సీజ్..స్టే | seize stay | Sakshi
Sakshi News home page

సీజ్..స్టే

Published Thu, Mar 5 2015 2:32 AM | Last Updated on Sat, Sep 2 2017 10:18 PM

seize stay

నల్లగొండ : కొన్ని గంటల వ్యవధిలోనే జిల్లాలోని మద్యం డిపోలను ఆదాయ పన్ను శాఖ సీజ్ చేయడం ...సాయంత్రానికి డిపోలను సీజ్ చేయడంపై హైకోర్టు స్టే ఇవ్వడం తదితర పరిణామాలన్నీ చకాచకా జరిగిపోయాయి. ఆదాయ పన్ను బకాయిలు రాబట్టుకునే విషయమై కొద్దిరోజుల క్రితం రాష్ట్రంలోని వివిధ జిల్లాలో మద్యం డిపోలను సీజ్ చేసిన ఐటీ అధికారులు బుధవారం మన జిల్లాలోకి ప్రవేశించారు.

ఆదాయ పన్ను శాఖ దాడుల గురించి కొద్ది రోజుల క్రితమే రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నుంచి జిల్లాలోని లిక్కర్ డిపోలకు సమాచారం చేరింది. దీంతో ఐటీ దాడులు ఏ క్షణంలో అయినా జరుగుతాయని భావించిన మద్యం వ్యాపారులు ముందుగానే అప్రమత్తమై భారీ మొత్తంలో లిక్కర్ కొనుగోలు చేశారు. సాధారణ రోజులతో పోలిస్తే గత నెల 28వ తేదీ నుంచి ఈ నెల 3 తేదీ వరకు రూ.20.95 కోట్ల మద్యం కొనుగోళ్లు జరిగాయి. ఈ క్రమంలో బుధవారం కూడా భారీ మొత్తంలో లిక్కర్ కొనుగోలు చేసేందుకు వ్యాపారులు డిపోలకు చేరుకున్నారు.

కానీ అదే సమయానికి ఐటీ అధికారులు డిపోల్లోకి ప్రవేశించడంతో మద్యం కొనుగోళ్లు ఎక్కడికక్కడే నిలిపేశారు. నల్లగొండ డిపోలో బుధవారం మద్యం కొనుగోలు చేసేందుకు వ్యాపారులు రూ.3 కోట్లు చలానా ప్రభుత్వా ఖజనాకు జమ చేశారు. కానీ అప్పటికే ఐటీ అధికారులు డిపోనకు చేరుకోవడం.. సీజ్ చేయడం వంటి పరిణామాలన్నీ చకాచకా జరిగిపోయాయి. నల్లగొండ డిపోలో బుధవారం ఉదయం వరకు రూ.12 కోట్ల స్టాక్ ఉంది. రంగారెడ్డి జిల్లా కీసర మండలం బోగారం వద్ద ఉన్న నల్లగొండ-2 కూడా ఐటీ అధికాారులు సీజ్ చేశారు. నల్లగొండ డిపో నుంచి బయల్దేరి వెళ్లిన ఐటీ అధికారులు బోగారం నల్లగొండ డిపో- 2కు సాయంత్రం 4 గంటలకు చేరుకున్నారు.

ఈ డిపోలో బుధవారం రూ.2.38 కోట్ల లిక్కర్ కొనుగోళ్లు జరిగాయి. డిపో ముగిసే సమయానికి ఐటీ అధికారులు చేరుకోవడంతో ఇక్కడి వ్యాపారులు సులువుగా బయటపడ్డారు. ఇదిలావుంటే రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల్లో డిపోలు మూసివేయడంతో అక్కడి వ్యాపారులకు అవసరమయ్యే మద్యాన్ని నల్లగొండ జి ల్లాలో కొనుగోలు చేసుకునే విధంగా మంగళవారం ఎక్సైజ్ శాఖ అనుమతులు జారీ చేసింది. దీంతో అక్కడి వ్యాపారులు బుధవారం మన జిల్లాలో మద్యాన్ని కొనుగోలు చేసేందుకు చలానాలు కూడా కట్టారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో ఆ రెండు జి ల్లాల వ్యాపారులు ఇక్కడి మద్యాన్ని కొనుగోలు చేయలేదు.
 
వ్యాపారుల ఎత్తు..చిత్తు...
ఐటీ దాడుల నేపథ్యంలో కొద్దిరోజులనుంచి భారీ స్థాయిలో లిక్కర్ కొనుగోలు చేసిన వ్యాపారులు ఆ స్టాక్ మొత్తాన్ని బ్లాక్ చేసేందుకు ప్రయత్నించారు. వ్యాపారులు దుకాణాల వద్ద ‘నో స్టాక్’ బోర్డు తగిలించేందుకు సిద్ధమయ్యారు. 5, 6 తేదీల్లో హోలీ సంబరాల నేపథ్యంలో మద్యాన్ని బ్లాక్ చేసి ఏమ్మార్పీకి మించి అమ్మకాలు చే యాలని వ్యూహం పన్నారు.  సాయంత్రానికే హైకోర్టు స్టే విధించడంతో వ్యాపారుల ఎత్తు కాస్త చిత్తయ్యింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement