సమాచార హక్కు చట్టం కింద అడిగిన సమాచారాన్ని సకాలంలో ఇవ్వని ఫలితంగా ఆదోని తహసీల్దారు శ్రీనివాసరావుకు ...
► రూ.25వేల జరిమానా విధింపు
► సకాలంలో సమాచారం ఇవ్వని ఫలితం
ఆదోని: సమాచార హక్కు చట్టం కింద అడిగిన సమాచారాన్ని సకాలంలో ఇవ్వని ఫలితంగా ఆదోని తహసీల్దారు శ్రీనివాసరావుకు రూ.25వేల జరిమానా విధిస్తూ సమాచార హక్కు కమిషనరు తాంతియా కుమారి తీర్పు చెప్పారు. ఈ నెల 4న వెలువరించిన తీర్పు ప్రతులు తనకు 23న అందాయని ఆదోనికి చెందిన దరఖాస్తుదారు ఎం గౌస్‌బాషా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తీర్పు ప్రతులను కూడా జత చేశారు. మండగిరి పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 211, 212, 217, 218 స్థలాలను ఎవరెవరికి పంపిణీ చేశారో తెలియజేయాలని సమాచార హక్కు చట్టం కింద గౌస్‌బాషా దరఖాస్తు చేసుకున్నారు.
అయితే ఏ సమాచారం కావాలో దరఖాస్తులో స్పష్టత లేదని పేర్కొంటూ తహసీల్దార్ ఆయనకు తిరిగి లేఖ రాశారు. దీంతో ఆయన సమాచారహక్కు కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తరువాత తనకు సమాచారం అందించినా సకాలంలో స్పందించలేదని గౌస్‌బాషా తెలిపారు. విచారణ జరిపిన కమిషనర్ తహసీల్దారుకు జరిమానా విధించడంతోపాటు సంజాయిషీ కోరారన్నారు. తహసీల్దార్‌తో మాట్లాడగా సమాచార హక్కు కమిషన్ నుంచి తనకు ఎలాంటి తాఖీదులు రాలేదని తెలిపారు.