సీబీడీటీతో కలసి అభ్యర్థుల పాన్ కార్డుల వివరాల సంయుక్త తనిఖీ
ఎన్నికల రంగం నుంచి పన్ను ఎగవేతదారుల ఏరివేతే లక్ష్యం
న్యూఢిల్లీ: ఎన్నికల బరిలో దిగుతున్న అభ్యర్థుల్లో రూ. 5 కోట్లకు పైగా ఆస్తులు ఉండి.. పాన్ కార్డు లేని వారిపై ఆదాయ పన్ను శాఖ, కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టిసారిస్తోంది. పన్ను ఎగవేతదారులను ఎన్నికల రంగం నుంచి ఏరివేయటానికి.. అనుమానిత పన్ను ఎగవేతదారుల జాబితాను ఇప్పటికే సిద్ధం చేశారు. గత ఎన్నికల్లో ప్రకటించిన ఆస్తుల కన్నా ఇప్పుడు రూ. 2 కోట్లు అంతకన్నా ఎక్కువ స్థిరాస్తులు ఉన్నట్లు ప్రకటించిన అభ్యర్థులను కూడా ఈ జాబితాలో చేర్చారు. వీరందరి ఆస్తులు, ఆదాయాల వివరాలను ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) అధికారులు క్షుణ్నంగా తనిఖీ చేయనున్నారని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి.
అనుమానిత పన్ను ఎగవేత కోణం నుంచి అభ్యర్థుల అఫిడవిట్లను పరిశీలించటానికి ఈసీ, సీబీడీటీలు సంయుక్తంగా ఐదు కీలక ప్రమాణాలను రూపొందించాయి. అందులో పాన్ (శాశ్వత ఖాతా నంబరు) కార్డుల వాస్తవికతను పరిశీలించటం ఒకటి. ఎన్నికల అఫిడవిట్‌లో ఆయా అభ్యర్థులు ప్రకటించే ఆదాయం, ఆస్తుల వివరాలను తనిఖీ చేయటానికి ఇది చాలా ముఖ్యమైనది. అభ్యర్థులు తమ అఫిడవిట్‌లో తెలిపే పాన్ కార్డు వివరాలను తమకు అందించాలని.. దాని ద్వారా సదరు అభ్యర్థి ఆర్థిక మూలాలను తనిఖీ చేయటం సులభమని సీబీడీటీ ఇటీవల ఈసీని కోరింది. ఈసీ ఇచ్చిన పాన్ కార్డు వివరాలను తమ వద్ద గల సదరు అభ్యర్థికి సంబంధించిన పాన్ కార్డు వివరాలను పోల్చిచూసి.. అది బూటకపు పాన్ కార్డా లేక వాస్తవమైనదేనా అన్నది సీబీడీటీ నిర్థారించనుంది. అలాగే.. అభ్యర్థులు తమ అఫిడవిట్లలో ప్రకటించిన ఆస్తుల వివరాలను.. వారికి సంబంధించి ఐటీ విభాగానికి సమర్పించిన ఆదాయ పన్ను రిటర్నుల్లో పేర్కొన్న ఆస్తుల వివరాలను కూడా సరిపోల్చి తనికీ చేయనున్నారు. అభ్యర్థి వ్యక్తిగత ఆస్తుల వివరాలతో పాటు కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను ఏ మేరకు చూపారనే అంశాలను కూడా సీబీడీటీ తనిఖీ చేయనుంది.
ఈవీఎంలతోనే ఓటింగ్: ఈసీ
సార్వత్రిక ఎన్నికల్లో దేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ ఈవీఎంలను వినియోగిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కింలోనూ.. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఉప ఎన్నికల్లోనూ ఈవీఎంలను వినియోగిస్తామని వెల్లడించింది. ఎన్నికల ప్రక్రియకు అవసరమైన ఈవీఎంలు తమకు అందుబాటులో ఉన్నాయన్నారు.
మహిళా అభ్యర్థులకు అదనపు భద్రత
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే మహిళా అభ్యర్థులకు అదనపు భద్రత కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ప్రస్తుతం ప్రతి మహిళా అభ్యర్థికి ఓ పురుష గన్‌మెన్‌ను అందిస్తున్నారు. దీనికి అదనంగా ఒక మహిళా వ్యక్తిగత భద్రతా అధికారి(పీఎస్‌వో)ని కూడా నియమించాలని నిర్ణయించారు. సాధారణంగా అభ్యర్థులు మగవారైనా.. మహిళలైనా పీఎస్‌వోలుగా పురుషులనే నియమిస్తారు.
పన్ను ఎగవేతదారులపై ఈసీ కన్ను
Published Thu, Apr 3 2014 3:24 AM | Last Updated on Sat, Sep 2 2017 5:29 AM
Advertisement
Advertisement