టర్ల మాస్క్‌లు కూడా లేవు. లాక్డౌన్ తప్ప ఏ ప్రభుత్వమూ ఏమీ చేయలేని దీన దశ. నోరుమూసుకుని ఇంట్లో ఉండటం తప్ప పౌరులు చేయగలిగిన పనేదీ కనిపిం చడం లేదు. చస్తామేమో అనే భయం వల్లే వారాల తరబడి దిగ్బంధనాలకు అంత అవసరం, ప్రాణాం తక ప్రాధాన్యం వచ్చి పడింది. కర్ఫ్యూలో బయటకు వచ్చిన వాడిని తంతున్నారు. వంగబెట్టి లాఠీ లతో ఎడాపెడా కొడుతున్నారు. కానీ పెద్ద మీటిం గ్లు, సమావేశాలు పెట్టిన వారు, మతబోధలు చేసేవారు, కావాలని తుమ్మిన వారు, ఉమ్మిన వారు, దగ్గి తుంపరలు పంచి రోగాలు పెంచేవారు.. లాఠీ లతో ఎవరు కొడతారు వీళ్లను? ఏమైనా కానీ ఈసారి అయోధ్యలో శ్రీరామనవమి ఉత్సవాలు జరిపి తీరతానంటాడు ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. కరోనా వైరస్ అల్లా పంపిన సైనికుడు అంటాడు ఒక ఇమాం. లాకౌట్‌లో బయటకు వస్తే పిర్రల మీద లాఠీ దెబ్బలు తినాలి. కాని ఉత్సవాలు, ప్రబోధాలు చేసుకుంటే ఫరవాలేదా? ఢిల్లీ నిజాముద్దీన్‌లో తబ్లీఘీ అమిర్ సాడ్, దేశ విదేశీ ప్రతినిధులతో మాట్లాడుతూ, లాక్డౌన్ పైన, కరోనా వైరస్ పైన అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఒక జాతీయ టీవీ చానల్ వీడియోలో చూపింది. కరోనా విషానికి మతం, రాజకీయ రంగులు పులమడం, చివరకు జీహాద్ ఆయుధంగా కూడా వాడుకోదలచుకుంటే, ఈ రోగానికి ఎందరు ఆహుతి అవుతారు? మొదటి కరోనా మరణం మనదేశంలో జనవరి 30న చూసాం. మార్చి 19 దాకా ప్రభువులు రాజకీయాలతో బిజీగా ఉన్నారు. యంత్రాంగాలు నిద్రలో ఉన్నాయి. హఠాత్తుగా జనతా కర్ఫ్యూ ప్రకటించారు. అది ముగిసిందో లేదో లాక్డౌన్ మొదలైంది. ఎయిర్ పోర్టులు, రైళ్లు, బస్సులు, మెట్రోలు నిలిచిపోయాయి. అయినా రకరకాల సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. నిజాముద్దీన్ నుంచి మత ప్రచారాలకై మారుమూల గ్రామాలకు వెళ్తూనే ఉన్నారు. ఇండోనేషియా వారు తెలంగాణకువచ్చి కరోనా కరచాలనాలు, వైరస్ మతప్రబోధాలు చేసారు. ఆరుగురు చనిపోయారు. తబ్లిఘీ సమావేశాల్లో హాజరైన వేలాది మంది దేశంలో ఏ మూలకు వెళ్లి ఎందరిని కలిశారో ఆరా తీయడానికి వారిని వెంటాడి వేటాడి పట్టుకుని ఒంటరి చేసి, బస్సుల్లో దవాఖానలకు తీసుకుపోవడానికి ఒక కేంద్ర ప్రభుత్వం, అనేకానేక రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతి పదికన చర్యలు తీసుకుంటున్నాయి. ఢిల్లీలో వారిని దవాఖానకు తరలిస్తుంటే సిబ్బందిమీద తుమ్ముతూ రోడ్ల మీద ఉమ్ముతున్న ఈ ప్రబోధకులను ఏం చేయాలి? తెలంగాణలో కరోనాను పారద్రోలుతున్నాం అని భావిస్తున్న దశలో నిజాముద్దీన్ తబ్లిఘీ మతప్రచారకుల ప్రవేశం కథ మళ్లీ మొదటికి తెచ్చింది. అంతగా దెబ్బతినలేదనుకున్న ఏపీలో, తమిళనాడులో వైరస్ బాధితులు పెరిగిపోతూనే ఉన్నారు. విదేశీ టూరిస్టు వీసాల మీద వచ్చి, మత ప్రచారాల్లో పాల్గొంటూ ఉంటే, వీసా గడువు దాటి ఇక్కడే ఉంటే, లాకౌట్ తరువాత కూడా వీరు ఢిల్లీ మధ్యలో నివసిస్తూ ఉంటే, అక్కడనుంచి వేలాది మంది విదేశీయులు, స్వదేశీయులు గ్రామాలకు తరలిపోతూ ఉంటే, తెలియని నిఘా వ్యవస్థ, విదేశీ మంత్రిత్వశాఖ, ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు? తబ్లీఘీ ఏం చేస్తుందో నిఘా వాళ్లకు తెలి యదా? కౌలాలంపూర్‌లోని శ్రీ పెటాలింగ్ మసీదులో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1 దాకా జరిపిన తబ్లీఘీ సమావేశాలలో పదహారు వేలమంది పాల్గొనడం,ఆగ్నేయాసియాలో కరోనా వైరస్‌ను భయానకంగా వ్యాప్తి చేసిన మహాసభగా దీనికి అపకీర్తి రావడం నిఘావారికి తెలియదా? వారి కదలికల మీద కన్నేసి ఉంచాల్సిన బాధ్యత లేదా? 500 మందికి వీరు వైరస్ అంటించారని వార్తలు వచ్చాయి. ఇండోనేసియా వణికిపోయింది. ‘ఈ ప్రపంచంలో జీవనసౌఖ్యం కొంతే, మరణించిన తరువాత ఆనందంతో పోలికే లేదు’ అని మలేసియాలో తబ్లీఘీ ప్రచార నినాదం. పాక్‌లో కూడా వీరు లాక్డౌన్ లను, కర్ఫ్యూలను ధిక్కరించి మసీదుల్లో సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఒకరికి అంటిస్తే నేరం. కాని వందలాది మందికి కరోనా కావాలని తగిలిస్తే జనహనన ఘోరం కాదా? ఈ కరోనా వైరస్ మన రూల్ ఆఫ్ లాను కబళిస్తే ప్రజాస్వామ్యాన్ని ఐసీయూలో పెట్టి డాక్టర్లు బతికిస్తారా బ్రదర్? మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
మరణం లేని లవణం
నివాళి లవణంను పత్రికలు ప్రముఖ నాస్తికుడు అని వర్ణిం చడం ఆయన విలక్షణమైన వ్యక్తిత్వానికి ఏమాత్రం పరిచయం కాదు. ఆయన సుదీర్ఘ జీవనయానంలో నాస్తికత ఒక అంశం మాత్రమే. వకుళాభరణం రాసి నట్టు దాన్ని ఒక మతం వలె ఆయన ప్రచారం చేయ లేదు. పక్కవాడి గురించి ఆలోచించే లక్షణం, సమా జం గురించి పరితపించే లక్షణం లవణం. కుల మతాలు ఉండరాదని ప్రతి వాడూ పెదాల కొసల నుంచి మాట్లాడే వాడే కాని కులతత్వాన్ని వదిలిం చుకున్నవాడు మనకు ఎక్కడో గాని కనిపించడు. ఆ అరుదైన వ్యక్తి లవణం. తెలంగాణ రాష్ర్టం ఏర్పడవలసిన చారిత్రిక సత్యాన్ని విజయవాడ నడిబొడ్డు నుంచి చాటి చెప్పి న ఆలోచనాశీలి లవణం. తెలంగాణ, ఆంధ్రా ప్రాం తాల మధ్య సాంఘిక సాంస్కృతిక బాంధవ్యాలు ఏర్పడలేదని చరిత్ర సూచిస్త్తున్నదన్నారు లవణం. ఆవేశపూరితమైన ఈ సమస్య వెనుక మూలాల్లోకి వెళ్లిన వ్యక్తిత్వం ఆయనది. ఆంధ్రా నుంచి తెలంగా ణకు వలస వెళ్లి విస్తారమైన భూములు కొని, విద్యా వ్యాపారసంస్థలు నెలకొల్పి, పరిశ్రమలు స్థాపించి, భారీ ఎత్త్తున పెట్ట్టుబడులు పెట్టడం తెలంగాణవా సుల్లో అభద్రతా భావాన్ని పెంచింది. ఎన్ఆర్ ఐలు కూడా ఆ ప్రాంతంలో నిధులు దింప డంతో తమను ఆంధ్రా వారు దోచు కుంటున్నారన్న అభిప్రాయం కలిగిం దని ఆయన వివరించారు. నిరంకుశ ని జాం మీద పోరాడిన తెలంగాణ నా యకుడు బూర్గుల రామకృష్ణారా వుకు విశాలాంధ్రకు తొలి ముఖ్య మంత్రిగా ఉండే అవకాశం ఇవ్వా ల్సిందని, అప్పుడు మేం మీతో ఉన్నామని ఆం ధ్రులు అంటున్నారనే భావన ఏర్పడి ఉండేదన్నారు. తెలంగాణతో లవణం లోతైన నిజమైన అను బంధం కలిగి ఉన్నారు. ఆయన తెలంగాణకు భూ ముల వ్యాపారం చేయడానికి రాలేదు. చదువు అమ్మి పేదలను కొల్లగొట్టాలని రాలేదు. సేవాభిలా షతో, సంస్కరణాభిలాషతో వచ్చారు. మూఢ నమ్మ కాలపైన అంటరానితనం మీద ఆయన సాగించిన పోరాటాలకు తెలంగాణ జిల్లాలు వేదికైనాయి. భార్య హేమలతతో కలిసి నిజామాబాద్, మెదక్ జిల్లాలలో జోగిని వ్యవస్థను సంస్క రించడానికి లవణం తపించారు, శ్రమించారు. ‘నేను మూడు తరాల తెలంగాణ ప్రజలతో కలిసి పనిచేశా ను. అక్కడ సగటు మనిషి నాడి నా కు తెలుసు. తెలంగాణను వ్యతిరే కించే వారు నిజానికి ఆ ప్రాంతంలో తమ ఆర్థిక సామ్రాజ్యాన్ని విస్తరిం చాలనే దురాశ కలిగిన వారే’ అని విశ్లేషించిన ఆలోచనాపరుడు లవణం. చాలా మంది అందంగా చెప్పుకునే సమైక్య నినాదం ఒక డొల్ల అనీ, పూర్తి ఖాళీదని లవణం తేల్చారు. ‘తెలంగాణ ప్రత్యేక రాష్ర్టం అంటే కేవలం రాజకీయ విభజన మాత్రమే. దాన్ని మనం ఒప్పు కోవాలి. రెండు ప్రాంతాల (ఇప్పుడు రెండు రాష్ట్రా ల) మధ్య సామాజిక సాంస్కృతిక సమైక్యత పెరగ డానికి ఇప్పటికైనా కృషి చేయాలి’ అన్నారాయన. లవణం తెలంగాణవాది కాదు. ఆయన అసలైన సమైక్యవాది. తెలంగాణను వ్యతిరేకించే రాజకీయ కారణాలన్నీ ఇప్పుడు అంతరించాయి కనుక, లవ ణం మాటలలో లోతును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవలసిన అవసరం ఏర్పడింది. నేరగాళ్ల వంశాలంటూ ఉండవు. పరిస్థితులు, పేదరికం, అవమానాలు దోపిడీ మంచి వారిని కూడా నేరస్తులను చేస్తాయి అనే అవగాహనతో ఆం ధ్రప్రదేశ్‌లో క్రిమినల్ ట్రైబ్స్‌గా పేరొందిన వర్గాల ప్రజలను సాధారణ జీవన స్రవంతిలో ప్రవేశ పెట్ట డానికి లవణం చేసిన కృషి సామాన్యమైంది కాదు. లవణం లేకపోవడం నేరస్తుల వంశం అని నిందలు భరించే కుటుంబాలకు తీరని నష్టం. మానవతావాదులకు అండగా ఆలోచించే ఆద రవు కనుమరుగైపోయింది. తన మనసు తెలిసిన మంచి మిత్రుడిని తెలంగాణ కోల్పోయింది. బతికి నంత కాలం సమాజం వైపే చూసిన లవణం కళ్లు ఓ ఇద్దరికి చూపునివ్వబోతున్నాయి ఆయన కళ్లు దానం చేశారు కనుక. ఆయనలో అంగాంగం, అణువణువు మానవ శరీర పాఠాలకు సజీవ సాక్ష్యాలు కాబోతు న్నాయి, వైద్య కళాశాలకు శరీరాన్ని దానం చేసు కున్నారు కనుక. కాబట్టి లవణానికి మరణం లేదు. మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
సమాచార హక్కుతో సుపరిపాలన
