Budget 2014
-
నిరాశ పరిచిన బడ్జెట్
టీడీపీ ప్రభుత్వం జిల్లాకు మొండిచేయి చూపింది. ఏవేవో ఆశలు కల్పించి చివరకు నిరాశ మిగిల్చింది. బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై జిల్లా ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఒక విధంగా జిల్లాను పూర్తిగా విస్మరించారని వివిధ రంగాల నిపుణులు, ఆర్థిక వేత్తలు అభిప్రాయపడ్డారు. చివరకు నీటి పారుదల ప్రాజెక్టులకూ నిధులు కేటాయించలేదు. సాక్షి ప్రతినిధి, విజయనగరం : నవ్వాంధ్రప్రదేశ్ తొలి బడ్జెట్లో జిల్లాకు అన్యాయం చేశారు. బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2014-15 బడ్జెట్లో టీడీపీ ప్రభుత్వం జిల్లాను పూర్తిగా విస్మరించింది. కొత్త ప్రాజెక్టుల ప్రస్తావన పక్కన పెడితే ప్రగతిలో ఉన్న ప్రాజెక్టులకే నిధులు కేటాయించలేదు. అత్తెసరు కేటాయింపులతో చేతులు దులుపుకొంది. గిరిజన యూనివర్సిటీ ప్రస్తావనే లేదు. ఆశలురెకెత్తించిన కొత్త ఎయిర్ పోర్ట్ అంశాన్నే చేర్చలేదు. ఊరిస్తున్న వైద్య కళాశాల ఊసే లేదు. వెనుక బడిన జిల్లాగా ఆదుకునే ప్రత్యేక ప్యాకేజీ సాయమేది కేటాయించలేదు. ఇదంతా చూస్తుంటే అంతన్నాడు...ఇంతన్నాడు..అన్న చందంగా బడ్జెట్ మిగిలిపోయింది. చారిత్రాత్మక, అన్నీ వర్గాల ఆకట్టుకునే బడ్జెట్ అంటూ గొప్పలు పలికిన టీడీపీ ప్రజాప్రతినిధులు జిల్లాకు సాధించిందేంటో చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర విభజనతో జిల్లాకు ఏదో ఒరుగుతుందనుకుంటే బడ్జెట్లో ప్రత్యేకతేమీ లేకపోవడంతో ప్రజల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. కొత్తగా ఏ ఒక్కటీ మంజూరు చేసిన దాఖలాలు బడ్జెట్లో కనిపించలేదు. పొరుగు జిల్లాలకు ఒకటి రెండు ప్రాజెక్టులను కేటాయించినా విజయనగరం జిల్లాకొచ్చేసరికి పూర్తిగా వివక్ష చూపింది. అంకెల బడ్జెట్ రాష్ట్ర విభజన అనంతరం తొలి సారిగా టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం గారెడీని తలపిస్తోంది. వాస్తవ బడ్జెట్‌కు ఆమడదూరంలో ఉంది. ఆర్థిక మంత్రి యనమల తన అనుభవాన్ని ఉపయోగించి బడ్జెట్‌ను రూపొందించారు. బడ్జెట్ వల్ల ప్రజలకు నేరుగా లబ్ధిచేకూరే పరిస్థితి లేదు. ప్రధానంగా హౌసింగ్‌కు కేటాయించిన నిధులు పాత బిల్లులు మంజూరుకే సరిపోతుంది. ఇలా అయితే ఈ ఏడాదిలో నిరుపేదలకు కొత్త ఇళ్ల మం జూరు లేనట్లే. ఎన్నికలకు ముందు టీడీపీ నాయకులు ప్రకటించిన హమీలకు ప్రస్తుత బడ్జెట్‌కు పొంతన లేదు. ఈ బడ్జెట్ ప్రజామోదయోగ్యమైనది కాదు. - కోలగట్ల వీరభద్రస్వామి, వైఎస్ఆర్సీపీ విజయనగరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి జిల్లాకు ద్రోహం చేశారు బడ్జెట్లో జిల్లాకు దారుణంగా ద్రోహం చేశారు. ఇరిగేషన్‌తో పాటు జిల్లా అభివృద్ధిపై దృష్టిపెట్టలేదు. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ అన్నారు. బడ్జెట్లో మాత్రం ఆ ప్రస్తావన లేకపోవడం ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేయడమే. బడ్జెట్లో ప్రస్తావించిన అంకెలు అబద్ధం. అవి ఆచరణకు సాధ్యం కాదు. - ఎం.కృష్ణమూర్తి, సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రజలను విస్మరించారు ప్రజాసంక్షేమం అనేపదాన్ని బడ్జెట్లో పూర్తిగా విస్మరించారు. అపార అనుభవం ఉందని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తమ అనుభవాన్ని ప్రజలను మోసం చేసేందుకు ఉపయోగించారు. ఆచరణకు సాధ్యంకాని బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మిగలు బడ్జెట్ ఎంత, లోటు బడ్జెట్ ఎంత అన్నది ప్రస్తావించలేదు. వ్యవసాయ రంగానికి రూ. 15వేల కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. అది ఎక్కడ నుంచి తీసుకొస్తారో చెప్పలేదు. ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రకటించిన రుణమాఫీపై ప్రస్తావనలేకపోవడం అత్యంత దారుణం. విద్య, వైద్యం, సంక్షేమరంగాలపై చిన్నచూపు చూశారు. - పి.కామేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి -
మధ్య తరగతికి ‘బడ్జెట్’ గాలం..!
న్యూఢిల్లీ: నగరంలో మధ్యతరగతి వర్గాల ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు భారతీయ జనతా పార్టీ ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తోంది. జాతీయ రాజధానిలో సుమారు 5 నెలలుగా రాష్ట్రపతి పాలన నడుస్తోన్న విషయం తెలిసిందే. కాగా, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అదే ఊపులో ఢిల్లీలో కూడా ఎన్నికలు జరిపిస్తే తమకు అనుకూల ఫలితాలు వస్తాయని ఆశిస్తున్న రాష్ట్ర బీజేపీ నాయకులు ఆ దిశలో అడుగులు వేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను బీజేపీకి 32, ఆమ్ఆద్మీ పార్టీకి 28, కాంగ్రెస్‌కు 8 స్థానాలు దక్కాయి. అప్పుడు ఆప్, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా 49 రోజులపాటు అధికారంలో కొనసాగిన తర్వాత ఆ ప్రభుత్వం పడిపోయింది. అయితే అప్పుడు కేవలం 4 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం కోల్పోయిన తాము ఈసారి మోడీ హవాలో పూర్తి మెజారిటీతో ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగలుగుతామని ఆ పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో నగర బీజేపీ శాఖ ‘బడ్జెట్ పర్ చర్చ’కు శ్రీకారం చుట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో నగరానికి చెందిన పలు సమస్యలపై స్థానికులతో భేటీ ఏర్పాటుచేశారు. ఇందులో భాగంగా శనివారం ద్వారకా ప్రాంత వాసులు కేంద్ర మంత్రి జైట్లీని కలిసి తమ ప్రాంతంలో సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యపై చర్చించారు. జైట్లీతో భేటీ సమయంలో ద్వారకా సీజీహెచ్ఎస్ ఫెడరేషన్ సభ్యులు అక్కడ ‘వుయ్ వాంట్ వాటర్’ అనే ప్లకార్డ్‌ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ..‘ మేం కేంద్ర మంత్రి ఎదుట ఆందోళన చేయలేదు. మా సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లాలనుకున్నాం. ఢిల్లీలో ప్రభుత్వం లేదు. మా సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే దగ్గర నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ వరకు అందరినీ కలిశాం. అయినా ఏం ఫలితం లేకుండా పోయింది. బడ్జెట్లో నగరంలోని నీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించింది. మా ప్రాంత సమస్యను పరిష్కరించమని కోరడానికే మేం మంత్రిని కలిశాం..’ అని ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి సుధాసిన్హా తెలిపారు. తమ ప్రాంతానికి ప్రతిరోజూ 12 ఎంజీడీ నీళ్లు అవసరముండగా కేవలం 3.5 మిలియన్ గ్యాలన్లు మాత్రమే సరఫరా అవుతోందని వారు వాపోయారు.‘ఇక్కడ గెలిచిన ప్రభుత్వాలు కేవలం వాగ్దానాలే పేర్కొంది. అయితే నగరంలో 1,518 అనధికార కాలనీలున్నాయి. వాటి అభివృద్ధికి కేటాయించిన రూ.3,000 కోట్ల నిధులను విభజిస్తే ఒక్కో కాలనీకి రూ.2 కోట్లు మాత్రమే మిగులుతాయి. ఆ నిధులతో సదరు మురికివాడలో అభివృద్ధి పనులు ఏమేరకు నడుస్తున్నాయో మనకు తెలిసిందే.. ఆయా కాలనీల్లో మురుగునీటి వ్యవస్థ ఏర్పాటు నిర్ణయం 2013 తర్వాత తీసుకుందే.. దీంతో కాంగ్రెస్ సర్కార్‌కు ఎటువంటి సంబంధం లేదు.. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ విషయంపై బీజేపీ, ఆప్ రాద్ధాంతం చేస్తున్నాయ’ని ఆయన ఆరోపించారు. తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే మిగిలిన అనధికార కాలనీలనూ అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారం నుంచి తప్పుకున్న తర్వాత ఇప్పటివరకు ఆయా మురికివాడల్లో ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదని విమర్శించారు. గుజరాత్లో రూ.27,600 కోట్ల అవకతవకలు జరిగినట్లు బయటపెట్టిన కాగ్ నివేదికపై బీజేపీ, ఆప్ ఎందుకు మాట్లాడటంలేదని కాంగ్రెస్ నాయకుడు హరూన్ యూసుఫ్ ప్రశ్నించారు. ఇదిలా ఉండగా, డీపీసీసీ అధికార ప్రతినిధి ముఖేశ్ శర్మ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి ఒక పారిశ్రామికవేత్త సాయంతో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు వలస పోతున్నారని తమకు సమాచారముందన్నారు. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కేజ్రీవాల్ జాగ్రత్త పడాలని ఆయన హితవు పలికారు. -
