జైట్లీతో సెబీ చీఫ్ భేటీ
న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) చీఫ్ యూకే సిన్హా గురువారం సమావేశమయ్యారు. సమావేశ వివరాలు వెన్వెంటనే తెలియరాలేదు. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో జరిగిన ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. సెబీ ఇప్పటికే తన బడ్జెట్ కోర్కెల పత్రాన్ని ఆర్థిక శాఖకు అందజేసింది.
కోర్కెల పత్రాన్ని పరిశీలిస్తే...
మ్యూచువల్ ఫండ్ మార్కెట్ ఊపునకు మరిన్ని చర్యలు తీసుకోవాలి.
క్యాపిటల్ మార్కెట్‌కు సంబంధించి ప్రస్తుత పన్ను వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి.
ఉద్యోగుల భవిష్యనిధి(ఈపీఎఫ్‌ఓ) నిర్వహిస్తున్న రిటైర్‌మెంట్ ఫండ్స్/మ్యూచువల్ ఫండ్స్ ఆవిష్కరించే పెన్షన్ ప్రొడక్టుల పెట్టుబడులుసహా అన్ని రకాల రిటైర్‌మెంట్ సంబంధ ఇన్వెస్ట్‌మెంట్ల విషయంలో ఒకేవిధమైన పన్నుల విధానం ఉండాలి.
ప్రభుత్వ రంగ సంస్థలు(పీఎస్‌యూలు) అన్నీ తమ మిగులు నగదును మ్యూచువల్ ఫండ్స్‌లో ఉంచేందుకు అనుమతించాలి. కేంద్ర పీఎస్‌యూల వద్దనున్న నగదు, బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం రూ.3 లక్షల కోట్లుగా అంచనా.
స్వల్ప కాలంలో అధిక ఆదాయాన్ని ఆశచూపి అక్రమ పద్ధతుల్లో పెట్టుబడులను ఆకర్షించే (పోంజీ) స్కీముల నిరోధంసహా, సెబీకి మరిన్ని అధికారాలను ఇచ్చే ఆర్డినెన్స్‌ను ఆమోదించాలి.