Railway budget 2014
-
మళ్లీ నిరాశపరిచిన రైల్వే బడ్జెట్
రైల్వే బడ్జెట్లో జిల్లాకు ఎప్పటిలాగే నిరాశే ఎదురైంది. 2014-15 బడ్జెట్‌ను పార్లమెంటులో మంగళవారం ప్రవేశపెట్టిన రైల్వే మంత్రి సదానంద గౌడ జిల్లా వాసులను నిరాశపరిచారు. ఏళ్ల నాటి పెండింగ్‌లో ఉన్న సమస్యలకు మోక్షం కలగలేదు. గత ఏడాది బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే ఒక్క రైలు ప్రవేశపెట్టి చేతులు దులుపుకోగా, అదే బాటలో పయనించిన ప్రస్తుత మోడీసర్కారు ఒకే ఒక్క వీక్లీ రైలుతో సరిపెట్టేసింది. జిల్లా వాసుల ఆశలపై నీళ్లు చల్లింది. ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో విశాఖను ప్రత్యేక జోన్‌గా కేటాయించేందుకు ఎంపీలు ఇచ్చిన ప్రతిపాదన విషయాన్ని కనీసం ప్రస్తావించలేదు. ప్రైవేటీకరణే ధ్యేయంగా ప్రతి అంశాన్ని ముడిపెడుతూ ఎఫ్‌డీఐలను అనుమతిస్తూ ప్రత్యేక కార్యాచరణకు దిగారు. పాత వాటి ఊసులేదు... కొత్తవాటికి గ్రీన్ సిగ్నల్ లేదు. ఒక్క వీక్లీ రైలుతో జిల్లా ప్రజలకు ఒరిగిందేమీ లేదు. విజయనగరం టౌన్ : కేంద్రంలో మోడీ సర్కారు ప్రవేశపెట్టిన తొలి రైల్వే బడ్జెట్లో జిల్లాకు మొండిచేయి చూపించారు. దీంతో ఎన్నో ఏళ్లుగా జిల్లాలో ఉన్న సమస్యలన్నీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నచందంగా ఉండిపోయాయి. లాభార్జనే ధ్యేయంగా రైల్వే మంత్రి సదానంద గౌడ తన బడ్జెట్‌ను రూపకల్పన చేశారు. విశాఖ రైల్వేజోన్ అంశాన్ని కనీసం ప్రస్తావించలేదు. పారదీప్ నుంచి విశాఖ వెళ్లేందుకు ఎక్స్‌ప్రెస్ రైలును మాత్రం వారంలో ఒకరోజు వచ్చేలా ఏర్పాటుచేశారు. ఇది తప్ప జిల్లాకు ఉపయోగపడే మరో అంశం ఏదీ బడ్జెట్లో లేదు. అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలో సీనియర్ సిటిజన్లకు బ్యాటరీ కార్లు ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయం. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా గమ్యం చేరుకోబోయే ముందు ప్రయాణికులకు అలర్ట్ వేకప్ కాల్స్ సదుపాయం, అన్ని రైళ్లల్లో ఇంటర్నెట్ వైఫే సౌకర్యం, పార్కింగ్ కమ్ ఫ్లాట్ ఫామ్ టికెట్లను ఒకే దాంట్లో ఇవ్వడం, ప్రయాణికులకు పోస్టల్, నెట్ తదితర వాటి ద్వారా అన్నిరకాల రైల్వే సౌకర్యాలు కల్పించడం చేశారు. అయితే చాలా ఏళ్ల నుంచి జిల్లా ఎంపీలు యత్నిస్తున్నా అంశాలలో ఏ ఒక్కటీ సాఫల్యం కాలేదు. గత బడ్జెట్లో కూడా విశాఖ -గుణుపూరు పాసింజర్ రైలు తప్పితే మనకేదీ దక్కలేదు. పట్టాలెక్కని హామీలివే.... ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో విశాఖను ప్రత్యేక జోన్‌గా చేయాలన్న ఆశ అడియాశగానే మిగిలింది. విజయనగరం నుంచి రాజాం మీదుగా పలాసకు ప్రత్యేక రైల్వే లైను, బొబ్బిలి రైల్వే స్టేషన్ ఆధునీకరణ ఊసేలేదు. విజయనగరం రైల్వే స్టేషన్లో అవుట్ పేషెంట్ విభాగం, వ్యాధి నిర్ధారణ కేంద్రం తదితరవన్నీ గతంలో పేర్కొన్నవే. అయితే వీటిలో దేనికీ ప్రత్యేకించి ఈ బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. ఇక ఏళ్ల నాటి డిమాండ్లైన పలాస-విశాఖ రైలు, సాధారణ బోగీలతో విశాఖ నుంచి హౌరా ఎక్స్‌ప్రెస్‌ను నడపాలన్నది అలాగే ఉండిపోయింది. సుమారు రూ.కోటీ 55 లక్షలతో విజయనగరంలో నిర్మించిన రైల్వే మామిడి యార్డ్‌కు ప్రత్యేక లైన్ ఏర్పాటు డిమాండ్ నెరవేరలేదు. ఇక రూ.10 కోట్లకు పైగా ఆదాయాన్ని సమకూరుస్తున్న గూడ్స్ షెడ్ అభివృద్ధి కూడా ఏళ్ల నాటి డిమాండ్ జాబితాలో చేరిపోయింది. ‘లోకో మోటివ్ షెడ్(రైలు బయలుదేరు ప్రదేశం)’పరిస్థితి కూడా ఒక డిమాండ్‌గానే మిగిలిపోయింది. విజయనగరం రైల్వే స్టేషన్లో 5వ ప్లాట్‌ఫామ్ నుంచి చివరి ప్లాట్‌ఫామ్ వరకు ఫుట్ఓవర్ బ్రిడ్జిను పూర్తి చేసేందుకు నిధులు కేటాయించలేదు. ఈ బ్రిడ్జి పనులు పిల్లర్ల స్థాయితో అర్ధాంతరంగా ఆగిపోయాయి. రైల్వే ప్రయాణికుల సౌకర్యార్ధం విజయనగరం రైల్వేస్టేషన్లో చివరి వరకూ షెల్టర్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. ఆ పనులు కూడా నెరవేరలేదు. విజయగనం పట్టణంలో వీటీ అగ్రహారం బీసీ కాలనీ వద్ద రైల్వే గేట్ ఏర్పాటుచేయాలన్న వినతులను పట్టించుకోలేదు. -
కొత్త రైల్వే బడ్జెట్... తొమ్మిది ముఖ్యాంశాలు
చిరునవ్వుల మంత్రి సదానంద గౌడ రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎవరికెన్నిరైళ్లు వచ్చాయి, టికెట్ల ధరలెంత పెరిగాయి వంటి ప్రశ్నలను పక్కనబెడితే రైల్వే బడ్జెట్ లోని అతి ముఖ్యమైన తొమ్మిది అంశాలేమిటో ఒకసారి చూద్దాం. * రైల్వేలో ఆపరేషన్స్ విభాగం మినహా మిగతా అన్నిటా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు తలుపులు తెరిచారు. క్యాబినెట్ అనుమతి వస్తే ఎఫ్ డీ ఐ వచ్చే అవకాశాలున్నాయి. * ఇక రైళ్లు వేగంగా పరుగులు తీస్తాయి. తొమ్మిది సెక్టార్లలో రైళ్ల వేగాన్ని గంటలకు 160 కి.మీ నుంచి 200 కిమీకి పెంచుతారు. * ఇక భారతదేశంలోనూ బుల్లెట్ ట్రెయిన్లు పరుగులు తీస్తాయి. మొదటి బుల్లెట్ ట్రెయిన్ మహారాష్ట్ర నుంచి అహ్మదాబాద్ వరకూ నడుస్తుంది. * వాజ్ పేయీ హయాంలో స్వర్ణ చతుర్భుజి రోడ్ల లాగా నరేంద్ర మోడీ యుగంలో వజ్ర చతుర్భుజి రైలు మార్గాలు రాబోతున్నాయి. * 25 లక్షలకు మించి చేసే అన్ని కొనుగోళ్లను ఈ ప్రొక్యూర్ మెంట్ పద్ధతిలోనే ఇకపై చేయాల్సి ఉంటుంది. దీని వల్ల అవినీతి తగ్గి, పారదర్శకత పెరుగుతుంది. * ఈ ఆర్ధిక సంవత్సరం ప్రభుత్వం 65,450 కోట్లు రైల్వేలపై ఖర్చు చేయబోతోంది. రైల్వేలలో పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా 6,005 కోట్లు సంపాదించబోతోంది. * మహిళా ప్రయాణికుల భద్రత కోసం 4000 మంది మహిళా పోలీసులను రిక్రూట్ చేయబోతున్నారు. * ఇక రైల్వే స్టేషన్లలో బ్రాండెడ్ ఆహారం లభిస్తుంది. రైల్వే క్యాంటీన్లలో చెత్త ఆహారం గురించి ఫిర్యాదు చేయడం మానేయొచ్చు. * ఈ టికెటింగ్ వ్యవస్థ వేగవంతమౌతుంది. మొబైల్ ఫోన్ల ద్వారా, పోస్టాఫీసుల ద్వారా కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. దీని వల్ల ఒకే సమయంలో లక్షకు పైగా ప్రయాణికులు టికెట్లు తీసుకోవచ్చు. * రైల్వే స్టేషన్లు, అన్ని రైల్వేలలో వైఫై సదుపాయం ఉంటుంది. మనం ఎక్కడున్నా ఇంటర్నెట్ కనెక్టివిటీ అందుబాటులో ఉంటుంది. రైలు ప్రయాణంలో ఉండగా ఫోన్లు అందక ఇబ్బంది పడటం ఉండదు. -
తెలంగాణకు ‘మోడీ రైలు’ వచ్చేనా?
* రేపే రైల్వే బడ్జెట్.. ఎన్నో ఆశలతో ఎదురుచూపు * ఇప్పటికే భారీ సంఖ్యలో ప్రాజెక్టులు పెండింగ్ సాక్షి, హైదరాబాద్: రైల్వే రవాణా సౌకర్యం విషయంలో బాగా వెనుకబడిన తెలంగాణకు.. ఈ సారి బడ్జెట్లోనైనా తగిన ప్రాధాన్యం లభిస్తుందా? ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రైల్వే ప్రాజెక్టుల విషయంలో జరిగిన అన్యాయం ఇంకా కొనసాగుతుందా? ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అభివృద్ధికి కీలకమైన రైల్వే రవాణా సదుపాయం సమకూరుతుందా? కొత్త ప్రాజెక్టులు మంజూరవుతాయా? కనీసం అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టులకైనా మోక్షం లభిస్తుందా?... ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ప్రజాప్రతినిధులను తొలిచేస్తున్న ప్రశ్నలివి. రైల్వే రవాణా వసతిలో బాగా వెనుకబడిన తెలంగాణ.. మోడీ ప్రభుత్వం కేటాయింపులపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. తెలంగాణ ఆవిర్భావం కోసం సహకరించిన బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక తొలి రైల్వే బడ్జెట్‌ను మంగళవారం ప్రవేశపెట్టబోతోంది. మరోవైపు రైల్వేబడ్జెట్‌లో కొత్త ప్రాజెక్టులపై పెద్దగా ఆశలు పెట్టుకోవద్దని రైల్వే మంత్రి సదానందగౌడ ఇప్పటికే సంకేతాలిచ్చిన నేపథ్యంలో... తెలంగాణ ప్రాంతానికి, దక్షిణ మధ్య రైల్వేకు నిధులు, ప్రాజెక్టుల కేటాయింపు ఏవిధంగా ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది. రైల్వే బడ్జెట్లో తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే కేంద్రాన్ని గట్టిగా కోరారు. అయితే పక్షం రోజుల క్రితమే రైల్వేమంత్రి ప్రధాని నరేంద్రమోడీతో చర్చించి రైల్వే బడ్జెట్‌ను సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంపీలు ప్రతిపాదించిన ప్రాజెక్టుల్లో చాలావాటిని ఆయన పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం. ఈ నేపథ్యంలో కేసీఆర్ తీవ్రంగా ఒత్తిడి చేసిన పెద్దపల్లి-సిద్ధిపేట-మనోహరాబాద్ రైల్వే లైన్ నిర్మాణం, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ప్రతిపాదించిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, కాజీపేట జంక్షన్‌కు డివిజన్ హోదా కల్పించటం లాంటి కీలక ప్రతిపాదనల విషయంలో రైల్వేమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నారనేది బడ్జెట్లో తేలనుంది. ఆదాయం ఇస్తున్నా నిధులు అంతంతే.. కొంతకాలంగా రైల్వేకు దక్షిణ మధ్య రైల్వే భారీగా ఆదాయం సాధించిపెడుతోంది. కానీ ఈ ప్రాంతానికి ప్రాజెక్టులు మాత్రం దక్కడం లేదు. గత 13 ఏళ్ల కాలంలో ఇక్కడ కేవలం 550 కిలోమీటర్ల మేర మాత్రమే డబ్లింగ్ పనులు జరిగాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కొత్త రైళ్ల ఊసే పట్టదు.. హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-చెన్నై, సికింద్రాబాద్-బెంగళూరు, సికింద్రాబాద్-వాస్కోడిగామా (గోవా), హైదరాబాద్-నాందేడ్, హైదరాబాద్- ఢిల్లీ, హైదరాబాద్-షిర్డీ లాంటి ముఖ్యమైన మార్గాల్లో కొత్త రైళ్లు కావాలని గత బడ్జెట్ సమయంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రతిపాదించారు. కానీ కేంద్ర ప్రభుత్వం వీటిని అసలు పట్టించుకోనేలేదు. ఇచ్చేదే కొంత.. అందులోనూ కోత.. గత బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వేకు కేటాయించిన నిధులు రూ. 4,164 కోట్లు. ఇందులో ప్రణాళిక పద్దు కింద అభివృద్ధి పనులకు కేటాయించింది రూ. 2,175 కోట్లే. అంతకుముందు బడ్జెట్ కంటే ఇవి కేవలం రూ. 315 కోట్లు మాత్రమే ఎక్కువ. అయితే.. ఇందులోనూ నిధులు లేవంటూ దాదాపు రూ. వేయికోట్లకుపైగా కోత పెట్టారు. అంతమేర కాంట్రాక్టర్లకు బకాయిలు పేరుకుపోయాయి. పెండింగ్‌లో ఉన్న ముఖ్యమైన ప్రాజెక్టులు.. * కాజీపేటలో వ్యాగన్ తయారీ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నట్టు ఐదేళ్ల కింద ప్రకటించారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం భూమిని సేకరించి దాదాపు ఏడాదిన్నర కింద రైల్వేకు అప్పగించింది. అయినా ఇప్పటి వరకు పనులు మొదలు కాలేదు. * కాజీపేట-విజయవాడ మార్గంలో మూడో లైన్ పనులకు 2012 బడ్జెట్లో చోటు దక్కింది. రూ. 1,054 కోట్లతో జరగాల్సిన 200 కిలోమీటర్ల పని పెండింగ్‌లో ఉంది. * పెద్దపల్లి-నిజామాబాద్: 20 ఏళ్ల కింద మంజూరైన ప్రాజెక్టులో రూ. 925 కోట్ల వ్యయంతో 178 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ నిర్మాణం చేపట్టగా.. ఇంకా 30 కి.మీ పని మిగిలే ఉంది. * గుల్బర్గా-బీదర్: 107 కిలోమీటర్ల మార్గంలో కొంతే పూర్తయింది. నిధులు లేక 50 కిలోమీటర్ల పని నిలిచిపోయింది. * మునీరాబాద్-మహబూబ్‌నగర్: 247 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం నిధులను భరిస్తోంది. అయినా పనులు మాత్రం పూర్తికావటం లేదు. * మహబూబ్‌నగర్-గుత్తి, సికింద్రాబాద్-ముద్ఖేడ్-ఆదిలాబాద్, మంచిర్యాల-మందమర్రి డబ్లింగ్ పనులదీ అదే గతి. * గత బడ్జెట్లో సికింద్రాబాద్‌లో రైల్వే ఫైనాన్స్ విభాగం అధికారుల శిక్షణ కేంద్రం (సెంట్రలైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఫైనాన్స్ ఆఫీసర్స్), కాజీపేటలో ఉద్యోగుల సామర్థ్యం పెంపు శిక్షణ కేంద్రాలను మంజూరు చేశారు. కానీ పనుల ఊసేలేదు. సికింద్రాబాద్ స్టేషన్‌ను పట్టించుకోరేం? రోజుకు లక్షన్నర మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దాలన్న ప్రతిపాదనను పూర్తిగా పక్కనపెట్టేశారు. ప్రతి బడ్జెట్లో దీనిని ప్రస్తావిస్తున్నా నిధులు మాత్రం కేటాయించడం లేదు. ఉగ్రవాదుల నుంచి ప్రమాదమున్న నేపథ్యంలోనూ ఇక్కడ కనీస భద్రతా చర్యలు లేవు. సీసీ కెమెరాలకూ కొరతే. చివరకు ప్రయాణికులకు సరిపడా మూత్రశాలలు, మంచినీటి వసతి కూడా సరిగా లేదు. పది ప్లాట్‌ఫామ్‌లు మాత్రమే ఉండటంతో అవి సరిపోక నగర శివారులో ఒక్కో రైలును అరగంట నుంచి గంటపాటు నిలిపివేయాల్సిన దుస్థితి నెలకొంది. -
12 నుంచి తెలంగాణ బడ్జెట్ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ కోసం కసరత్తును ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నారు. ఆర్థిక మంత్రి వివిధ శాఖల మంత్రులు, ఆ శాఖల ముఖ్యకార్యదర్శులతో పదిరోజుల పాటు వరుసగా సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో ఆయా శాఖల మంత్రులు, కార్యదర్శులు ఇచ్చే ప్రతిపాదనలను అధ్యయనం చేయనున్నట్లు ఈటెల వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యతలు, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా బడ్జెట్‌కు రూపకల్పన చేస్తామన్నారు. మొదటి ఆరునెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ముందుగానే ఉమ్మడి సభలో ఆమోదించినందున అక్టోబర్ నుంచి మార్చి నెలాఖరు వరకు అవసరమైన పూర్తిస్థాయి బడ్జెట్‌కు ఆర్థిక శాఖ రూపకల్పన చేస్తుందని తెలిపారు. ఇదిలాఉండగా, ఆగస్టు చివరి వారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. -
ఇంటి బడ్జెట్‌ను పెంచనున్న మోడీ ప్రభుత్వం
ఢిల్లీ: రైలు చార్జీలు పెంచిన ఎన్డిఏ ఆధ్వర్యంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఇంటి బడ్జెట్‌ను పెంచనుంది. ఈ విషయంలో కేంద్రం పేదలను కూడా వదిలి పెట్టడంలేదు. మధ్యతరగతి, ధనిక వర్గాలు వారు ఉపయోగించే వంట గ్యాస్ ధరలతోపాటు పేదలు ఉపయోగించే కిరోసిన్ ధరను కూడా పెంచే యోచనలో కేంద్రం ఉంది. కిరోసిన్, గ్యాస్ ధరలు పెంచాలని చమురు మంత్రిత్వ శాఖ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. వంట గ్యాస్‌కు సిలిండర్‌పై 5 రూపాయలు, కిరోసిన్‌పై లీటర్‌కు ఒక రూపాయి పెరిగే అవకాశం ఉంది. దీంతో అన్ని వర్గాల ఇంటి బడ్జెట్ పెరిగిపోతుంది.