న్యూఢిల్లీ: పీఎఫ్ డిపాజిట్లపై 8.75 శాతం వడ్డీ చెల్లించాలన్న ఈపీఎఫ్‌వో నిర్ణయానికి కేంద్ర ఆర్థిక శాఖ వచ్చే వారంలో ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. ఆగస్టు 26న కార్మిక మంత్రి నరేంద్రసింగ్ తొమర్ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన ఈపీఎఫ్‌వో కేంద్ర ట్రస్టీల బోర్డు సమావేశంలో పీఎఫ్ వడ్డీపై నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయానికి కేంద్ర ఆర్థిక శాఖ లాంఛనంగా ఆమోదించాల్సి ఉంది.
ఈపీఎఫ్‌వో 2012-13లో పీఎఫ్ డిపాజిట్లపై 8.50 శాతం వడ్డీ చెల్లించగా 2013-14లో 8.75 శాతం వడ్డీ చెల్లించింది. గతవారం ప్రకటించిన ఈ నిర్ణయాన్ని కేంద్ర ఆర్థికశాఖ లాంఛనంగా ఆమోదించి అమలు చేయాల్సి ఉంది. ఈపీఎఫ్‌వోకు సుమారు 5 కోట్ల మంది చందాదారులు ఉన్నారు.