కేంద్ర సమాచార శాఖ కమిషనర్ మాడభూషి శ్రీధర్ సెంట్రల్ యూనివర్సిటీ: సమాచార హక్కు చట్టం దేశంలో రెండో స్వాతంత్య్ర సంగ్రామం లాంటిదని కేంద్ర సమాచార శాఖ కమిషనర్ మాడభూషి శ్రీధర్ పేర్కొన్నారు. యూజీసీ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ‘సమాచార హక్కు చట్టం తీరుతెన్నులు’ అనే అంశంపై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ ప్రభుత్వాలు సుపరిపాలన అందించేందుకు ఆర్టీఐ ఎంతో దోహదపడిందన్నారు. 2005లో మొదలైన ఆర్టీఐ ద్వారా సామాన్యులు సైతం విలువైన సమాచారాన్ని పొందగలిగారని తెలిపారు. క్షేత్ర స్థాయిలో ప్రజలకు ఈ చట్టంపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. యూనెటైడ్ నేషన్స్ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ప్రతినిధి ఎస్.రామారావు మాట్లాడుతూ 1990లో 13 దేశాలు మాత్రమే ఆర్టీఐని అమలు చేస్తే.. ప్రస్తుతం 100 దేశాల్లో ఈ చట్టం విజయవంతంగా అమలవుతోందన్నారు. రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ ఎస్.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్యంలో మైలు రాయి వంటిదని కొనియాడారు. స్వల్ప కాలంలో తక్కువ ఖర్చుతో ప్రజలకు అవసరమైన సమాచారం ఈ చట్టం ద్వారా పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీయూ ఇన్చార్జి వీసీ ఆర్.పి శర్మ, యూజీసీ హ్యుమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ సెంటర్(హెచ్‌సీయూ) ఇన్చార్జి డెరైక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
సాక్ష్యముంటే ‘బాస్’ కూడా నిందితుడే
అభిప్రాయం కేసీఆర్‌కూ, చంద్రబాబుకూ మధ్య పోటీ కనుక ‘గేమ్’ అని రేవంత్‌రెడ్డి అనడంవల్ల చంద్రబాబే లంచాలు పంపించాడనే ఆలోచన ఊహ స్థాయి దాటి సమాచారం విలువ తెచ్చుకుని సాక్ష్యంగా బలపడితే అతనూ నిందితుడయ్యే అవకాశం ఉంది. ఎంఎల్సీ ఎన్నికల నేప థ్యంలో యాభై లక్షల రూపా యల నోట్లు ఇస్తూ తెలుగు దేశం ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా దొరికి, లం చం ఇచ్చిన నేరానికి అరెస్ట య్యారు. ఈ ఘటనను రహస్య కెమెరాల ద్వారా విభిన్న కోణాల నుంచి చిత్రీక రించిన దృశ్యాలూ, దొరికిన డబ్బు మూట, పంచిన సహాయకుడు, వెంట వచ్చిన వ్యక్తి గట్టి సాక్ష్యాలే కనుక పోలీసు అధికారులు ఆయన్ను అరెస్టు చేసే నిర్ణయం తీసుకున్నారు. నేరగాడని అనుమానించడానికి తగిన సాక్ష్యాలు ఉండడం వల్లనే రేవంత్‌రెడ్డిని 14 రోజుల పాటు రిమాండ్ చే శారు. ఏదైనా రుజువైతేనే... నేరం జరిగిందని మామూలు వ్యక్తులు, పోలీసు అభి యోగపత్రాలు, మీడియా భావిస్తే సరిపోదు. ఓట్లు కొనుగోలు చేస్తున్నారనీ, అమ్ముకుంటున్నారనీ అంద రూ అనుమానిస్తున్నారు. కాని తగిన సాక్ష్యం ఉంటేనే కేసు నమోదవుతుంది. ప్రాధమిక సాక్ష్యాలుంటేనే అరెస్ట్ సాధ్యం. రుజువైతేనే జైలు. నేరగాడని రుజువైన