ఎంఎస్ఎంఈకి బడ్జెట్ జోష్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారతీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా(ఎంఎస్ఎంఈ) పరిశ్రమల రంగానికి మంచి రోజులని చెప్పడానికి బడ్జెట్ ప్రతిపాదనలే నిదర్శనమని పారిశ్రామిక వర్గాలు అంటున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు రూ.10 వేల కోట్ల ఫండ్ కేటాయించడంతో ఎంఎస్ఎంఈ రంగం కొత్త పుంతలు తొక్కేందుకు పునాది పడిందని చెబుతున్నాయి. అదే స్థాయిలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నది నిపుణుల మాట. జీడీపీలో తయారీ రంగం వాటా ప్రస్తుతం 15-16 శాతంగా ఉంది. రానున్న రోజుల్లో ఇది 25 శాతానికి చేరవచ్చని నిపుణులు అంటున్నారు. మరింత మంది ముందుకు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వేలాది మంది పారిశ్రామికవేత్తలు వ్యాపార, వాణిజ్య రంగంలో విజయవంతంగా రాణిస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో మరింత మంది వ్యాపారం చేసేందుకు ముందుకు వస్తారని అసోచాం దక్షిణ భారత చైర్మన్, శ్రీసిటీ ఎండీ రవి సన్నారెడ్డి అన్నారు. ప్రభుత్వ తోడ్పాటు ఒక్కటే సరిపోదని, చిన్న కంపెనీల వ్యాపారాభివృద్ధికి భారీ పరిశ్రమలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. భారీ పరిశ్రమల కంటే ఎంఎస్ఎంఈలే ఉద్యోగావకాశాలకు అధికంగా కల్పిస్తాయన్నారు. తయారీకి ఊతమిచ్చేలా బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయని ఎలికో ఎండీ రమేష్ దాట్ల తెలిపారు. మూడు రెట్ల వృద్ధి.. దేశీయ పారిశ్రామిక ఉత్పత్తిలో ఎంఎస్ఎంఈ వాటా ప్రస్తుతం 45 శాతంపైగా ఉంది. ఎగుమతుల్లో ఈ రంగం వాటా 40 శాతంపై మాటే. ఈ రంగంలో 3 కోట్లకుపైగా కంపెనీలున్నాయి. 6-7 కోట్ల మంది పనిచేస్తున్నారు. ఏటా కొత్తగా 13 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందీ రంగం. బడ్జెట్ ప్రతిపాదనలు కార్యరూపంలోకి వస్తే మూడేళ్లలో ఎంఎస్ఎంఈల వ్యాపారం రెండు మూడు రెట్లు పెరగడం ఖాయమని విశ్లేషకులు, స్కార్లెట్ ఇండస్ట్రీస్ ఎండీ మండవ శ్రీరామ్ మూర్తి తెలిపారు. దేశవ్యాప్తంగా కొత్త కంపెనీలు వెల్లువలా ఏర్పాటవుతాయని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చే ప్రోత్సాహకాలు ఏమిటో కేంద్రం నుంచి స్పష్టత వస్తే.. ఈ రెండు రాష్ట్రాల్లో కొత్త ప్లాంట్లు ఏర్పాటై పారిశ్రామిక అభివృద్ధి దూసుకెళ్తుందని చెప్పారు. వెల్లువలా ప్రైవేటు ఈక్విటీలు.. చక్కని వ్యాపార ప్రణాళికలున్నా నిధులు లేక కార్యరూపంలోకి రాని ప్రతిపాదనలు ఎన్నో ఉన్నాయి. స్టార్టప్‌ల ఏర్పాటుకు రూ.10 వేల కోట్లు కేటాయించడం పెద్ద సంచలనమేనని, రానున్నది స్టార్టప్ ఇండియా అని ఎస్ఈసీ ఇండస్ట్రీస్ ఎండీ డి.విద్యాసాగర్ అన్నారు. ప్రభుత్వం తీసుకున్న చొరవ కారణంగా స్టార్టప్‌లకు అదనపు నిధులు సమకూర్చేందుకు ప్రైవేటు ఈక్విటీ సంస్థలు ముందుకు వస్తాయని పేర్కొన్నారు. రక్షణ రంగంలో ఎఫ్‌డీఐల పరిమితిని 26 నుంచి 49కి చేర్చారు. దీంతో రక్షణ రంగ పరికరాల తయారీ దేశీయంగా అధికమవుతుందని అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇక్కడి కంపెనీలకు బదిలీ అవుతుందని, చిన్న కంపెనీలకు సబ్ కాంట్రాక్టులు ఎక్కువ అవుతాయని వివరించారు. -
ఎలక్ట్రానిక్స్ రంగానికి వరాలు !
