ఈపీఎఫ్‌వో నిర్ణయానికి కేంద్రం ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)లోని 5 కోట్ల మంది చందాదారుల భవిష్య నిధి (పీఎఫ్) డిపాజిట్లపై 2014-15 ఆర్థిక సంవత్సరానికి కూడా 8.75 శాతం వడ్డీరేటును కొనసాగించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈపీఎఫ్‌వో అత్యున్నత నిర్ణాయక సంస్థ అయిన కేంద్ర ట్రస్టీల బోర్డు(సీబీటీ) దీనిపై ఆగస్టు లో తీసుకున్న నిర్ణయాన్ని ఆర్థిక మంత్రిత్వశాఖ తాజాగా ఆమోదించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ నిర్ణయాన్ని కార్మికశాఖ, ఆదాయపుపన్ను విభాగం ఇంకా నోటిఫై చేయాల్సి ఉందన్నాయి. నోటిఫికేషన్ జారీ అయిన తేదీ నుంచి వడ్డీరేటు అమల్లోకి వస్తుందని వివరించాయి.
రూ. 1,000 పెన్షన్ పొడిగింపునకు ఓకే
నెలకు కనీస పింఛన్ రూ. 1,000 చెల్లింపు పథకాన్ని ఈ ఆర్థిక సంవత్సరం తదుపరి కూడా కొనసాగించేందుకు సీబీటి అంగీకరించింది. చౌక గృహ రుణాలకు 15% నిధులను అందించడానికి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈపీఎఫ్‌ఓ నిధుల్లో 15 శాతం గృహరుణాల కోసం అందితే చౌక గృహాల నిర్మాణానికి రూ. 70,000 కోట్ల రుణ వితరణ ద్వారా, 3.5 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతుందని గతంలో ప్రధాని కార్యాలయం సూచించింది. సంబంధిత ప్రతిపాదన పరిశీలనకు కమిటీని సీబీటీ నియమించనుంది. యాజమాన్య సంస్థల నుంచి ఇద్దరు, ఉద్యోగుల తరఫున ఇద్దరితో ఇది ఏర్పాటుకానుంది. కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ సీబీటీకి అధ్యక్షత వహించారు. ఈపీఎఫ్, పెన్షన్ తదితరాలకు సంబంధించిన క్లెయిమ్‌ల పరిష్కార సమయాన్ని 30 రోజుల నుంచి 20 రోజులకు కుదించాలని నిర్ణయించింది. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ప్రయివేట్ రంగ బాండ్లలో ప్రస్తుతం ఇన్వెస్ట్ చేస్తున్న 10% నిధుల ను 15%కు పెంచే ప్రతిపాదన పరిశీలనకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సీబీటీ నిర్ణయించింది.
పీఎఫ్ డిపాజిట్లపై 8.75% వడ్డీ
Published Sat, Dec 20 2014 3:06 AM | Last Updated on Wed, Sep 5 2018 8:20 PM
Advertisement
Advertisement