తరు వాత కూడా బెయిల్ సాధ్యమే. అప్పీలులో కేసే కొట్టి వేస్తే ఏమీ ఉండదు. లంచం ఇవ్వడం, ఇవ్వజూపడం కూడా ఐపీసీ, అవినీతి నిరోధక చట్టం కింద నేరం. అంగీకరించడం, తీసుకోవడం, అడగడం కూడా నేరమే. ఈ నేరానికి సహకరించిన వారు, ఆర్థిక సాయం చేసినవారు, ఇత రత్రా సహకారం అందించిన వారు అంతా నేరగాళ్లే అవుతారని భారతీయ శిక్షాస్మృతి, నేరశాస్త్ర సూత్రాలు వివరిస్తున్నాయి. కొందరు వ్యక్తులు ఉమ్మడి ఉద్దేశంతో నేరానికి పాల్పడితే అందులో భాగస్థులంతా సమాన బాధ్యులై శిక్ష అనుభవిస్తారు. కాని వారికి ఉమ్మడి నేర ఉద్దేశం ఉందని రుజువు చేయాలి. ఐపీసీ సెక్షన్ 34 ఈ సూత్రాన్ని వివరిస్తున్నది. కలసి ఆలోచించినవారు నేరగాళ్లే... మరొక కీలకమైన నేర న్యాయసూత్రం సెక్షన్ 120 బి. క్రిమినల్ కుట్ర చేసిన వారు, అంటే నేరం చేయడానికి కలసి ఆలోచించి ఆచరించిన వారంతా నేరగాళ్లే. కానీ ఇక్కడ కూడా కుట్ర రుజువు కావాలి. కాన్స్పరసీ అంటే కలసి శ్వాసించడం. అంత దగ్గరగా కలసి నేరానికి ప్లాన్, ప్లాట్ రచించిన వారు, అందుకు సంబంధించిన సాక్ష్యాలుంటేనే నేరగాళ్లవుతారు. ఇంతకీ ఉమ్మడి ఉద్దే శాలు, కుట్రలు రుజువవుతాయా? కీలక సాక్ష్యం... ఓట్లు అమ్ముకున్నా నేరమే కనుక, వెంటనే ఓటర్లం దరినీ జైలుకు పంపడం న్యాయం కాదు, సాధ్యం కాదు. ఓట్లు అమ్ముకున్న నేరం రుజుైవైతే ైజైళ్లు సరిపోక పోయినా, సరిపోయినా వారు ఎన్ని లక్షల మంైదైనా సరే జైలుకు పంపడమే సమన్యాయం. కాని దొరికితేనే దొంగలు. రేవంత్‌రెడ్డి కేసులో వీడియో చిత్రాలతో పాటు, కీలకమైన సాక్ష్యం- నియమిత ఎమ్మెల్యే స్టీఫెన్ సన్దే అవుతుంది. వీడియోలు, డ బ్బుమూటలు, నోట్ల లెక్కల వివరాలు, ఇచ్చిపుచ్చుకోవడాలు, వచ్చిన సమ యం, సంచి పైకి మోసిన సమయం, నోట్లు తీసి బల్ల మీద పెట్టిన సమయం, స్టీఫెన్సన్ చెప్పిన ప్రతి మాటకు సమర్థన అయితేనే, ఆ మాటలను బలోపేతం చేసే మరికొన్ని సాక్ష్యాలు జత కూడితేనే నేరం రుజువ వుతుంది. ప్రస్తుతం మనముందు, కోర్టుల ముందు, మీడియా ముందు సమాచారమే ఉంది. అవి సాక్ష్యా లవుతాయో లేవో తెలియదు. మీడియాలో వచ్చిన వీడియో ఫుటేజ్ సమాచారం, ఏసీబీ తీసిన వీడియో చిత్రాలు, అసైలైనవనీ, వాటిని ఎవరూ మార్చలేదని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో తేలితేనే సాక్ష్యం అవుతుంది. ఇప్పుడు ఇంకా ఆ సాక్ష్యాన్ని ప్రవేశపెట్టలేదు. ఆ సాక్ష్యం రేవంత్‌రెడ్డి నేరాన్ని రుజువుచేసే అవకాశం ఉంది కనుక అతను నిందితుడై అరెస్టయినాడు. ఆయన కారు నడి పిన వాడు, డబ్బు సంచి పట్టుకొచ్చినవాడు, కట్టలు లెక్కపెట్టి బయట పెట్టినవాడు నేరంలో సహకరించి నట్టు సాక్ష్యం ఉండడం వల్ల వారు యజమాని (రేవంత్‌రెడ్డి)తో కలసి నేరగాళ్లుగానే ఉండిపోతారు. ‘బాస్’ మాటేమిటి? రేవంత్‌రెడ్డి