The Income Tax Department
-
మిసా భారతికి రూ.10 వేల జరిమానా
న్యూఢిల్లీ: లాలుప్రసాద్ కుమార్తె, ఎంపీ మిసా భారతికి ఆదాయపు పన్ను శాఖ మంగళవారం రూ.10 వేల జరిమానా విధించింది. రూ.1000 కోట్ల బినామీ భూములు, పన్ను ఎగవేత కేసులో ఆమె మంగళవారం ఐటీ అధికారుల ముందు హాజరుకావాల్సి ఉంది. సమన్లను ఉల్లంఘించినందుకు ఈ మేరకు చర్యలు తీసుకుంది. జూన్ 12న తమ ఎదుట హాజరుకావాలని మరోసారి సమన్లు జారీ చేసింది. వ్యక్తిగత హాజరు నుంచి మిసా భారతికి మినహాయింపు ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాది ఐటీ అధికారులను కోరారు. అయితే దీనికి తగిన కారణం తెలియజేయకపోవడంతో అధికారులు న్యాయవాది అభ్యర్థనను తిరస్కరించారు. లాలూ కుమార్తె, అల్లుడు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో మే 22న ఆదాయపుపన్ను శాఖ అధికారులు వారి నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు జరిపిన విషయం తెలిసిందే. -
జన్‌ధన్ ఖాతాల్లో భారీగా నగదు జమ
► నోట్ల రద్దు అనంతరం దాదాపు రూ.150 కోట్లు డిపాజిట్? ► గ్రామీణులకు ఎరవేస్తున్న నేతలు, వ్యాపారస్తులు ► ఖాతాలపై ఆర్బీఐ, ఆదాయపు పన్నుశాఖ దృష్టి తిరుపతి క్రైం: జన్‌ధన్ ఖాతాలకు భారీగా డబ్బులు జమవుతున్నాయి. మొన్నటి వరకు ఇన్ యాక్టివ్‌లో ఉన్న అకౌంట్లు ఇప్పుడు యాక్టివేషన్‌లోకి వచ్చాయి. 500 రూపాయలు కూడా లేని చాలా ఖాతాల్లో ఇప్పుడు వేలు, లక్షలు వచ్చి పడుతున్నాయి! కేంద్ర ప్రభుత్వంరూ. 500, రూ.1000 నోట్లు రద్దు చేసిన అనంతరం డబ్బులు వచ్చిపడుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. 19 రోజుల వ్యవధిలోని జిల్లాలోని జన్‌ధన్ ఖాతాలలో దాదాపు 150 కోట్ల రూపాయల పైచిలుకు డిపాజిట్ అయినట్లు సమాచారం. దీంతో ఆ ఖాతాలపై ఆదాయపు పన్నుశాఖ, రిజర్వ్ బ్యాంక్ దృష్టి సారించినట్లు సమాచారం. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపుతో ఏడాది క్రితం జిల్లాలో 6 లక్షలకు పైగా జన్‌ధన్ ఖాతాలు ప్రారంభించారు. గతనెల వరకు ఈఖాతాలు నిర్వహించిన వారు 5శాతం వరకు కూడా లేరు. అరుుతే నోట్ల రద్దు అనంతరం జన్‌ధన్ ఖాతాలను వినియోగించడం గణనీయంగా పెరిగింది. గ్రామాల్లో సైతం పెత్తందారులు, వ్యాపార, పారిశ్రామిక వర్గాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు, పేదల జన్‌ధన్ ఖాతాల వైపు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అందుకే ఈ ఖాతాల్లోకి భారీగా డబ్బు వచ్చిపడుతోందని ఆర్బీఐ భావిస్తోంది. బ్యాంకుల వారీగా జన్‌ధన్ ఖాతాల్లో వస్తున్న డిపాజిట్లపై విచారణకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు అనధికార సమాచారం వరకు జిల్లాలో సుమారు రూ.150 