పీఎఫ్ డిపాజిట్లపై 8.65 శాతం వడ్డీ
సాక్షి, న్యూడిల్లీ : ప్రస్తుత (2016-17) సంవత్సరానికి గాను గత డిసెంబర్ లో నిర్ణయించిన విధంగానే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) డిపాజిట్లపై 8.65 శాతం వడ్డీని అందిస్తామని కేంద్ర కార్మిక శాఖా మంత్రి బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. ఈపీఎఫ్ వడ్డీ రేటును తగ్గించాలని ఆర్ధిక మంత్రిత్వ శాఖ వత్తిడి తెస్తోందని వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. డిపాజిటర్లకు వడ్డీ రేటును తగ్గించేది లేదని దత్తాత్రేయ పేర్కొన్నారు.
గురువారం జరిగిన ఈపీఎఫ్ సెంట్రల్ బోర్డ్ ప్రత్యేక సమావేశానికి దత్తాత్రేయ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ అవసరమైతే ఆర్ధిక మంత్రిత్వ శాఖతో చర్చిస్తామని, ఇప్పటికే 8.65 శాతం వడ్డీ రేటును ఆమోదించాలని ఆర్ధిక మంత్రిత్వ శాఖను కోరానని, వర్కర్లకు ఈపీఎఫ్ డిపాజిట్లపై 8.65 శాతం వడ్డీని అందించాల్సిందేనని దత్తాత్రేయ చెప్పారు. సమర్ధవంతమైన సేవలు అందించడానికి అనువుగా సమాచార సాంకేతికతను విరివిగా వినియోగించాలన్న ప్రభుత్వ విధానానికి లోబడి ఈపీఎఫ్ ప్రయోజనాల అందుబాటును విస్తరించడానికి ఆధార్ సీడింగ్ అప్లికేషన్ ను దత్తాత్రేయ ప్రారంభించారు. ఈపీఎఫ్ ఖాతాదారులు మరణిస్తే, వారి కుటుంబానికి రూ. 2.5 లక్షల మేరకు కనీస హామీ ప్రయోజనం అందించాలన్న ప్రతిపాదనను సెంట్రల్ బోర్డ్ సిఫార్సు చేసింది.