కేసులో తనకు ‘బాస్ చెప్పాడ’ని అన్నట్టు రికార్డ్ అయింది. బాస్ ఎవరో అందరికీ తెలుసు కనుక, ఆ బాస్‌కూ శిక్ష పడాలని ఆశించడం ఆకాంక్షే అవుతుంది కాని సాక్ష్యం కాదు, సాక్ష్యం లేకుంటే శిక్ష సాధ్యం కాదు. కేసీఆర్‌కూ, చంద్రబాబుకూ మధ్య పోటీ ఉంది కనుక ‘గేమ్’ అని రేవంత్‌రెడ్డి అనడం వల్ల చంద్రబాబే లం చాలు పంపించాడనే ఆలోచన ఊహ స్థాయి దాటి సమాచారం విలువ తెచ్చుకుని సాక్ష్యంగా బలపడితే అతను కూడా నిందితుడయ్యే అవకాశం ఉంది. అది పరిశోధనలు, సాక్ష్యాల మీద ఆధారపడి ఉంటుంది. తెలంగాణ , ఆంధ్ర పోలీసులు కాకుండా నిష్పాక్షికమైన వారు, సీబీఐ లేదా ఇతర పోలీసు దర్యాప్తు బృందాలు దర్యాప్తు చేయాలని కూడా కోరవచ్చు. పోలీసులకు సవాలే! రాజకీయాల మాటెలా ఉన్నా పోలీసులకు మాత్రం ఇటువంటి కేసులు సవాళ్ల్లే. స్టీఫెన్సన్ అయిదు కోట్ల రూపాయలు రహస్యంగా అందుకుని ఉంటే పోలీ సులసమస్య ఇంకా జటిలంగా మారి ఉండేది. ఆయన పోలీసులకు చెప్పడం వల్ల, ఏసీబీ కెమెరాలతో సమర్థ వంతంగా వ్యవహరించడం వల్ల ఈ సాక్ష్యాల సేకరణ జరిగింది. విచిత్రమేమంటే అబద్ధాలను అబద్ధాలని రుజువుచేసే అవకాశాలు ఈ దేశంలో కనిపించడం లేదు. ఇంతగా కెమెరాల్లో చిక్కిన తరువాత కూడా డబ్బు నేనివ్వలేదు, అంతడబ్బు నాకెక్కడిది, అయినా నేనెందుకు ఇస్తాను అనే అబద్ధాలను, ఇంకా పోలీ సులను లేదా ఇంకెవరినో బట్టలిప్పించి కొడతాను అనే మాటలకు ఏ పర్యవసానాలూ లేకపోవడం మరొక విచిత్రం. దర్యాప్తులు సమర్థవంతంగా ైనైపుణ్యంతో నిర్వహించి, బలమైన సాక్ష్యాలు దొరికి, విచారణ సకాలంలో జరిగితేనే కుట్రదారులంతా దొరుకుతారు, జైలుకు వెళతారు. అవినీతి కేసుల దర్యాప్తు, విచారణ, ప్రాసిక్యూషన్‌లో అవినీతి లేకుండా ఉంటేనే అవినీతి అంతమవుతుంది. professorsridhar@gmail.com మాడభూషి శ్రీధర్ -
శ్రద్ధగా చదవడమా, ఆర్టీఐ వేయడమా?
విశ్లేషణ తొమ్మిదో తరగతి కంపార్ట్మెంట్లో ఫెయిల్ అయిన విద్యార్థులు వెనుకబడిన వారైనా, మరొకరైనా ప్రమోట్ కావడానికి వీల్లేదు. కాని కొందరిని పదో తరగతికి పంపి ఒక్కరినే ఆపివేయడం జరిగితే వారి విద్యాహక్కును వివక్షతో బలిచేసినట్టే. సమాచార కమిషన్ ముందు అప్పీలు కేసుల విచారణ మొదలు కాగానే తన తల్లితో కలిసి తొమ్మిదో తరగతి అమ్మా యి కోర్టు హాలులోకి వచ్చింది. విద్యాహక్కు చట్టం అమలులో భాగంగా ఢిల్లీ పాఠశాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లల కోటా కింద ఆమె విద్యా ర్థి. ఆర్టీఐ చట్టం కింద దరఖాస్తు పెట్టాలన్న చైతన్యం ఆ వయసులోనే రావడం గొప్పే. కాని అవసరమా అని ప్రశ్న. గణితం, విజ్ఞానశాస్త్రం వార్షిక పరీక్షల్లో, తరువా త కంపార్ట్మెంటల్ పరీక్షల్లో కూడా ఆమెకు పాస్ మార్కులు రాలేదు. తను రాసిన జవాబు పత్రాల నకళ్లు, వచ్చిన మార్కుల