కోట్లకు పైగా డిపాజిట్ అయినట్లు తెలిసింది. ఒక్కసారిగా పెద్దమొత్తంలో డిపాజిట్లు చేరితే ఆదాయం పెరిగిందనే ఉద్దేశంతో ప్రభుత్వం రాయితీలు కట్ చేసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నా ఫలితం లేదని తెలుస్తోంది. ఈ డబ్బులు ఖాతాదారులవేనా? ఇతరులు వేస్తున్నారా? అనే కోణంలో ఆర్బీఐ అధికారులు, ఆదాయపు పన్నుశాఖ అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే అంతర్గత విచారణ చేస్తున్నట్లు సమాచారం. గ్రామీణులకు ఎర పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో నల్లధనాన్ని వైట్ చేసుకునేందుకు బడాబాబులు, బడానేతలు వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు. కొందరు గ్రామనేతలు స్థానికులను పిలిపించుకుని ‘ఒక ఇంటికి లక్ష, రెండు లక్షలు ఇస్తాం..మీ ఖాతాల్లో మేము డబ్బులు వేస్తాం..వాటిని ఏడాది తరువాత మాకు ఇవ్వండి. . ఎలాంటి వడ్డీ అవసరం లేదు’ ఆఫర్లు ఇస్తున్నట్లు సమాచారం. దీంతో వాడుకల్లో లేని పేదల ఖాతాలకు డిమాండ్ వచ్చింది. జిల్లాలో 45 లక్షలకు పైగా ఎస్బీఐ ఖాతాలు ఉన్నారుు. వీటిల్లోనూ డిపాజిట్లు వెల్లువెత్తుతున్నాయని తెలిసింది. కమీషన్ల జోరు బ్లాక్ మనీని వైట్‌మనీగా మార్చడంలో కమీషన్ల దందా పెద్ద ఎత్తున సాగుతోంది. 10 లక్షలు రద్దయిన కరెన్సీ ఇస్తే 6 లక్షల నుంచి 7.50 లక్షల వరకు కరెన్సీ ఇస్తామని ఆఫర్లు ఇస్తున్నారు. జిల్లాలోని కొన్ని బ్యాంకుల్లో భారీగా కొత్త కరెన్సీ దారి మరలించడం వల్లే బ్లాక్ మనీ వైట్ మనీగా మారుతోందనే విమర్శలొస్తున్నాయి. అధికారులు దీనిపై దృష్టి సారించాల్సి ఉంది. -
రూ.125 కోట్ల నల్లధనం అప్పగింత
న్యూఢిల్లీ: ఢిల్లీకి చెందిన ఒక న్యాయవాది తాను అక్రమంగా సంపాదించిన రూ.125 కోట్ల నల్లధనాన్ని ఆదాయపు పన్ను (ఐటీ) శాఖకు అధీనపరిచాడు. న్యాయవాది, ఆయనకు చెందిన వ్యాపార సంస్థలు పన్ను ఎగ్గొట్టాయని సమాచారం రావడంతో కొన్ని రోజుల క్రితం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం అతను ఈ డబ్బును ఐటీ శాఖకు అప్పగించాడు. స్వచ్ఛంద నల్లధనం వెల్లడి పథకాన్ని కూడా ఆయన ఉపయోగించుకోలేదు. మరో ఘటనలో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో డీజీసీఈఐ (డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ ఇంటెలిజెన్స్) అధికారులు రూ.2,300 కోట్ల నల్లధనాన్ని గుర్తించారు. -
వ్యాపారి ఇంట్లో ఐటీ దాడులు
వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని ప్రముఖ వ్యాపారవేత్త కుల్లాయిశెట్టి ఇంట్లో ఆదాయపన్నుశాఖ అధికారులు గురువారం మధ్యాహ్నం దాడులు నిర్వహిస్తున్నారు. బుధవారం ప్రొద్దుటూరులో కుల్లాయిశెట్టి బావ ఇంట్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. అక్కడ లభించిన సమాచారం మేరకు గురువారం మధ్యాహ్నం ఐటీ అధికారులు జమ్మలమడుగు మెయిన్ బజారులోని కుల్లాయిశెట్టి ఇంట్లో ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సీజ్..స్టే
