పీఎఫ్ డిపాజిట్లపై 9% వడ్డీ!
మెరుగుపడిన మార్కెట్ పరిస్థితుల ఫలితం
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) పీఎఫ్ డిపాజిట్లపై ఈ ఏడాది తొమ్మిది శాతం వడ్డీని అందజేసే అవకాశం కన్పిస్తోంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో తన ఐదు కోట్లకు పైగా చందాదారులకు ఈపీఎఫ్‌ఓ 8.75 శాతం వడ్డీని చెల్లించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఈ వడ్డీని 0.25 శాతం మేరకు సులభంగా పెంచే అవకాశం ఉన్నట్టు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోందని ఈపీఎఫ్‌ఓ వర్గాలు వెల్లడించారుు. ముఖ్యంగా కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెరుగుపడిన మార్కెట్ పరిస్థితులు.. సంస్థ పెట్టిన వివిధ రకాల పెట్టుబడుల ద్వారా అధిక లాభాలు సమకూరవచ్చనే అంచనాలను పెంచాయని ఆ వర్గాలు వివరించారుు.
ఈపీఎఫ్‌ఓ సాధారణంగా రూ.5 లక్షల కోట్ల మూలనిధిని నిర్వహిస్తూంటుంది. 2013-14లో వివిధ సామాజిక భద్రతా పథకాల కింద తన ఖాతాదారుల నుంచి రూ.71,195 కోట్ల ఇంక్రిమెంట్ల సంబంధిత డిపాజిట్లను స్వీకరించింది. ఇది అంతకుమునుపు ఏడాది (రూ.61,143 కోట్లు)తో పోల్చుకుంటే 16% అధికం. మరోవైపు ప్రత్యేక డిపాజిట్ పథకం (ఎస్‌డీఎస్) కింద ఉన్న సుమారు రూ.55 వేల కోట్ల తన పెట్టుబడులను నగదుగా మార్చే యోచనలో ఈపీఎఫ్‌ఓ ఉంది.