వివరాలు ఇవ్వాలని సమాచార హక్కు కింద ఆ అమ్మాయి పాఠశాల అధికారులను అడిగింది. వారు ఇవ్వకపోతే విద్యాశాఖ అధికారుల ద్వారా కోరిం ది. తమ శాఖలో ఆ పత్రాలు ఉండబోవని వారు సమా ధానం చెప్పారు. మొదటి అప్పీలు చేసుకున్నది. అక్కడి అధికారి కూడా అదే సమాధానం చెప్పారు. కేంద్ర సమా చార కమిషన్ ముందు రెండో అప్పీలు దాఖలు చేసింది. పరీక్ష రాసిన విద్యార్థికి మార్కులు తెలుసుకునే హక్కు ఉంది. ఉప్రాస్ విద్యాలయం ప్రభుత్వ ఆర్థిక సా యం లేకుండా నడిచే ప్రయివేటు బడి కనుక చెప్ప వలసిన అవసరం లేదనడానికి వీల్లేదు. ఎందుకంటే విద్యాహక్కు చట్టంలో విద్యార్థినికి సమాచార హక్కు కూడా ఇచ్చింది. అంతేకాదు ఢిల్లీ విద్యాచట్టం కింద కూడా విద్యాశాఖ ద్వారా రాసిన పేపరు కాపీ అడిగే హక్కు కూడా ఉంది. ఇవి ప్రత్యేకంగా అడగకుండానే పాఠశాల యజమానులు ఇవ్వవలసిన వివరాలు. లేదా విద్యాశాఖ వాటిని ఇప్పించాలి. తన కూతురుకు అన్యాయం జరిగిందని తల్లి వాదించింది. ఉప్రాస్ విద్యాలయ పాఠశాల ప్రిన్సిపల్ కు వెనుకబడిన తరగతి కోటా పిల్లలంటే ఇష్టం లేదని, ఆ ధోరణికి తన కూతురు బలైపోయిందని ఆమె ఆరో పించారు. కావాలని తన కూతురును ఫెయిల్ చేశారని తనతో పాటు ఫెయిలైన ముగ్గురు విద్యార్థులను పదో తరగతికి పంపి తన కూతురును మాత్రం 9లోనే ఆపే శారని కూడా నిందించారు. తనకు జవాబు పత్రాలు ఇవ్వాలని పట్టుబట్టారు. మార్కులు చెప్పమంటే చెప్ప కుండా గ్రేడ్లు మాత్రమే ఇచ్చారని తెలిపింది. తొమ్మిది పాయింట్ల స్కేలులో ఈ అమ్మాయికి 3.6 గ్రేడ్ వచ్చింది. మొత్తం మీద ఇ1 ఇ2 గ్రేడ్ వచ్చాయని, ఇ1 అంటే 21 నుంచి 30 మార్కులనీ, ఇ2 అంటే సున్నా నుంచి 20 మార్కులని ఆ అమ్మాయికి ఇచ్చిన ప్రోగ్రెస్ రిపోర్ట్‌లోనే వివరంగా ఉంది. కాని రిపోర్ట్‌లో ‘ఈఐఓపీ’ అని రాశారు. అంటే చదువులో మెరుగయ్యే అవకాశం ఉందని. ఆ అమ్మాయికి సరైన మార్గదర్శకత్వం చూపవ లసిన బాధ్యత పాఠశాల అధికారుల మీద ఉంది. గ్రేడ్ లు ఇవ్వడం ద్వారా మార్కులు ఇచ్చారని అనుకున్నా, ఆ అమ్మాయితోపాటు కంపార్ట్మెంట్ పరీక్షల్లో ఫెయిలైన ముగ్గురు విద్యార్థులను 10వ తరగతికి ప్రమోట్ చేసి ఈ అమ్మాయిని ఆపినారనే ఆరోపణకు జవాబు ఇవ్వవల సిన అవసరం కూడా ఉంది. నలుగురు పిల్లల జవాబు పత్రాలతో సహా పాఠ శాల ప్రిన్సిపల్ పీకే శ్రీవాస్తవను కమిషన్ ముందు హాజ రు కావాలని సమన్లు జారీ చేశాను. ఇటువంటి వివక్ష ఏదైనా జరిగిందా లేదా అని విద్యాశాఖ అధికారులను కూడా విచారించే బాధ్యత ఉంది. ఈ ఆర్టీఐ దరఖాస్తునే ఫిర్యాదుగా పరిగణించి విచారణ జరపాలని ఆదేశిం చాను. ఇది మౌలికంగా విద్యా హక్కుకు సంబంధించిన సమస్య. తొమ్మిదో తరగతి కంపార్ట్మెంట్లో ఫెయిల్ అయిన విద్యార్థులు వెనుకబడిన వారైనా, మరొకరైనా ప్రమోట్ కావడానికి వీల్లేదు. కాని