కరోనా వైరస్ వ్యాప్తితో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించారు. ఆ తర్వాత అయినా లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేస్తారన్న విషయమై స్పష్టత లేదు. ఎన్నో పరిశ్రమలు మూతపడ్డాయి. నిత్యావసరాలు మినహా మిగిలిన దుకాణాలను తెరిచే పరిస్థితి లేదు. లాక్‌డౌన్ క్రమంగా ఎత్తివేసిన తర్వాత కూడా పరిస్థితులు తిరిగి ఎప్పుడు సాధారణ స్థితికి చేరుకుంటాయన్నదీ ఎవరూ చెప్పలేకుండా ఉన్నారు. ఎంతో మంది ఉద్యోగాలను కోల్పోయారు. వేతనాల్లో కోతలను కూడా చూస్తున్నాం.
ఈ పరిస్థితుల్లో ఆర్థికంగా ఎదురయ్యే కష్టాల నుండి గట్టెక్కేందుకు ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్) నుంచి మూడు నెలల వేతనాన్ని ఉపసంహరించుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఈ మొత్తం చాలని వారు, ఈపీఎఫ్ అవకాశం లేని వారు బ్యాంకులు ఆఫర్ చేస్తున్న టాపప్ హోమ్‌లోన్‌ను పరిశీలించొచ్చు. పర్సనల్ లోన్ కంటే ఈ టాపప్ రుణాలపై వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉండడాన్ని పరిశీలించాలి. తక్కువ వడ్డీ రేటుకే లభిస్తున్న టాపప్ హోమ్ రుణం తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి.
ఇప్పటికే తీసుకున్న ఇంటి రుణానికి అనుబంధంగా ఇచ్చే రుణమే టాపప్ హోమ్ లోన్. గరిష్టంగా మంజూరు చేసే రుణం, కాల వ్యవధి అనేవి బ్యాంకుల మధ్య వేర్వేరుగా ఉండొచ్చు. ప్రస్తుతం తాము ఇంటి రుణం తీసుకున్న బ్యాంకు నుంచి టాపప్ హోమ్‌లోన్ తీసుకోవచ్చు. లేదా ఇతర బ్యాంకు నుంచి తీసుకోవాలనుకుంటే ప్రస్తుత బ్యాంకు నుంచి ఇంటి రుణాన్ని బదలాయించుకున్న తర్వాతే అందుకు వీలు పడుతుంది. ముఖ్యంగా ఈ రుణాలపై వడ్డీ రేటు చాలా తక్కువగా ఉండడం ఆకర్షణీయమని చెప్పుకోవాలి.
ఇతర బ్యాంకులతో పోలిస్తే ఎస్‌బీఐ టాపప్ హోమ్‌లోన్‌పై తక్కువ రేటును వసూలు చేస్తోంది. ఎస్‌బీఐలో టాపప్ హోమ్ లోన్‌పై రేటు 7.6 శాతంగా ఉంటే, ఇతర బ్యాంకుల్లో ఇది 7.85 శాతం నుంచి ప్రారంభమవుతోంది. రుణాన్ని వినియోగించుకునే విషయంలో షరతుల్లేకపోవడం మరో అనుకూల అంశం. ఈ మొత్తాన్ని పిల్లల విద్యావసరాలు, రోజువారీ అవసరాలు, ఇంటి నవీకరణ, వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేయడం కోసం వినియోగించుకోవచ్చు.
కనుక కరోనా వైరస్ సంక్షోభ సమయంలో ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కేందుకు ఈ టాపప్ లోన్ అనుకూలమనే చెప్పుకోవాలి. అయితే, ‘‘లాక్‌డౌన్ సమయంలో ఇంటి రుణాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఇందుకోసం న్యాయ, సాంకేతిక మదింపు అవసరం అవుతుంది’’ అని రిటైల్ లెండింగ్ డాట్ కామ్ డైరెక్టర్ సుకన్యకుమార్ తెలియజేశారు. లాక్‌డౌన్ కాలంలోనే రుణం కావాలంటే వ్యక్తిగత రుణాలు తీసుకోవచ్చని సూచించారు.
అర్హతలు...
