ఈపీఎఫ్‌ఓ ఈక్విటీ పెట్టుబడులు పెంచుతాం...
కార్మిక మంత్రి దత్తాత్రేయ వెల్లడి
హైదరాబాద్: ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్(ఈపీఎఫ్‌ఓ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్లో రూ.6,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. ఈ విషయమై బ్యాంక్‌లు, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్లు, బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ అధికారులతో చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు. వచ్చే నెలలో జరిగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్(సీబీటీ) సమావేశంలో ఈ విషయమై తుది నిర్ణయం తీసుకుంటారని వివరించారు.
గత ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్‌ఓ ఈక్విటీ మార్కెట్లో రూ.6,000 కోట్ల వరకూ పెట్టుబడులు పెట్టిందని, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంతకు మించి పెట్టుబడులు ఉండవచ్చని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించి స్వల్ప కాలంలో ఎలాంటి లాభాలు రాలేదని, అయితే దీర్ఘకాలంలో మంచి రాబడులు వచ్చే అవకాశాలున్నాయని వివరించారు. అందుకే ఈ ఆర్థిక సంవత్సరంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నామని తెలిపారు. గత ఆర్థిక సంవత్సర ఈక్విటీ పెట్టుబడులపై ఒక నివేదిక రూపాందించామని పేర్కొన్నారు.