కొందరిని పదో తర గతికి పంపి ఒక్కరినే ఆపివేయడం జరిగితే వారి విద్యా హక్కును వివక్షతో బలిచేసినట్టే. తొమ్మిదో తరగతి బాలిక అమ్మాయి చదువు తీరు ఏనాడూ మెరుగ్గా లేదని ఆమె ప్రగతి నివేదికలో చాలా స్పష్టంగా ఉంది. మార్కులు విద్యార్థినికి తెలియనివ్వలే దన్న మాట కూడా వాస్తవం కాదు. గ్రేడ్ చాలా స్పష్టంగా ఇవ్వడమే గాక వాటికి సమానమైన మార్కులు కూడా వివరించడమైంది. ఒక్క జవాబు పత్రాలు తప్ప పాఠ శాల ఇవ్వకుండా వదిలేసిందేమీ లేదు. ఫెయిలైన ముగ్గ్గు రిని పదోతరగతికి పంపి తమను పంపలేదన్న ఆరోపణ సమాచార దరఖాస్తులో లేదు. విచారణ సమయంలో ఈ ఆరోపణ చేశారు. ఇదివరకు ఫెయిలైనంత మాత్రాన ఈ పరీక్షలో కూడా ఫెయిలైనట్టే అని భావించడానికి వీల్లేదు. మొదటి నుంచి ఇటువంటి తక్కువ గ్రేడ్ పెట్టుకుని ఇంకా బాగా చదవాలన్న ధ్యాస లేకుండా ఆర్టీఐ పోరాటాలు ఎంత వరకు సమంజసం అనే అనుమానం రాకమానదు. కమి షనర్‌గా ఆ అమ్మాయిని అదే ప్రశ్న వేశాను. తల్లి జవాబు ఇస్త్తుంటే, ఆ అమ్మాయిని మాట్లాడనివ్వమని కోరవలసి వచ్చింది. తను బాగా చదవకుండా ఆర్టీఐ వెంట పడటం వల్ల ఏడాదిన్నర నష్టమైందని ఆ అమ్మాయి గుర్తించింది. తల్లి ఏం సాధించినట్టు అని అడిగితే మౌనం పాటిం చింది. తల్లికి కూడా లోపం అర్థం అయింది. విద్యా హక్కు, సమాచార హక్కు ఉన్నమాట వాస్తవమే కాని అంతకన్న కఠినమైన వాస్తవాలను పక్కన పెట్టడం విద్యార్థులకు, అధికారులకూ మంచిది కాదు. (షంషీరా బేగం వర్సెస్ విద్యాశాఖ కేసులో మే 26న నా ఆదేశం ఆధారంగా) (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్) professorsridhar@gmail.com మాడభూషి శ్రీధర్ -
పర్యావరణ యుద్ధాలు ప్రమాదకరం
కేంద్ర సమాచార హక్కు కమిషనర్ మాడభూషి శ్రీధర్ మహబూబ్‌నగర్: ప్రపంచంలో పర్యావరణ యుద్ధాలు ఎంతో ప్రమాదకరంగా మారాయని కేంద్ర సమాచార హక్కు కమిషనర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్‌లో పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో యుద్ధవ్యతిరేక కవిసభలో ఆయన మాట్లాడారు. యుద్ధం ఎన్నటికీ ముగియదని, రెండు యుద్ధాల మధ్య నెలకొన్న సంధికాలమే శాంతికి నిర్వచనంగా పేర్కొన్నారు. ఆర్థిక ప్రయోజనాల కోసమే అమెరికా యుద్ధాలు చేస్తోందని చెప్పారు. యుద్ధం లేని ప్రపంచం రావాలంటే ప్రభుత్వాలు, ప్రజల మీద బాధ్యత ఉంటుందన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ యుద్ధం వల్ల ఏ దేశం కూడా బాగుపడదని, మానవీయ విలువల విధ్వంసానికి దారితీస్తుందన్నారు. ప్రజాకవి గోరటి వెంక న్న తన పాటల ద్వారా అమెరికా సామ్రాజ్యవాదం.. ఇతర దేశాలపై జరుపుతున్న దాడులు వివరించడంతోపాటు వాటికి అడ్డుకట్ట వేసేందుకు సంఘటిత పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.