ప్రస్తుత ఇంటి రుణ గ్రహీతలు టాపప్ హోమ్‌లోన్ తీసుకునేందుకు అర్హులు. ఇంటి మార్కెట్ విలువ, చెల్లింపుల చరిత్ర, క్రెడిట్ స్కోర్ ఇవన్నీ రుణ అర్హతలను నిర్ణయిస్తాయి. టాపప్ హోమ్‌లోన్ తీసుకునేందుకు అప్పటికే కనీసం 9 నెలల నుంచి ఏడాది కాలానికి క్రమం తప్పకుండా రుణ చెల్లింపులు చేసిన చరిత్ర ఉండాలి. కొన్ని బ్యాంకులు నిర్మాణంలో ఉన్న వాటికి కాకుండా.. నిర్మాణం పూర్తి చేసుకున్న గృహాలపైనే టాపప్ హోమ్ లోన్‌ను ఆఫర్ చేస్తున్నాయి. ఇంటి మార్కెట్ విలువలో అప్పటికే తీసుకున్న రుణ మొత్తాన్ని మినహాయించి, మిగిలిన విలువలో 80% వరకు బ్యాంకులు ఈ రుణాన్ని ఇస్తున్నాయి. అయితే, కరోనా సంక్షోభంతో దేశవ్యాప్తంగా ఆస్తుల ధరలు పడిపోయాయి. దీంతో ఇంటి మార్కెట్ విలువ తగ్గి ఉంటుంది కనుక అది రుణ అర్హతలను ప్రభావితం చేయగలదు.
అన్నీ చూసిన తర్వాతే...
టాపప్ హోమ్ లోన్ తీసుకోవడానికి ముందు.. వడ్డీ రేట్లు వివిధ బ్యాంకుల్లో ఎలా ఉన్నాయి, ప్రాసెసింగ్ ఫీజు, రుణ కాల వ్యవధి ఈ అంశాలన్నింటినీ చూడాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకు ప్రస్తుతం మీ ఇంటి రుణం ఏ బ్యాంకులో తీసుకుని ఉంటే ఆ బ్యాంకు నుంచే తీసుకోవడం సౌకర్యం. లేదంటే ఇంటి రుణాన్ని వేరే బ్యాంకుకు బదలాయించుకున్న తర్వాత రుణాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఇందుకోసం సమయం తీసుకుంటుంది. ఇది లాక్‌డౌన్ కాలం కనుక బయటకు వెళ్లి అన్ని పనులు చేసుకునే అవకాశం లేదు. కనుక ఇంటి రుణం ఇచ్చిన బ్యాంకును సంప్రదించడమే సౌలభ్యం.
ముఖ్యంగా కొన్ని బ్యాంకులు టాపప్ హోమ్ లోన్‌ను ఆస్తిపై ఇస్తున్న రుణంగా పరిగణిస్తూ అధిక రేటును వసూలు చేస్తున్నాయి. ఈ జాబితాలో మీ బ్యాంకు కూడా ఉందేమో పరిశీలించుకోవాలి. ఒక వేళ రేటు గరిష్ట స్థాయిలో ఉంటే అప్పుడు వేరే మార్గాన్ని పరిశీలించాలి. బ్యాంకు ఆఫర్ చేస్తున్న టాపప్ హోమ్‌లోన్‌లో లాకిన్ పీరియడ్ ఉందేమో కూడా పరిశీలించుకోవాలి. ఎందుకంటే లాకిన్ పీరియడ్ ఉందనుకుంటే.. ఆ కాలంలో ముందుగానే రుణాన్ని తీర్చివేయాలనుకుంటే మిగిలిన రుణ బ్యాలన్స్ మొత్తంపై బ్యాంకులు 2 శాతం చార్జీని వసూలు చేయవచ్చు.
అన్ని అంశాలు తెలుసుకోవాలి
రుణం ఏదైనా కానీయండి.. అది మీ చివరి ఎంపికగానే ఉండాలి. ముఖ్యంగా వేతనాల్లో కోతలు, ఉద్యోగాల్లోంచి తొలగించే ప్రస్తుత పరిస్థితుల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే రుణం తీసుకున్న తర్వాత నుంచి ఈఎంఐలు మొదలవుతాయన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే ముందుగా అత్యవసర నిధి ఉంటే దాన్ని వినియోగించుకోవాలి. అది లేని సందర్భాల్లో ఈక్విటీ లేదా డెట్‌లో పెట్టుబడులు ఉంటే వాటిని విక్రయించుకోవాలి. లేదా బంగారం ఉన్నా కానీ విక్రయించి ఈ సంక్షోభ సమయాన్ని గట్టెక్కడం మంచిది. ఇవేవీ లేని సందర్భాల్లో ఈపీఎఫ్ నుంచి మూడు నెలల వేతనాన్ని వెనక్కి తీసుకోవచ్చు. ఇంటి రుణానికి అనుబంధంగా వచ్చే టాపప్ హోమ్‌లోన్ కాల వ్యవధి దీర్ఘకాలంతో ఉంటుంది. అయితే, ఓ ఏడాది రెండేళ్ల తర్వాత తిరిగి చెల్లించే సామర్థ్యం మీకు ఏర్పడితే.. అందుకు బ్యాంకు అవకాశం ఇస్తుందా.. జరిమానాలు, పెనాల్టీలు ఏవైనా ఉన్నాయేమో విచారించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment