హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలకు ఊతమిచ్చేలా కొత్త బడ్జెట్ ఉంటుందని ఫ్యాప్సీ భావిస్తోంది. వ్యాపారానికి అనువైన వాతావరణాన్ని కల్పించే దిశగా నరేంద్ర మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న అంచనాలున్నాయని ఫ్యాప్సీ ప్రెసిడెంట్ శివ్‌కుమార్ రుంగ్టా తెలిపారు. జూలై 10న కేంద్ర ప్రభుత్వం ప్రకటించబోయే బడ్జెట్‌లో పారిశ్రామిక రంగం ఏం కోరుకుంటోందో ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోకు వివరించారు.
ఆయనింకా ఏమన్నారంటే.. మూతపడ్డ కంపెనీలను..
ఔత్సాహిక యువత వ్యాపార రంగంలోకి అడుగిడేలా స్నేహపూర్వక వాతావరణం కల్పించాలి. వ్యాపార అనుమతుల విషయంలో అకారణ జాప్యాన్ని (రెడ్ టేపిజం) నివారిస్తూ సింగిల్ విండో విధానాన్ని అమలు చేయాలి. ఎంఎస్‌ఎంఈకి ప్రత్యేక ప్యాకేజీ కింద తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వాలి. అధిక వడ్డీలు, నిధుల కొరత, విద్యుత్ సరఫరాలో అవాంతరాలే కంపెనీలు మూతపడడానికి, ఖాయిలాపడడానికి కారణం. ఇలాంటి కంపెనీలకు జీవం పోసే చర్యలు చేపట్టాలి. ఈ కంపెనీల రుణ కాలపరిమితిని పెంచాలి. నిరర్ధక ఆస్థిగా(ఎన్‌పీఏ) పరిగణించే నిబంధనల్లో మార్పులు చేపట్టాలి.
మౌలిక రంగంలో..
కొత్త ప్రభుత్వం ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు విరివిగా చేపడుతుందన్న అంచనాలున్నాయి. ఇండస్ట్రియల్ పార్కుల స్థాపన ద్వారా తయారీని ప్రోత్సహిస్తారన్న విశ్వాసం పారిశ్రామికవేత్తల్లో నెలకొని ఉంది. ఇదే సమయంలో విద్యుత్ రంగంలో సంస్కరణలు అవసరం. కొన్ని రాష్ట్రాల్లో విద్యుత్ కొరత పట్టిపీడిస్తోంది. ప్రత్నామ్నాయ ఇంధన వనరులైన సౌర, పవన విద్యుత్ కు ఈ బడ్జెట్‌లో అధిక ప్రోత్సాహం ఉండొచ్చు. తెలంగాణ, సీమాంధ్రలో పరిశ్రమలకు ప్రత్యేక ప్యాకేజీ, మెరుగైన విద్యుత్ దిశగా చర్యలు ఆశిస్తున్నాం.
వ్యవసాయ రంగానికి..
ఫుడ్ ప్రాసెసింగ్‌కు పెద్దపీట వేసే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. శీతల గిడ్డంగులను విరివిగా ఏర్పాటు చేసేందుకు కేంద్ర కసరత్తు చేస్తోంది. ఇదే జరిగితే వ్యవసాయ ఉత్పత్తులకు మంచి రోజులొస్తాయి. పండ్లు, కూరగాయలు, ఇతర వ్యవసాయోత్పత్తులు పాడవకుండా నష్ట నివారణ చర్యలు ఉంటాయన్న అంచనాలున్నాయి. వివిధ రంగాల్లో ఇస్తున్న సబ్సిడీలను పునస్సమీక్ష జరిపి, ఈ నిధులను ఇతర రంగాల్లో సద్వినియోగం చేయాలి. ఏటా చదువు పూర్తి చేసుకుంటున్న లక్షలాది మంది విద్యార్థుల నైపుణ్య శిక్షణపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి. ప్రజల్లో పొదుపును ప్రోత్సహించేలా ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పు చేయాలి.
ఎంఎస్‌ఎంఈకి ఊతమివ్వాలి
Published Tue, Jul 8 2014 12:59 AM | Last Updated on Sat, Sep 2 2017 9:57 AM
Advertisement
Advertisement