నల్లగొండ : కొన్ని గంటల వ్యవధిలోనే జిల్లాలోని మద్యం డిపోలను ఆదాయ పన్ను శాఖ సీజ్ చేయడం ...సాయంత్రానికి డిపోలను సీజ్ చేయడంపై హైకోర్టు స్టే ఇవ్వడం తదితర పరిణామాలన్నీ చకాచకా జరిగిపోయాయి. ఆదాయ పన్ను బకాయిలు రాబట్టుకునే విషయమై కొద్దిరోజుల క్రితం రాష్ట్రంలోని వివిధ జిల్లాలో మద్యం డిపోలను సీజ్ చేసిన ఐటీ అధికారులు బుధవారం మన జిల్లాలోకి ప్రవేశించారు. ఆదాయ పన్ను శాఖ దాడుల గురించి కొద్ది రోజుల క్రితమే రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నుంచి జిల్లాలోని లిక్కర్ డిపోలకు సమాచారం చేరింది. దీంతో ఐటీ దాడులు ఏ క్షణంలో అయినా జరుగుతాయని భావించిన మద్యం వ్యాపారులు ముందుగానే అప్రమత్తమై భారీ మొత్తంలో లిక్కర్ కొనుగోలు చేశారు. సాధారణ రోజులతో పోలిస్తే గత నెల 28వ తేదీ నుంచి ఈ నెల 3 తేదీ వరకు రూ.20.95 కోట్ల మద్యం కొనుగోళ్లు జరిగాయి. ఈ క్రమంలో బుధవారం కూడా భారీ మొత్తంలో లిక్కర్ కొనుగోలు చేసేందుకు వ్యాపారులు డిపోలకు చేరుకున్నారు. కానీ అదే సమయానికి ఐటీ అధికారులు డిపోల్లోకి ప్రవేశించడంతో మద్యం కొనుగోళ్లు ఎక్కడికక్కడే నిలిపేశారు. నల్లగొండ డిపోలో బుధవారం మద్యం కొనుగోలు చేసేందుకు వ్యాపారులు రూ.3 కోట్లు చలానా ప్రభుత్వా ఖజనాకు జమ చేశారు. కానీ అప్పటికే ఐటీ అధికారులు డిపోనకు చేరుకోవడం.. సీజ్ చేయడం వంటి పరిణామాలన్నీ చకాచకా జరిగిపోయాయి. నల్లగొండ డిపోలో బుధవారం ఉదయం వరకు రూ.12 కోట్ల స్టాక్ ఉంది. రంగారెడ్డి జిల్లా కీసర మండలం బోగారం వద్ద ఉన్న నల్లగొండ-2 కూడా ఐటీ అధికాారులు సీజ్ చేశారు. నల్లగొండ డిపో నుంచి బయల్దేరి వెళ్లిన ఐటీ అధికారులు బోగారం నల్లగొండ డిపో- 2కు సాయంత్రం 4 గంటలకు చేరుకున్నారు. ఈ డిపోలో బుధవారం రూ.2.38 కోట్ల లిక్కర్ కొనుగోళ్లు జరిగాయి. డిపో ముగిసే సమయానికి ఐటీ అధికారులు చేరుకోవడంతో ఇక్కడి వ్యాపారులు సులువుగా బయటపడ్డారు. ఇదిలావుంటే రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల్లో డిపోలు మూసివేయడంతో అక్కడి వ్యాపారులకు అవసరమయ్యే మద్యాన్ని నల్లగొండ జి ల్లాలో కొనుగోలు చేసుకునే విధంగా మంగళవారం ఎక్సైజ్ శాఖ అనుమతులు జారీ చేసింది. దీంతో అక్కడి వ్యాపారులు బుధవారం మన జిల్లాలో మద్యాన్ని కొనుగోలు చేసేందుకు చలానాలు కూడా కట్టారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో ఆ రెండు జి ల్లాల వ్యాపారులు ఇక్కడి మద్యాన్ని కొనుగోలు చేయలేదు. వ్యాపారుల ఎత్తు..