కనీస పెన్షన్ అమలు
వేతన పరిమితి పెంపుపైనా ఈపీఎఫ్‌వో చర్యలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు పీఎఫ్ ఖాతాదారులకు కనిష్ట వేతన పరిమితి, కనీస పింఛను అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) తన సిబ్బందిని ఆదేశించింది. ఈపీఎఫ్‌వో పరిధిలోకి వచ్చే కనిష్ట వేతన పరిమితిని ప్రస్తుతమున్న రూ. 6,500 నుంచి రూ. 15 వేలకు పెంచుతున్నట్లు, అలాగే ఉద్యోగుల పెన్షన్ పథకం(ఈపీఎస్) కింద పెన్షనర్లకు కనీసం వెయ్యి రూపాయల పింఛను అందిస్తామని ఇటీవలి బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ దిశగా ఈపీఎఫ్‌వో సంస్థ కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ త్వరలోనే విడుదలకానుందని, ఈ నిర్ణయాల అమలు దిశగా చర్యలు తీసుకోవాలని తన సిబ్బందిని ఆదేశిస్తూ ఈపీఎఫ్‌వో కార్యాలయం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం ఉద్యోగి సర్వీస్ కాలంలోని చివరి 60 నెలల్లో పొందిన సగటు జీతాన్ని బట్టి పెన్షన్ మొత్తాన్ని లెక్కిస్తారు. ఇక పీఎఫ్ పరిధిలోకి వచ్చే కనిష్ట వేతన పరిమితిని కూడా పెంచిన నేపథ్యంలో అంతకన్నా అధిక మూల వేతనం పొందుతున్న ఉద్యోగులు ఆ మేరకు ఎక్కువ పీఎఫ్‌ను చెల్లించే విషయంపై అభిప్రాయాలు తీసుకోవాలని, వారి నిర్ణయాన్ని 6 నెలల్లో అమలు చేయాలని క్షేత్ర స్థాయి సిబ్బందిని ఈపీఎఫ్‌వో ఆదేశించింది.
వేతన పరిమితి పెంపు వల్ల మరో 50 లక్షల మంది ఉద్యోగులు ఈపీఎఫ్‌వో పరిధిలోకి రానున్నారు. అలాగే రూ. వెయ్యి కనీస పింఛ ను నిర్ణయం వల్ల దాదాపు 28 లక్షల మంది పెన్షనర్లు లబ్ధిపొందనున్నారు. కాగా, కనీసం పది మంది ఉద్యోగులున్న సంస్థలను ఈపీఎఫ్‌వో పరిధిలోకి తేచ్చే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోంది. ప్రస్తుతం కనీసం 20మంది ఉద్యోగులున్న సంస్థలకే పీఎఫ్‌ను వర్తింపజేస్తున్నారు. ఈ మేరకు చట్ట సవరణ చేయాలని యోచిస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి విష్ణుదేవ్ సాయి రాజ్యసభలో ఓ ప్రశ్నకు బదులిచ్చారు. అసంఘటిత రంగంలోని కార్మికులను ఈపీఎఫ్‌వో పరిధిలోకి తెచ్చే ఆలోచనేదీ ప్రస్తుతానికి లేదని కూడా తెలిపారు.