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ వృద్ధికి దోహదపడే పలు చర్యలను ఆర్థిక మంత్రి బడ్జెట్లో ప్రతిపాదించారని ఈ పరిశ్రమ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రతిపాదనల కారణంగా దేశీయ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ జోరు పెరుగుతుందని, ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ఆ వర్గాలు అంటున్నాయి. 1. టెలికాం, ఐటీ ఉత్పత్తుల దిగుమతులపై 10 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ(బీసీడీ)ని విధింపు. దేశీయ ఉత్పత్తికి ఊతమివ్వడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం లక్ష్యాలుగా ఈ చర్య తీసుకున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అగ్రిమెంట్ 1లో లేని ఐటీ, టెలికాం ఉత్పత్తులకు ఈ సుంకం వర్తిస్తుంది. ఈ చర్య కారణంగా వీఓఐపీ ఫోన్లు, కొన్ని టెలికాం నెట్వర్క్ ఉత్పత్తుల తయారీకి ప్రోత్సాహం లభిస్తుంది. 2. పర్సనల్ కంప్యూటర్ల తయారీలో ఉపయోగించే విడిభాగాలపై ప్రస్తుతం విధిస్తున్న 4 శాతం స్పెషల్ అడిషనల్ డ్యూటీ(ఎస్ఏడీ)ను తొలగించారు. దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై విద్యా సుంకాన్ని విధించారు. ఫలితంగా దేశీయంగా తయారయ్యే ఉత్పత్తుల ధర, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తుల ధర ఒకే విధంగా ఉంటుంది. 3. కలర్ పిక్చర్ ట్యూబ్‌లపై దిగుమతి సుంకం తొలగింపు. దీంతో వీటి ధరలు మరింతగా తగ్గుతాయి. 4. 19 అంగుళాల లోపు ఎల్ఈడీ, ఎల్సీడీ టీవీల తయారీలో ఉపయోగపడే స్క్రీన్లపై 10 శాతంగా ఉన్న బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని పూర్తిగా తొలగించారు. ఫలితంగా వీటి ధరలు తగ్గుతాయి. 5. ఒక ఏడాదిలో రూ. 25 కోట్లకు మించిన పెట్టుబడులపై 15% మూలధన ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఫలి తంగా ఎంఎస్ఎంఈలో పెట్టుబడుల పెరుగుతాయి. -
ఎంఎస్ఎంఈకి ఊతమివ్వాలి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలకు ఊతమిచ్చేలా కొత్త బడ్జెట్ ఉంటుందని ఫ్యాప్సీ భావిస్తోంది. వ్యాపారానికి అనువైన వాతావరణాన్ని కల్పించే దిశగా నరేంద్ర మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న అంచనాలున్నాయని ఫ్యాప్సీ ప్రెసిడెంట్ శివ్‌కుమార్ రుంగ్టా తెలిపారు. జూలై 10న కేంద్ర ప్రభుత్వం ప్రకటించబోయే బడ్జెట్లో పారిశ్రామిక రంగం ఏం కోరుకుంటోందో ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోకు వివరించారు. ఆయనింకా ఏమన్నారంటే.. మూతపడ్డ కంపెనీలను.. ఔత్సాహిక యువత వ్యాపార రంగంలోకి అడుగిడేలా స్నేహపూర్వక వాతావరణం కల్పించాలి. వ్యాపార అనుమతుల విషయంలో అకారణ జాప్యాన్ని (రెడ్ టేపిజం) నివారిస్తూ సింగిల్ విండో విధానాన్ని అమలు చేయాలి. ఎంఎస్ఎంఈకి ప్రత్యేక ప్యాకేజీ కింద తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వాలి. అధిక వడ్డీలు, నిధుల కొరత, విద్యుత్ సరఫరాలో అవాంతరాలే కంపెనీలు మూతపడడానికి, ఖాయిలాపడడానికి కారణం. ఇలాంటి కంపెనీలకు జీవం పోసే చర్యలు చేపట్టాలి. ఈ కంపెనీల రుణ కాలపరిమితిని పెంచాలి. నిరర్ధక ఆస్థిగా(ఎన్పీఏ) పరిగణించే నిబంధనల్లో మార్పులు చేపట్టాలి. మౌలిక రంగంలో.. కొత్త ప్రభుత్వం ఇన్ఫ్రా ప్రాజెక్టులు విరివిగా చేపడుతుందన్న అంచనాలున్నాయి. ఇండస్ట్రియల్ పార్కుల స్థాపన ద్వారా తయారీని ప్రోత్సహిస్తారన్న విశ్వాసం పారిశ్రామికవేత్తల్లో నెలకొని ఉంది. ఇదే సమయంలో విద్యుత్ రంగంలో సంస్కరణలు అవసరం. కొన్ని రాష్ట్రాల్లో విద్యుత్ కొరత పట్టిపీడిస్తోంది. ప్రత్నామ్నాయ ఇంధన వనరులైన సౌర, పవన విద్యుత్ కు ఈ బడ్జెట్లో అధిక ప్రోత్సాహం ఉండొచ్చు. తెలంగాణ, సీమాంధ్రలో పరిశ్రమలకు ప్రత్యేక ప్యాకేజీ, మెరుగైన విద్యుత్ దిశగా చర్యలు ఆశిస్తున్నాం. వ్యవసాయ రంగానికి.. ఫుడ్ ప్రాసెసింగ్‌కు పెద్దపీట వేసే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. శీతల గిడ్డంగులను విరివిగా ఏర్పాటు చేసేందుకు కేంద్ర కసరత్తు చేస్తోంది. ఇదే జరిగితే వ్యవసాయ ఉత్పత్తులకు మంచి రోజులొస్తాయి. పండ్లు, కూరగాయలు, ఇతర వ్యవసాయోత్పత్తులు పాడవకుండా నష్ట నివారణ చర్యలు ఉంటాయన్న అంచనాలున్నాయి. వివిధ రంగాల్లో ఇస్తున్న సబ్సిడీలను పునస్సమీక్ష జరిపి, ఈ నిధులను ఇతర రంగాల్లో సద్వినియోగం చేయాలి. ఏటా చదువు పూర్తి చేసుకుంటున్న లక్షలాది మంది విద్యార్థుల నైపుణ్య శిక్షణపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి. ప్రజల్లో పొదుపును ప్రోత్సహించేలా ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పు చేయాలి. -
జైట్లీతో సెబీ చీఫ్ భేటీ
న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) చీఫ్ యూకే సిన్హా గురువారం సమావేశమయ్యారు. సమావేశ వివరాలు వెన్వెంటనే తెలియరాలేదు. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో జరిగిన ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. సెబీ ఇప్పటికే తన బడ్జెట్ కోర్కెల పత్రాన్ని ఆర్థిక శాఖకు అందజేసింది. కోర్కెల పత్రాన్ని పరిశీలిస్తే... మ్యూచువల్ ఫండ్ మార్కెట్ ఊపునకు మరిన్ని చర్యలు తీసుకోవాలి. క్యాపిటల్ మార్కెట్‌కు సంబంధించి ప్రస్తుత పన్ను వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి. ఉద్యోగుల భవిష్యనిధి(ఈపీఎఫ్ఓ) నిర్వహిస్తున్న రిటైర్మెంట్ ఫండ్స్/మ్యూచువల్ ఫండ్స్ ఆవిష్కరించే పెన్షన్ ప్రొడక్టుల పెట్టుబడులుసహా అన్ని రకాల రిటైర్మెంట్ సంబంధ ఇన్వెస్ట్మెంట్ల విషయంలో ఒకేవిధమైన పన్నుల విధానం ఉండాలి. ప్రభుత్వ రంగ సంస్థలు(పీఎస్‌యూలు) అన్నీ తమ మిగులు నగదును మ్యూచువల్ ఫండ్స్‌లో ఉంచేందుకు అనుమతించాలి. కేంద్ర పీఎస్‌యూల వద్దనున్న నగదు, బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం రూ.3 లక్షల కోట్లుగా అంచనా. స్వల్ప కాలంలో అధిక ఆదాయాన్ని ఆశచూపి అక్రమ పద్ధతుల్లో పెట్టుబడులను ఆకర్షించే (పోంజీ) స్కీముల నిరోధంసహా, సెబీకి మరిన్ని అధికారాలను ఇచ్చే ఆర్డినెన్స్‌ను ఆమోదించాలి. -
12 నుంచి తెలంగాణ బడ్జెట్ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ కోసం కసరత్తును ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నారు. ఆర్థిక మంత్రి వివిధ శాఖల మంత్రులు, ఆ శాఖల ముఖ్యకార్యదర్శులతో పదిరోజుల పాటు వరుసగా సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో ఆయా శాఖల మంత్రులు, కార్యదర్శులు ఇచ్చే ప్రతిపాదనలను అధ్యయనం చేయనున్నట్లు ఈటెల వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యతలు, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా బడ్జెట్‌కు రూపకల్పన చేస్తామన్నారు. మొదటి ఆరునెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ముందుగానే ఉమ్మడి సభలో ఆమోదించినందున అక్టోబర్ నుంచి మార్చి నెలాఖరు వరకు అవసరమైన పూర్తిస్థాయి బడ్జెట్‌కు ఆర్థిక శాఖ రూపకల్పన చేస్తుందని తెలిపారు. ఇదిలాఉండగా, ఆగస్టు చివరి వారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. -
ఇంటి బడ్జెట్‌ను పెంచనున్న మోడీ ప్రభుత్వం
ఢిల్లీ: రైలు చార్జీలు పెంచిన ఎన్డిఏ ఆధ్వర్యంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఇంటి బడ్జెట్‌ను పెంచనుంది. ఈ విషయంలో కేంద్రం పేదలను కూడా వదిలి పెట్టడంలేదు. మధ్యతరగతి, ధనిక వర్గాలు వారు ఉపయోగించే వంట గ్యాస్ ధరలతోపాటు పేదలు ఉపయోగించే కిరోసిన్ ధరను కూడా పెంచే యోచనలో కేంద్రం ఉంది. కిరోసిన్, గ్యాస్ ధరలు పెంచాలని చమురు మంత్రిత్వ శాఖ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. వంట గ్యాస్‌కు సిలిండర్‌పై 5 రూపాయలు, కిరోసిన్‌పై లీటర్‌కు ఒక రూపాయి పెరిగే అవకాశం ఉంది. దీంతో అన్ని వర్గాల ఇంటి బడ్జెట్ పెరిగిపోతుంది. -
ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టాం
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిందంటూ ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలను ఆర్థిక మంత్రి పి. చిదంబరం తిప్పికొట్టారు. క్లిష్ట పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలోపెట్టడంలో తాము సమర్థంగా వ్యవహరించామని పేర్కొన్నారు. మళ్లీ అధిక వృద్ధిబాటలోకి వచ్చేలా అనేక చర్యలు చేపట్టినట్లు విత్తమంత్రి చెప్పారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనంతరం పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. ప్రజాకర్షక బడ్జెట్‌గా దీన్ని అభివర్ణించడాన్ని ఆయన తోసిపుచ్చారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ప్రభుత్వాల మాదిరిగానే గత రెండుమూడేళ్లుగా తాము కూడా ఆర్థిక వ్యవస్థ మందగమనానికి చికిత్స కోసం ప్రయత్నించాల్సి వచ్చిందని విత్తమంత్రి వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(క్యూ1)లో జీడీపీ వృద్ధిరేటు 4.4 శాతానికి పడిపోగా... క్యూ2లో 4.8 శాతానికి పెరగిందన్నారు. కేంద్రీయ గణాంకాల సంస్థ(సీఎస్ఓ) అంచనాల మేరకు క్యూ3, క్యూ4లలో కనీసం 5.2 శాతం వృద్ధి చెందనుందని చిదంబరం పేర్కొన్నారు. చాలా కొద్ది దేశాల్లో మాత్రమే ఈ స్థాయి వృద్ధిరేటు నమోదవుతోందన్నారు. పూర్తి ఏడాదికి వృద్ధి రేటు 4.9 శాతంగా ఉండొచ్చని సీఎస్ఓ ముందస్తు అంచనాల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. పూర్తి సంతృప్తి లేదు... ‘మా ప్రభుత్వ పనితీరుపై పూర్తిగా సంతృప్తి చెందడం లేదు. అయితే, కొన్ని లక్ష్యాలను సాకారం చేయడం విషయంలో మేం విజయం సాధించాం. భవిష్యత్తులో భారత్ ప్రబల ఆర్థికశక్తిగా ఎదిగేందుకు అవసరమైన పది సూత్రాల ప్రణాళికను కూడా నా బడ్జెట్ ప్రసంగం చివర్లో వివరించాను. వీటిని అమలు చేస్తే కచ్చితంగా అధిక వృద్ధి బాటలో పయనించగలుగుతాం’ అని చిదంబరం పేర్కొన్నారు. వస్తు, సేవల పన్ను(జీఎస్టీ), ప్రత్యక్ష పన్నుల కోడ్(డీటీసీ), బీమాలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) పెంపు ఇతరత్రా కొన్ని బిల్లులు ఆమోదం పొందకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటి ఆమోదానికి ఏకాభిప్రాయాన్ని తీసుకురాలేకపోయామని చెప్పారు. పలు అంశాలపై ఇంక ఆయన ఏమన్నారంటే... ఓటాన్ అకౌంట్‌కు స్పందనపై... వాస్తవానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో సాదాసీదాగా ఎలాంటి కీలక చర్యలూ ఉండవని(నాన్-ఈవెంట్) అందరూ భావిస్తారు. కానీ, దీనిపై కూడా వెల్లువెత్తుతున్న స్పందనలను చూస్తుంటే... మా మద్దతుదారులతో పాటు విమర్శకుల దృష్టినీ ఆకర్షించాం. మేం కొన్ని చర్యలు చేపట్టామని అందరూ గుర్తించారు. గతేడాది మేం ఇన్వెస్టర్ల విశ్వాసం పెంపు, రేటింగ్ ఏజెన్సీలకు తగిన హామీ ఇచ్చేలా చర్యలు తీసుకోవడంపై దృష్టిసారించాం. అందుకే ఎలాంటి పన్ను తగ్గింపులకు ఆస్కారం లేకుండా పోయింది. అయితే, గత 5 నెలలుగా తయారీ, యంత్ర పరికరాలు, కన్సూమర్ డ్యూరబుల్స్ రంగాలు దిగజారడంతో మధ్యంతర బడ్జెట్లో ఎక్సైజ్ సుంకాల్లో కోత చర్యలు ప్రకటించాం. సబ్సిడీలపై... సబ్సిడీలకు ఎడాపెడా డబ్బు ఖర్చుపెట్టారన్న విమర్శలు రాజకీయంగా సర్వసాధారణం. దేశంలో అత్యధిక శాతం మంది ప్రజలకు చౌకగా ఆహారధాన్యాలు, కిరోసిన్ అవసరం ఉంది. వీళ్ల డిమాండ్లక ఏ ప్రభుత్వమైనా తలొగ్గాల్సిందే. పార్లమెంట్లో, కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో అత్యధిక శాతం మంది డిమాండ్ చేశారు కాబట్టే మేం సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్ల సంఖ్యను 12కు పెం చాం(రాహుల్ గాంధీ డిమాండ్ చేశారనే ఈ చర్యలు తీసుకున్నారా అనే ప్రశ్నకు). పసిడి నియంత్రణలపై... బంగారం దిగుమతులపై నియంత్రణలను తొలగించే అంశాన్ని పరిశీలిస్తామని చిదంబరం పేర్కొన్నారు. ఈ ఏడాది(2013-14) కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) జీడీపీలో 2.5% దిగువకు(45 బిలియన్ డాలర్లు) కట్టడికానున్న నేపథ్యంలో దీనిపై దృష్టిసారిస్తామన్నారు. బంగారం దిగుమతులు భారీగా ఎగబాకడంతో క్యాడ్ గతేడాది చరిత్రాత్మక గరిష్టాన్ని(4.8%) తాకడం తెలిసిందే. దీంతో వీటికి అడ్డుకట్టవేయడం కోసం పసిడిపై దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం దశలవారీగా 10%కి పెంచడం విదితమే.