చిత్తు... ఐటీ దాడుల నేపథ్యంలో కొద్దిరోజులనుంచి భారీ స్థాయిలో లిక్కర్ కొనుగోలు చేసిన వ్యాపారులు ఆ స్టాక్ మొత్తాన్ని బ్లాక్ చేసేందుకు ప్రయత్నించారు. వ్యాపారులు దుకాణాల వద్ద ‘నో స్టాక్’ బోర్డు తగిలించేందుకు సిద్ధమయ్యారు. 5, 6 తేదీల్లో హోలీ సంబరాల నేపథ్యంలో మద్యాన్ని బ్లాక్ చేసి ఏమ్మార్పీకి మించి అమ్మకాలు చే యాలని వ్యూహం పన్నారు. సాయంత్రానికే హైకోర్టు స్టే విధించడంతో వ్యాపారుల ఎత్తు కాస్త చిత్తయ్యింది. -
మందు బందు
నేటి నుంచి గొల్లపూడి, గుడివాడ డిపోల నుంచి మద్యం సరఫరా నిలిపివేత 2013 వరకు ఐటీ శాఖకు రూ. 77 కోట్ల బకాయి రెండు డిపోల్లో లక్ష కేసుల నిల్వలు ధరలకు మళ్లీ రెక్కలు విజయవాడ : జిల్లాలో మంగళవారం నుంచి మద్యం సరఫరాకు పూర్తిస్థాయిలో బ్రేక్ పడనుంది. బేవరేజ్‌ల ద్వారా మద్యం సరఫరా నిలిచిపోనుంది. గుడివాడ, గొల్లపూడి డిపోలు ఆదాయ పన్ను శాఖకు భారీగా బకాయిలు పడ్డాయి. వీటిని చెల్లించే వరకు విక్రయాలు నిలిపివేయాలని ఉత్తర్వులు అందడంతో మంగళవారం ఆపేస్తారు. ఫలితంగా జిల్లాలో మరో వారం రోజుల తర్వాత మద్యం కొరత ఏర్పడే అవకాశం ఉంది. దీన్ని అవకాశంగా తీసుకుని వ్యాపారులు ఇప్పటికే మద్యం ధరలు మళ్లీ పెంచి అధిక వసూళ్లకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఐటీ వర్సెస్ ఎక్సైజ్.. ఆదాయ పన్ను శాఖ, ఎక్సైజ్ శాఖకు మద్యం ఆదాయ పన్ను చెల్లింపు విషయంలో కొంత వివాదం జరుగుతోంది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ 2013 వరకు ఐటీ శాఖకు పన్ను చెల్లించలేదు. దీంతో రాష్ట్రవ్యాప్త బకాయి రూ. 8 వేల కోట్లుగా ఉంది. ఈ క్రమంలో ఆదాయ పన్ను శాఖ కోర్టు నుంచి అనుకూలంగా తీర్పు తీసుకొచ్చింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మద్యం డిపోల నుంచి సరఫరా నిలిపివేయాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో జిల్లాలో కూడా 2013 వరకు రూ. 77 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీంతో రెండు డిపోల నుంచి వైన్‌షాపులు, బార్లకు మద్యం నిల్వలు పంపకుండా నిలిపివేయాలని ఆదాయ పన్ను శాఖ అధికారుల నుంచి ఉత్తర్వులందాయి. ఈ క్రమంలో రెండు డిపోల మేనేజర్లకు గత శనివారం ఐటీ శాఖ నుంచి నోటీసులు అందాయి. రూ.15 కోట్ల నిల్వలు విజయవాడ డివిజనల్ పరధిలోని వైన్‌షాపులు, బార్లకు గొల్లపూడి డిపో నుంచి, మచిలీపట్నం డివిజన్ పరిధిలోని వైన్ షాపులు, బార్లకు గుడివాడ డిపో నుంచి మద్యం నిల్వలు ప్రతినెలా సరఫరా చేస్తారు. జిల్లాలోని షాపులకు మాత్రమే రెండు డిపోల ద్వారా సరఫరా జరుగుతుంది. ఈనెలకు సంబంధించి స్టాక్‌ను గతనెల 21 నుంచే వ్యాపారులు కొనుగోలు చేశారు. జిల్లా