U.K. Sinha
-
జైట్లీతో సెబీ చీఫ్ భేటీ
న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) చీఫ్ యూకే సిన్హా గురువారం సమావేశమయ్యారు. సమావేశ వివరాలు వెన్వెంటనే తెలియరాలేదు. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో జరిగిన ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. సెబీ ఇప్పటికే తన బడ్జెట్ కోర్కెల పత్రాన్ని ఆర్థిక శాఖకు అందజేసింది. కోర్కెల పత్రాన్ని పరిశీలిస్తే... మ్యూచువల్ ఫండ్ మార్కెట్ ఊపునకు మరిన్ని చర్యలు తీసుకోవాలి. క్యాపిటల్ మార్కెట్‌కు సంబంధించి ప్రస్తుత పన్ను వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి. ఉద్యోగుల భవిష్యనిధి(ఈపీఎఫ్ఓ) నిర్వహిస్తున్న రిటైర్మెంట్ ఫండ్స్/మ్యూచువల్ ఫండ్స్ ఆవిష్కరించే పెన్షన్ ప్రొడక్టుల పెట్టుబడులుసహా అన్ని రకాల రిటైర్మెంట్ సంబంధ ఇన్వెస్ట్మెంట్ల విషయంలో ఒకేవిధమైన పన్నుల విధానం ఉండాలి. ప్రభుత్వ రంగ సంస్థలు(పీఎస్‌యూలు) అన్నీ తమ మిగులు నగదును మ్యూచువల్ ఫండ్స్‌లో ఉంచేందుకు అనుమతించాలి. కేంద్ర పీఎస్‌యూల వద్దనున్న నగదు, బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం రూ.3 లక్షల కోట్లుగా అంచనా. స్వల్ప కాలంలో అధిక ఆదాయాన్ని ఆశచూపి అక్రమ పద్ధతుల్లో పెట్టుబడులను ఆకర్షించే (పోంజీ) స్కీముల నిరోధంసహా, సెబీకి మరిన్ని అధికారాలను ఇచ్చే ఆర్డినెన్స్‌ను ఆమోదించాలి. -
ఇన్వెస్టర్ల ప్రయోజనాలే ముఖ్యం
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నట్లు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చైర్మన్ యూకే సిన్హా శనివారం పేర్కొన్నారు. తమ విధానాన్ని వ్యాపార వర్గాలకు వ్యతిరేకమైనదిగా భావించరాదని సూచించారు. దేశంలో కార్పొరేట్ గవర్నెన్స్ వ్యవస్థకు సంబంధించి ప్రతిపాదించిన నిబంధనలను తదుపరి బోర్డ్ సమావేశంలో పెడతామని తెలియజేశారు. ఇండిపెండెంట్ డెరైక్టర్‌గా ఒక వ్యక్తి ఎన్ని కంపెనీల్లో పనిచేయవచ్చన్న అంశంపై కూడా ఇందులో చర్చ జరుగుతుందని తెలిపారాయన. బోర్డు ఆమోదించాక మార్గదర్శకాలను ప్రకటిస్తామన్నారు. జాతీయ ఎక్స్ఛేంజీల సభ్యుల సంఘం (ఏఎన్ఎంఐ) వార్షిక అంతర్జాతీయ సదస్సులో శనివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యాపార ప్రయోజనాలకు వ్యతిరేకంగా సెబీ పనిచేస్తోందని కొందరు చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ, ఇలాంటి విమర్శలు తమను ఆవేదనకు గురిచేస్తున్నాయని అన్నారు. ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పెంపొందించే చర్యలనే తాము తీసుకుంటున్నామని చెప్పారు. కాగా బీఎస్ఈ, ఎన్ఎస్ఈ, ఇతర స్టాక్ ఎక్స్ఛేంజీల ప్రతినిధులు ఈ సందర్భంగా మాట్లాడుతూ, క్యాపిటల్ మార్కెట్ల పురోభివృద్ధిలో ఇన్వెస్టర్ల విశ్వాస పెంపు చర్యలే కీలకమని వ్యాఖ్యానించారు. -
తెలియకచేసే తప్పుల్ని వేరుగా చూడాలి
ముంబై: స్టాక్ మార్కెట్లో ఇన్సైడర్ ట్రేడింగ్ మోసాలను ఎదుర్కోవడానికి త్వరలో కొత్త నిబంధనలను తీసుకురానున్నామని సెబీ చైర్మన్ యూకే సిన్హా పేర్కొన్నారు. లిస్టెడ్ కంపెనీల స్టాక్స్‌లో ట్రేడింగ్‌కు సంబంధించి టాప్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు, బ్రోకర్లు, ఇతరత్రా ఇన్వెస్టర్లు, సంస్థలు ఎలాంటి ఉల్లంఘనలకూ పాల్పడకుండా నిఘాను మరింత కట్టుదిట్టం చేస్తామని చెప్పారు. అయితే, తీవ్రమైన నేరాలకు తెలియకుండా చేసే ఉల్లంఘనల మధ్య స్పష్టమైన విభజన అనేది ఉండాలని, కొత్త నిబంధనల్లో వీటిని చేరుస్తామని కూడా ఆయన వెల్లడించారు. నిపుణుల కమిటీ, అన్నిపక్షాల అభిప్రాయలనూ పరగణనలోకి తీసుకొని వీటిని ఖరారు చేస్తామన్నారు.