12 నుంచి తెలంగాణ బడ్జెట్ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ కోసం కసరత్తును ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నారు. ఆర్థిక మంత్రి వివిధ శాఖల మంత్రులు, ఆ శాఖల ముఖ్యకార్యదర్శులతో పదిరోజుల పాటు వరుసగా సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో ఆయా శాఖల మంత్రులు, కార్యదర్శులు ఇచ్చే ప్రతిపాదనలను అధ్యయనం చేయనున్నట్లు ఈటెల వివరించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యతలు, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా బడ్జెట్‌కు రూపకల్పన చేస్తామన్నారు. మొదటి ఆరునెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ముందుగానే ఉమ్మడి సభలో ఆమోదించినందున అక్టోబర్ నుంచి మార్చి నెలాఖరు వరకు అవసరమైన పూర్తిస్థాయి బడ్జెట్‌కు ఆర్థిక శాఖ రూపకల్పన చేస్తుందని తెలిపారు. ఇదిలాఉండగా, ఆగస్టు చివరి వారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.