కోటా 2.3 లక్షల కేసుల మద్యం విక్రయాలు ఇప్పటికే పూర్తికావడంతో సరఫరా చేసేశారు. జిల్లాలో నెలకు రూ.100 కోట్ల విలువ చేసే మద్యం విక్రయాలు జరుగుతాయి. వీటిలో 2.2 లక్షల కేసులు మద్యం కాగా, లక్ష కేసుల బీరు అమ్మకాలు జరుగుతాయి. ప్రస్తుతం జిల్లాలోని రెండు డిపోల్లో కేవలం లక్ష కేసుల మద్యం నిల్వలే ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ.15 కోట్లుగా ఉంటుంది. తదుపరి ఉత్తర్వులు ప్రభుత్వం నుంచి వచ్చే వరకు డిపోల నుంచి పంపిణీ నిలిపివేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. -
పీఎఫ్ డిపాజిట్లపై 8.75% వడ్డీ
ఈపీఎఫ్‌వో నిర్ణయానికి కేంద్రం ఆమోదం సాక్షి, న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)లోని 5 కోట్ల మంది చందాదారుల భవిష్య నిధి (పీఎఫ్) డిపాజిట్లపై 2014-15 ఆర్థిక సంవత్సరానికి కూడా 8.75 శాతం వడ్డీరేటును కొనసాగించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈపీఎఫ్‌వో అత్యున్నత నిర్ణాయక సంస్థ అయిన కేంద్ర ట్రస్టీల బోర్డు(సీబీటీ) దీనిపై ఆగస్టు లో తీసుకున్న నిర్ణయాన్ని ఆర్థిక మంత్రిత్వశాఖ తాజాగా ఆమోదించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ నిర్ణయాన్ని కార్మికశాఖ, ఆదాయపుపన్ను విభాగం ఇంకా నోటిఫై చేయాల్సి ఉందన్నాయి. నోటిఫికేషన్ జారీ అయిన తేదీ నుంచి వడ్డీరేటు అమల్లోకి వస్తుందని వివరించాయి. రూ. 1,000 పెన్షన్ పొడిగింపునకు ఓకే నెలకు కనీస పింఛన్ రూ. 1,000 చెల్లింపు పథకాన్ని ఈ ఆర్థిక సంవత్సరం తదుపరి కూడా కొనసాగించేందుకు సీబీటి అంగీకరించింది. చౌక గృహ రుణాలకు 15% నిధులను అందించడానికి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈపీఎఫ్ఓ నిధుల్లో 15 శాతం గృహరుణాల కోసం అందితే చౌక గృహాల నిర్మాణానికి రూ. 70,000 కోట్ల రుణ వితరణ ద్వారా, 3.5 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతుందని గతంలో ప్రధాని కార్యాలయం సూచించింది. సంబంధిత ప్రతిపాదన పరిశీలనకు కమిటీని సీబీటీ నియమించనుంది. యాజమాన్య సంస్థల నుంచి ఇద్దరు, ఉద్యోగుల తరఫున ఇద్దరితో ఇది ఏర్పాటుకానుంది. కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ సీబీటీకి అధ్యక్షత వహించారు. ఈపీఎఫ్, పెన్షన్ తదితరాలకు సంబంధించిన క్లెయిమ్‌ల పరిష్కార సమయాన్ని 30 రోజుల నుంచి 20 రోజులకు కుదించాలని నిర్ణయించింది. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ప్రయివేట్ రంగ బాండ్లలో ప్రస్తుతం ఇన్వెస్ట్ చేస్తున్న 10% నిధుల ను 15%కు పెంచే ప్రతిపాదన పరిశీలనకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సీబీటీ నిర్ణయించింది. -
ఎగుమతులు.. నిరాశే!
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ముందస్తు పన్ను వసూళ్లకు సంబంధించి సెప్టెంబర్ త్రైమాసికంలో నిర్దేశించుకున్న లక్ష్యాలకు దాదాపు చేరువగా ఉన్నట్లు ఆదాయ పన్ను శాఖ అధికారి వెల్లడించింది. సుమారు 17 శాతం వృద్ధి నిర్దేశించుకోగా, వసూళ్లు లక్ష్యానికి దగ్గరగా ఉన్నట్లు వివరించారు. అయితే, ఎంత వసూలైనదీ వెల్లడించలేదు. సాధారణంగా ట్రెండ్స్ తెలియజేసేలా ప్రతిసారీ టాప్ 100 కంపెనీల చెల్లింపుల వివరాలను ప్రకటించే ఆదాయ పన్ను శాఖ అధికారులు.. గత రెండు త్రైమాసికాల తరహాలోనే ఈసారి కూడా వెల్లడించలేదు. దేశం మొత్తంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లలో ముంబై సర్కిల్‌దే సింహభాగం ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ. 7.36 లక్షల కోట్లు ఆదాయ పన్ను శాఖ నిర్దేశించుకోగా.. ఇందులో రూ. 2.3 లక్షల కోట్లు ముంబై సర్కిల్ నుంచి రాబట్టాలని భావిస్తోంది. మరోవైపు, యస్ బ్యాంక్ తాము రెండో త్రైమాసికంలో రూ. 238 కోట్లు (20 శాతం వృద్ధి) అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించినట్లు పేర్కొంది. అటు హెచ్డీఎఫ్సీ 13 శాతం అధికంగా రూ. 735 కోట్లు చెల్లించినట్లు వివరించింది. -
ఎన్నారైలు...ట్యాక్స్ రిటర్నులు
ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) విదేశాల్లో ఆర్జించిన ఆదాయంపై భారత్‌లో పన్ను ఉండదు. కానీ, కొందరు ఎన్నారైలకు తమ స్వదేశంలో డిపాజిట్లు, అద్దెల రూపంలో ఆదాయాలుంటాయి. ఇలాంటి ఆదాయం వార్షిక పరిమితి రూ.2 లక్షలు మించితే వారు విదేశాల్లో నివసిస్తున్నా ఇక్కడ కూడా ట్యాక్స్ రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. డిపాజిట్లు, అద్దెలే కాకుండా షేర్లు, మ్యూచువల్ ఫండ్లు వంటి వాటిలోనూ లాభాలొస్తే వాటికీ పన్ను చెల్లించాలి. ఎన్నారైలు రిటర్నులు దాఖలు చేయడానికి గడువు జూలై 31. రిటర్నుల దాఖలుకు ముందు ఎన్నారైలు గమనించాల్సిన కొన్ని అంశాలివీ... రిటర్నులు ఎప్పుడు దాఖలు చేయాలంటే.. ఇండియాలో ఆదాయం బేసిక్ మినహాయింపు పరిమితిని మించినపుడు; చెల్లించాల్సిన పన్ను కంటే ఎక్కువ డిడక్ట్ చేసినపుడు; మూలధన నష్టాల(క్యాపిటల్ లాస్)కు సంబంధించిన క్లెయిమ్‌ల పరిష్కారానికి రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. పన్ను విధించదగిన ఆదాయం విషయంలో వ్యక్తులకు కొన్ని మినహాయింపులుంటాయి. కొన్ని రకాల పెట్టుబడులు, గృహ రుణంలో అసలును చెల్లించడం మొదలైనవి. ఈ మినహాయింపులు ఎన్నారైలకు కూడా వర్తిస్తాయి. దాఖలు చేసిన ట్యాక్స్ రిటర్నుల నుంచి రిఫండ్ కోసం బ్యాంకు అకౌంటు నంబరు, బ్రాంచ్ ఎంఐసీఆర్ కోడ్ వంటి మీ బ్యాంకు వివరాలను లోపరహితంగా అందించాలి. ఆన్లైన్లో రిటర్నులు దాఖలు చేసినపుడు రిఫండ్ కూడా ఎలక్ట్రానిక్ పద్ధతిలో జరిగిపోతుంది. ఆదాయ పన్ను శాఖ వారి ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా ఎన్నారైలు తమ రిటర్నులను ఆన్లైన్లో దాఖలు చేయవచ్చు. ఇందుకు ప్రత్యామ్నాయంగా ట్యాక్స్ అడ్వైజర్ల సహాయాన్ని వారు పొందవచ్చు. లేదంటే ప్రైవేట్, పెయిడ్ ఈ-ఫైలింగ్ పోర్టల్స్ ద్వారానూ రిటర్నులు పంపవచ్చు. ఎన్నారైలకు సంబంధించి... భారత్‌లో వారి ఆదాయమంటే దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్, పెట్టుబడులపై ఆదాయం మాత్రమే ఉంటాయి. మినహాయింపు పరిమితిలోపు ఆదాయం ఉంటే రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం లేదు. అంతేకాదు, ఆదాయ స్థానంలోనే పన్ను తగ్గింపు జరిగినా రిటర్నులు సమర్పించనక్కర్లేదు. -
