
పర్యావరణ యుద్ధాలు ప్రమాదకరం
కేంద్ర సమాచార హక్కు కమిషనర్ మాడభూషి శ్రీధర్
మహబూబ్‌నగర్: ప్రపంచంలో పర్యావరణ యుద్ధాలు ఎంతో ప్రమాదకరంగా మారాయని కేంద్ర సమాచార హక్కు కమిషనర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్‌లో పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో యుద్ధవ్యతిరేక కవిసభలో ఆయన మాట్లాడారు. యుద్ధం ఎన్నటికీ ముగియదని, రెండు యుద్ధాల మధ్య నెలకొన్న సంధికాలమే శాంతికి నిర్వచనంగా పేర్కొన్నారు. ఆర్థిక ప్రయోజనాల కోసమే అమెరికా యుద్ధాలు చేస్తోందని చెప్పారు.
యుద్ధం లేని ప్రపంచం రావాలంటే ప్రభుత్వాలు, ప్రజల మీద బాధ్యత ఉంటుందన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ యుద్ధం వల్ల ఏ దేశం కూడా బాగుపడదని, మానవీయ విలువల విధ్వంసానికి దారితీస్తుందన్నారు. ప్రజాకవి గోరటి వెంక న్న తన పాటల ద్వారా అమెరికా సామ్రాజ్యవాదం.. ఇతర దేశాలపై జరుపుతున్న దాడులు వివరించడంతోపాటు వాటికి అడ్డుకట్ట వేసేందుకు సంఘటిత పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.