ఈటీఎఫ్‌లలోకి ఈపీఎఫ్‌ఓ నిధులు!
- ఈటీఎఫ్‌ల్లో 5 శాతం వరకూ నిధులు
- 2015-16లోనే రూ.17,000 కోట్లు పంప్...
- త్వరలో నిబంధనల నోటిఫై!
న్యూఢిల్లీ: ఈక్విటీ మార్కెట్లు, ఈక్విటీ సంబంధిత పథకాలు, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లోకి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) నిధులను మళ్లించడం దాదాపు ఖాయమయినట్లు కనబడుతోంది. ఇందుకు సంబంధించి నియమనిబంధనలను త్వరలో కార్మిక మంత్రిత్వశాఖ నోటిఫై చేసే అవకాశం ఉందని సమాచారం.
మొత్తం ఈపీఎఫ్‌ఓ నిధుల్లో 5 శాతం వరకూ తొలుత ఈటీఎఫ్‌లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఈ మేరకు 2015-16 ఆర్థిక సంవత్సరంలోనే ఫండ్‌లోని దాదాపు రూ.17,000 కోట్లు ఈటీఎఫ్‌ల్లోకి మళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈపీఎఫ్‌ఓ దాదాపు ఐదు కోట్ల మంది చందాదారులతో దాదాపు రూ.6.5 లక్షల కోట్ల నిధిని నిర్వహిస్తోంది. ఈటీఎఫ్ ఒక ప్రత్యేక పత్రం లాంటిది. స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఒక మామూలు స్టాక్ తరహాలో ఈటీఎఫ్ ట్రేడవుతుంది.
సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ల్లో కూడా.... ఈపీఎఫ్‌ఓ తన నిధుల్లో కొంత భాగాన్ని సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌లో (ప్రభుత్వ రంగ సంస్థల స్టాక్స్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్) పెట్టుబడులు పెట్టేలా ఇప్పటికే కార్మిక మంత్రిత్వశాఖతో పెట్టుబడుల శాఖ (డిజిన్వెస్ట్‌మెంట్ డిపార్ట్‌మెంట్- డీఓబీ) చర్చలు జరిపింది. డిజిన్వెస్ట్‌మెంట్ కార్యదర్శి ఆరాధనా జోహ్రీ ఇటీవల స్వయంగా ఈ విషయాన్ని తెలిపారు. 2001లో భారత్‌లో ఈటీఎఫ్‌ల శకం ప్రారంభమైంది. ప్రస్తుతం దాదాపు 33 ఈటీఎఫ్‌లు ఉన్నాయి. వీటి కింద దాదాపు 6.2 లక్షల ఇన్వెస్టర్లకు చెందిన రూ.11,500 కోట్ల నిధుల నిర్వహణ జరుగుతోంది. భారత్ మార్కెట్‌లో గోల్డ్ ఈటీఎఫ్‌ల హవా భారీగా ఉంది.