పన్ను ఎగవేతదారులపై ఈసీ కన్ను
సీబీడీటీతో కలసి అభ్యర్థుల పాన్ కార్డుల వివరాల సంయుక్త తనిఖీ ఎన్నికల రంగం నుంచి పన్ను ఎగవేతదారుల ఏరివేతే లక్ష్యం న్యూఢిల్లీ: ఎన్నికల బరిలో దిగుతున్న అభ్యర్థుల్లో రూ. 5 కోట్లకు పైగా ఆస్తులు ఉండి.. పాన్ కార్డు లేని వారిపై ఆదాయ పన్ను శాఖ, కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టిసారిస్తోంది. పన్ను ఎగవేతదారులను ఎన్నికల రంగం నుంచి ఏరివేయటానికి.. అనుమానిత పన్ను ఎగవేతదారుల జాబితాను ఇప్పటికే సిద్ధం చేశారు. గత ఎన్నికల్లో ప్రకటించిన ఆస్తుల కన్నా ఇప్పుడు రూ. 2 కోట్లు అంతకన్నా ఎక్కువ స్థిరాస్తులు ఉన్నట్లు ప్రకటించిన అభ్యర్థులను కూడా ఈ జాబితాలో చేర్చారు. వీరందరి ఆస్తులు, ఆదాయాల వివరాలను ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) అధికారులు క్షుణ్నంగా తనిఖీ చేయనున్నారని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. అనుమానిత పన్ను ఎగవేత కోణం నుంచి అభ్యర్థుల అఫిడవిట్లను పరిశీలించటానికి ఈసీ, సీబీడీటీలు సంయుక్తంగా ఐదు కీలక ప్రమాణాలను రూపొందించాయి. అందులో పాన్ (శాశ్వత ఖాతా నంబరు) కార్డుల వాస్తవికతను పరిశీలించటం ఒకటి. ఎన్నికల అఫిడవిట్లో ఆయా అభ్యర్థులు ప్రకటించే ఆదాయం, ఆస్తుల వివరాలను తనిఖీ చేయటానికి ఇది చాలా ముఖ్యమైనది. అభ్యర్థులు తమ అఫిడవిట్లో తెలిపే పాన్ కార్డు వివరాలను తమకు అందించాలని.. దాని ద్వారా సదరు అభ్యర్థి ఆర్థిక మూలాలను తనిఖీ చేయటం సులభమని సీబీడీటీ ఇటీవల ఈసీని కోరింది. ఈసీ ఇచ్చిన పాన్ కార్డు వివరాలను తమ వద్ద గల సదరు అభ్యర్థికి సంబంధించిన పాన్ కార్డు వివరాలను పోల్చిచూసి.. అది బూటకపు పాన్ కార్డా లేక వాస్తవమైనదేనా అన్నది సీబీడీటీ నిర్థారించనుంది. అలాగే.. అభ్యర్థులు తమ అఫిడవిట్లలో ప్రకటించిన ఆస్తుల వివరాలను.. వారికి సంబంధించి ఐటీ విభాగానికి సమర్పించిన ఆదాయ పన్ను రిటర్నుల్లో పేర్కొన్న ఆస్తుల వివరాలను కూడా సరిపోల్చి తనికీ చేయనున్నారు. అభ్యర్థి వ్యక్తిగత ఆస్తుల వివరాలతో పాటు కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను ఏ మేరకు చూపారనే అంశాలను కూడా సీబీడీటీ తనిఖీ చేయనుంది. ఈవీఎంలతోనే ఓటింగ్: ఈసీ సార్వత్రిక ఎన్నికల్లో దేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ ఈవీఎంలను వినియోగిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కింలోనూ.. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఉప ఎన్నికల్లోనూ ఈవీఎంలను వినియోగిస్తామని వెల్లడించింది. ఎన్నికల ప్రక్రియకు అవసరమైన ఈవీఎంలు తమకు అందుబాటులో ఉన్నాయన్నారు. మహిళా అభ్యర్థులకు అదనపు భద్రత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే మహిళా అభ్యర్థులకు అదనపు భద్రత కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ప్రస్తుతం ప్రతి మహిళా అభ్యర్థికి ఓ పురుష గన్‌మెన్‌ను అందిస్తున్నారు. దీనికి అదనంగా ఒక మహిళా వ్యక్తిగత భద్రతా అధికారి(పీఎస్వో)ని కూడా నియమించాలని నిర్ణయించారు. సాధారణంగా అభ్యర్థులు మగవారైనా.. మహిళలైనా పీఎస్వోలుగా పురుషులనే నియమిస్తారు.